ధరణిలో స్లాట్ బుకింగ్ ఎట్ల?

పోర్టల్​లో కనిపించని ఆప్షన్.. 3, 4 రోజులుగా ఇదే పరిస్థితి

రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం

మూడుచింతలపల్లిలో పోర్టల్​ను స్టార్ట్ చేయనున్న కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురువారం నుంచి ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. కానీ మూడు, నాలుగు రోజులుగా స్లాట్ బుక్ చేసుకునేందుకు పలువురు ప్రయత్నించి నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం కనిపిస్తున్న ధరణి పోర్టల్ లో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఉన్నా.. అందులోకి వెళ్లగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలని అడుగుతోంది. సైన్ అప్ అయ్యేందుకు ప్రయత్నిస్తే ‘దిస్ మొబైల్​నంబర్​ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ధరణి సిటిజన్ సైన్​అప్’ అనే మెసేజ్ వస్తోంది. దీంతో స్లాట్ ఎట్ల బుక్ చేసుకోవాలంటూ జనం ప్రశ్నిస్తున్నారు.

గతంలో భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా వికారాబాద్ జిల్లా భూముల వివరాలతో నిర్వహించిన ధరణి పోర్టల్ కే ప్రభుత్వం కొత్త రూపునిచ్చింది. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కేటగిరీలుగా రెడీ చేసింది. అమ్మడానికి, కొనడానికి వీల్లేని 22-ఏ జాబితాలోని నిషేధిత భూముల వివరాలను పోర్టల్​లో చేర్చింది. సర్వే నంబర్ల వారీగా మార్కెట్ వాల్యూను పేర్కొంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి బేసిక్ మార్కెట్ వాల్యూను నిర్ధారించింది. మరోవైపు ధరణి పోర్టల్ లో కనిపిస్తున్న చెక్ ల్యాండ్ డీటైల్స్ ను క్లిక్ చేస్తే కేవలం వికారాబాద్ జిల్లా వివరాలు మాత్రమే వస్తున్నాయి. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ వివరాలను ఇందులో పొందుపరిచినా పూర్తిగా లేవు.

మార్టిగేజ్ భూముల వివరాలు..

భూమి ఎన్ కంబ్రెన్స్ డీటైల్స్ లో భూ యజమాని పేరుతోపాటు ఏదైనా బ్యాంకుకు మార్టిగేజ్ చేసి ఉంటే ఆ బ్యాంకు వివరాలు, లోన్ మొత్తం, లోన్ చెల్లించాల్సిన టైం, ప్రస్తుత పరిస్థితి డిస్ ప్లే అవుతున్నాయి. తద్వారా ఏదైనా భూమిని బ్యాంకులో తనఖా పెట్టి ఉంటే ఇట్టే తెలిసిపోయే అవకాశముంది.

సర్వే నంబర్ల వారీగా మార్కెట్ వాల్యూ..

భూముల మార్కెట్ వాల్యూను సర్వే నంబర్ల వారీగా ధరణిలో పొందుపరిచారు. ప్రతి గ్రామానికి ఒక బేసిక్ మార్కెట్ వాల్యూను నిర్ధారించారు. సర్వే నంబర్ల వారిగా బహిరంగ  ఉండే డిమాండ్ ను బట్టి భూముల మార్కెట్ వాల్యూ నిర్ణయించారు. గ్రామాల్లో ఎకరం వ్యవసాయ భూమి మార్కెట్ వాల్యూ రూ.లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఉండగా, పట్టణ పరిధిలోని భూముల మార్కెట్ వాల్యూ కనిష్టంగా ఎకరానికి 30 లక్షల నుంచి 2 కోట్ల వరకు పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో హైవే పక్కనే ఉన్న 262 సర్వే నంబర్ లోని ఎకరం భూమి మార్కెట్ వాల్యూను 1.59 కోట్లుగా నిర్ధారించారు. దీనికి లోపలికి ఉన్న సర్వే నంబర్ లోని భూమికి మాత్రం మార్కెట్ వాల్యూ కోటికి మించి లేదు. గండిపేట మండలం నార్సింగిలో ఎకరం వాల్యూ కోటి 50 లక్షలుగా నిర్ధారించారు.

కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలోని 33 సర్వే నంబర్ లోని ఎకరం మార్కెట్ వాల్యూ రూ.2.42 కోట్లుగా పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా అబ్బుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలో నేషనల్ హైవే 65కు ఆనుకుని ఉన్న 361 సర్వే నంబర్ మార్కెట్ వాల్యూ ఎకరాకు 18 లక్షలు ఉండగా, హైవేకు సెకండ్ బిట్టుగా ఉన్న 362 సర్వే నంబర్ ల్యాండ్ మార్కెట్ వాల్యూ 20 లక్షలుగా ఉంది. ఈ ఊర్లోని భూముల బేసిక్ మా ర్కెట్ వాల్యూను 13 లక్షలుగా నిర్ధారించారు.

సీఎం చేతుల మీదుగా రేపు ‘ధరణి’ ప్రారంభం

ధరణి పోర్టల్​ను సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్ ప్రారంభోత్సవానికి మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి తహసీల్దార్ ఆఫీసు వేదిక కానుంది. శామీర్​పేట మండలం నుంచి విడదీసి కొత్తగా ఈ మండలాన్ని ఏర్పాటు చేశారు. మూడుచింతలపల్లి మండల కేంద్రం సీఎం దత్తత గ్రామం కావడం విశేషం. ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం తర్వాత జర్నలిస్టులతో కలిసి సీఎం లంచ్ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లను దసరాకు ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం భావించినా.. వివిధ కారణాలతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.

Latest Updates