ష్ అమెరికా వింటోంది

 

ఎన్నెన్నో సైనిక రహస్యాలు, ఆయుధాల టెక్నాలజీ, శత్రు దేశాలపై నిఘా, అధికారుల మధ్య జరిగే సీక్రెట్​ సంభాషణలు.. ఒక్కటేమిటి, మిలటరీకి సంబంధించి ఎన్నెన్నో రహస్యాలను అమెరికా వినేస్తోంది. గుట్టుగా స్పై చేసేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. 50 ఏళ్ల నుంచి ఈ తంతు నడుస్తోంది. పైగా పైసలిచ్చి మరీ మనం స్పై చేయించుకుంటున్నామంటే అతిశయోక్తి కాదు. ఇండియా సహా 62 దేశాలపై అమెరికాతో పాటు, జర్మనీ నిఘా వేశాయి. ఆయా దేశాల గుట్టులన్నింటినీ గంపగుత్తగా దోచేశాయి. ‘21వ శతాబ్దపు అతిపెద్ద  గూఢచర్యం’గా పిలుస్తున్న ఆ సీక్రెట్​ ఆపరేషన్​ వివరాలు వాషింగ్టన్​పోస్ట్​, జెడ్​డీఎఫ్​ అనే జర్మనీకి చెందిన మీడియా సంస్థలు కలిసి చేసిన ఆపరేషన్​లో బయటపడ్డాయి.

కోడ్​నేమ్​ థెసారస్​

క్రిప్టో ఏజీ.. స్విట్జర్లాండ్​కు చెందిన రహస్యాలను కోడ్​రూపంలో మార్చి చెప్పే మెషీన్లను తయారు చేసే కంపెనీ. మెకానికల్​ గేర్స్​, ఎలక్ట్రానిక్​ సర్క్యూట్స్​, సిలికాన్​ చిప్స్​, సాఫ్ట్​వేర్​లను తయారు చేస్తుంటుంది. ఆ కంపెనీకి 120 దేశాలు కస్టమర్లు. కానీ, ఆ కంపెనీలో అమెరికాకు చెందిన గూఢచర్య సంస్థ సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ ఏజెన్సీ (సీఐఏ), జర్మనీ ఇంటెలిజెన్స్​ ఏజెన్సీ బీఎన్​డీలకు వాటాలున్నాయన్న సంగతి చాలా దేశాలకు తెలిసుండదు. అన్ని దేశాలు ఆ సంస్థ నుంచి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎన్​క్రిప్షన్​ డివైస్​లను కొన్నాయి. కానీ, ఆ వ్యాపారం వెనక గుట్టుగా ఓ ఆపరేషన్​ను మొదలుపెట్టాయి సీఐఏ, బీఎన్​డీ. థెసారస్​ పేరిట సాగించిన ఆ ఆపరేషన్​లో 62 దేశాల సైనిక రహస్యాలను తెలుసుకున్నాయి. తర్వాత ఆ కోడ్​నేమ్​ను ‘రుబికాన్​’గా మార్చేశాయి. దీంతో అటు పైసలకు పైసలతో పాటు, ఇటు దేశాల రహస్యాలన్నింటినీ అప్పణంగా కొట్టేశాయి. మన దాయాది పాకిస్థాన్, పక్క దేశం బంగ్లాదేశ్​, బ్రిటన్​, ఇరాన్​,  టర్కీ, ఫ్రాన్స్​ వంటి దేశాలకు సంబంధించిన అతి విలువైన సమాచారాన్ని దోచేశాయి.

చైనా, రష్యాలు కొన్లే

అమెరికాకు సవాల్​ విసిరే దేశాలు చైనా, రష్యా. కానీ, ఆ రెండు దేశాలు క్రిప్టో ఏజీకి సంబంధించిన పరికరాలను కొనలేదు. వాటిని వాడలేదు. అయినా ఆయా దేశాలకు చెందిన కొన్ని సీక్రెట్లనూ ఛేదించాయి సీఐఏ, బీఎన్​డీ. ఇక్కడ అదెలా సాధ్యమన్న ప్రశ్న తలెత్తొచ్చు. ఇండియా లాంటి దేశాలు ఆయుధాలకు సంబంధించి రష్యాతో ఒప్పందం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ టైంలో రష్యాతో మాట్లాడే సీక్రెట్లన్నింటినీ అమెరికా కాపీ కొట్టేసింది. చైనా విషయంలోనూ అదే జరిగింది.

1990లో బీఎన్​డీ.. 2018లో సీఐఏ

ఈ ఆపరేషన్​కు సంబంధించిన వ్యవహారాలపై 1970లో తొలిసారిగా డాక్యుమెంట్లు రిలీజ్​ అయ్యాయి. దాంతో క్రిప్టో ఏజీ ఓనర్​కు, అమెరికా నేషనల్​ సెక్యూరిటీ ఏజెన్సీకి మధ్య విభేదాలొచ్చాయి. అది కాస్తా ముదరడం, 1990నాటికి అది మరింత ఎక్కువ కావడంతో 1990లో బీఎన్​డీ కంపెనీ నుంచి బయటకొచ్చేసింది. బీఎన్​డీ అమ్మిన వాటాను సీఐఏ కొనేసింది. అప్పటి నుంచి సీఐఏ హోల్​ అండ్​ సోల్​గా వివిధ దేశాలపై గూఢచర్యం చేసింది. అయితే, 2018లో కంపెనీ నుంచి సీఐఏ కూడా బయటకొచ్చేసింది. అయితే, సీఐఏ, బీఎన్​డీ మధ్య ఆపరేషన్​కు సంబంధించి విభేదాలొచ్చినట్టు మాత్రం జర్మనీ ఇంటెలిజెన్స్​ అధికారుల ద్వారా తెలుస్తోంది. డబ్బు, కంట్రోల్​, పవర్​, ఎథికల్​ లిమిట్స్​కు సంబంధించి సీఐఏతో బీఎన్​డీకి గొడవలొచ్చినట్టు సమాచారం.

విచారణకు ఆదేశించిన స్విట్జర్లాండ్​

ఈ రిపోర్టుపై ఇటు సీఐఏ గానీ, అటు బీఎన్​డీ గానీ పెదవి విప్పలేదు. అలాగని సంబంధం లేదని కూడా చెప్పలేదు. ఈ తతంగమంతా పెద్ద దుమారాన్నే రేపడంతో మంగళవారం విచారణకు ఆదేశించింది స్విట్జర్లాండ్​ ప్రభుత్వం. ఇప్పటికే క్రిప్టోకు సంబంధించిన ఎక్స్​పోర్ట్​ లైసెన్స్​ను ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, బయటకు విడుదలైన సీఐఏ, బీఎన్​డీ డాక్యుమెంట్ల ద్వారా ఈ స్పైయింగ్​ తతంగం గురించి స్విట్జర్లాండ్​ అధికారులకూ తెలిసే ఉంటుందన్నది నిపుణులు చెబుతున్న మాట.

కొడుకుకు ఇద్దామనుకుంటే…

నిజానికి 1960ల నాటికే హేగిలిన్​కు 80 ఏళ్లు వచ్చేశాయి. దీంతో కంపెనీ బాధ్యతలను తన కొడుకు బో హేగిలిన్​కు ఇవ్వాలనుకున్నాడు. కానీ, అందుకు అమెరికా ఒప్పుకోలేదు. 1970లో వాషింగ్టన్​లోని బెల్ట్​వేలో బో యాక్సిడెంట్​లో చనిపోయాడు. దీంతో సీఐఏకి ఉన్న అడ్డు తొలగిపోయింది. అయితే, 1967లో కంపెనీని కొనేందుకు ఫ్రెంచ్​ ఇంటెలిజెన్స్​ సర్వీస్​ ఆఫర్​ ఇచ్చింది. కానీ, అందుకు ఒప్పుకోని హేగిలిన్​, ఆ విషయాన్ని సీఐఏకి చేరవేశాడు. ఆ తర్వాత రెండేళ్లకే సీఐఏ అండదండలతో బీఎన్​డీ వాటా కొనేసింది.

1992లో తొలి దెబ్బ

ఏ, బీ, జీ కోడ్​నేమ్​లతో వివిధ దేశాలపై స్పైయింగ్​కు సీఐఏ పూనుకుంది. ఏ అంటే సోవియట్​, బీ అంటే ఆసియా, జీ అంటే మిగతా మొత్తం ప్రపంచం అని అర్థం. క్రిప్టో ఏజీకి తొలిసారిగా 1992ల పెద్ద దెబ్బ తగిలింది. లిబియా మీద ఉన్న అనుమానంతో క్రిప్టో సేల్స్​మ్యాన్​ హాన్స్​ బ్యూలర్​ను ఇరాన్​ అరెస్ట్​ చేసింది. అయితే, అతడిని 1986 నుంచే ఇరాన్​ విచారించడం మొదలుపెట్టినా, అతడు తనకు ఏమీ తెలియదని చెప్పాడు. తర్వాత ఆరేళ్లకు అతడు స్విట్జర్లాండ్​ వెళ్లబోతుండగా, విమానంలోనే అదుపులోకి తీసుకుంది. అయితే, పది లక్షల డాలర్లు ఇస్తామని క్రిప్టో ఒప్పందం చేసుకోవడంతో తొమ్మిది నెలల తర్వాత బ్యూలర్​ను ఇరాన్​ విడిచిపెట్టింది. అయితే, అప్పటిదాకా కంపెనీతో సీఐఏకి, బీఎన్​డీకి సంబంధముందని తెలియని అతడు, ఇరాన్​ తనను అరెస్ట్​ చేసి విచారించే సరికి అతడికీ అనుమానం మొదలైంది. దానిపై స్విట్జర్లాండ్​లోని మీడియా సంస్థలకు తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించాడు. అక్కడి నుంచి సీఐఏ, బీఎన్​డీకి పెద్ద దెబ్బే తగిలింది.

వేరే కంపెనీలు కొనేసినయ్​

2018లో సీఐఏ తన వాటాలను అమ్మేసిన తర్వాత క్రిప్టో ఏజీనీ వేరే సంస్థలు కొనేశాయి. అందులో ఒకటి సైవన్​ సెక్యూరిటీ అనే సంస్థ. స్విట్జర్లాండ్​ ప్రభుత్వానికి సెక్యూరిటీ సిస్టమ్​లను ఆ సంస్థ అమ్ముతోందిప్పుడు. రెండోది క్రిప్టో ఇంటర్నేషనల్​. ఇంతకుముందు క్రిప్టో ఏజీ బిజినెస్​నే ఈ కంపెనీ చూస్తోంది. విదేశాలకు ఆ ప్రొడక్ట్​లను ఎగుమతి చేస్తోంది. అయితే, సీఐఏ, బీఎన్​డీతో క్రిప్టో ఏజీకి సంబంధాలున్నాయన్న విషయం తెలియదంటున్నాయి ఆ కంపెనీలు.

 

Latest Updates