కరోనా టైంలో గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడం ఎలా

అప్పటివరకూ ఆఫీస్ లో యాక్టివ్ గా తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రీజన్..కార్డియాక్​ అరెస్ట్​. అకస్మాత్తుగా గుండె ఆగిపోయింది. ఇంట్లో ఎటువంటి ప్లాబ్లమ్స్ లేవని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ఆఫీసులో కూడా ఏ ఇష్యూ లేదని తెలిసింది. అయినా అతనికి హార్ట్ అటాక్.

కుటుంబ సభ్యులకి ఏం అర్థంకాక కరోనా టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. కరోనా వల్లే అతను చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. ఇతనేకాదు ఈ మధ్యకాలంలో ఇలాంటి  కార్డియాటిక్ డెత్స్ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే. గుండెకు సంబంధించిన వ్యాధులపై అవగాహన పెంచే రోజు. సో.. ఈ కరోనా టైంలో అందరూ గుండెను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలని డాక్టర్లు గుర్తు చేస్తున్నారు.

జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు..కరోనా లక్షణాలు ఇవే అనుకుంటారు చాలామంది. కరోనా లంగ్స్ పై ఎక్కువ ఎఫెక్ట్ చూపించడం వల్లే ఈ సింప్టమ్స్ బయటపడతాయి. కానీ, బయటపడని సింప్టమ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఒక్కసారి బాడీలోకి కరోనా ఎంటరైతే… గుండె, లంగ్స్, కిడ్నీ, లివర్…ఇలా ముఖ్యమైన అవయవాలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హార్ట్ పై సైలెంట్ గా ఎటాక్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ ను కరోనా నుండి కాపాడుకోవచ్చు.

 

గ్లూకోజ్ లెవెల్స్

బ్లడ్ లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ గ్లూకోజ్ స్థాయిలుంటే షుగర్ వస్తుంది. ఇలా షుగర్ వచ్చిన వాళ్లకే హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు ఈ కరోనా టైంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ షుగర్ ఎక్కువగా ఉంటే కచ్చితంగా మెడిసెన్స్ వాడాలి. ఫుడ్ కంట్రోల్ చేయాలి. డైలీ వాకింగ్ మస్ట్. అలాగే షుగర్ లేనివాళ్లు కూడా అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ లు చేయించుకుంటే మంచిది. దానివల్ల అకస్మాత్తుగా వచ్చే గుండె జబ్బుల నుండి బయటపడొచ్చు.

బీపీ ఎక్కువైతే..

హైబీపీ ఉన్నవాళ్లకు కూడా హార్ట్ ఎటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచాలి. ఎప్పటికప్పుడు బీపీ లెవెల్స్ ను  చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్. దీనివల్ల బాడీలో బీపీ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. హై బీపీ పేషెంట్లు కచ్చితంగా డాక్టర్ల సలహాతో మందులు వాడుతూ ఉండాలి. అలాగే కొంతమందికి బీపీ ఎక్కువైనా సింప్టమ్స్ బయటపడవు. కాని బాడీ లోపల జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుంది. అలా కాకూడదంటే  తరచూ బీపీ చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది.

కొలెస్ట్రాల్..బీఎంఐ

రక్తంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నా కూడా చాలా ప్రమాదం. దీనివల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. దీనివల్ల ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చు. గుండెలో రక్తనాళాలు పూడుకుపోతే హార్ట్ ఎటాక్స్ వస్తాయి. అలాగే బ్రెయిన్ లోని రక్త నాళాలు మూసుకుపోతే పక్షవాతం లాంటి సమస్యలు  తలెత్తుతాయి. ఇవేకాదు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా చాలారకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను టెస్ట్ చేసుకుని దాన్ని అదుపులో ఉంచుకోవాలి.

హెల్దీ ఫుడ్

కనిపించిందల్లా తినేయకుండా గుండెకు బలమైనదేంటో తెలుసుకుని తినడం బెటర్. దీనివల్ల బాడీలో కొలెస్ట్రాల్ స్థాయీ తగ్గుతుంది. గుండెకు ఎనర్జీ కూడా వస్తుంది. డైలీ తినే వాటిల్లో కచ్చితంగా  పళ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు..ఇలా బలమైనవి ఉండేట్లు చూసుకోవాలి..

టెన్షన్స్ తో ముప్పు ఎక్కువ..

గుండె 24 గంటలూ పనిచేసే ఓ మిషీన్. ఈ మిషీన్ కు ఏదైనా నొప్పి కలిగిస్తే వెంటనే ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల టెన్షన్, విపరీతమైన ఎమోషన్స్ కు దూరంగా ఉండాలి. ఓవర్​ థింకింగ్ మానేయాలి.

వ్యాయామం..

డైలీ లైఫ్ లో వ్యాయామాన్ని ఒక భాగం చేయాలి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. మార్నింగ్, ఈవినింగ్ అరగంటపాటు నడిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజంతా శరీరం కూడా యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకరకమైన వ్యాయామం చేయాలి.

ఫిట్​నెస్  ట్రాకర్..

గుండె పనితీరును ఎప్పటికప్పుడు గమనించే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్​ ఫిట్​నెస్ ట్రాకర్. గుండె వేగం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఇది హెచ్చరిస్తుంది. దానివల్ల హార్ట్ ఎటాక్స్ ను ముందే గుర్తించే ఛాన్స్ ఉంది. ప్రతిరోజూ దీన్ని ఉపయోగించడం వల్ల హార్ట్ స్పీడ్ ను గుర్తించగలుగుతాం.

డీ హైడ్రేషన్…

కొన్నిసార్లు డీ హైడ్రేషన్ కారణంగా శరీరంలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటివి కోల్పోతారు. ఆ సమయంలో హార్ట్ రేట్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

హార్ట్ పై కరోనా ఎఫెక్ట్..

గుండె లోపల, బయట ఎక్కడైనా సరే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఉంది. పొరలు, కండరాలు.. వంటివాటిపై కరోనా తీవ్రంగా ఎఫెక్ట్ చూపించగలదు. దీనివల్లే క్లాట్స్ రావడం.. గుండె పంపింగ్ తగ్గి పోయి ఆయాసం పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. లేదంటే గుండెపై తీవ్రంగా దెబ్బపడి ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చు. అందుకే ముందే గుండెకు కేర్ తీసుకోవడం అవసరం. డయాబెటిస్, బీపీ, ఒకవేళ గుండెకు స్టంట్స్ వేసినా, బైపాస్ చేసినా..గుండె పంపింగ్ తగ్గుతున్నా కచ్చితంగా మానకుండా మెడిసిన్స్ వేసుకోవాలి. కోవిడ్ ఉన్నా లేకపోయినా మెడిసిన్స్ మాత్రం బంద్ చేయకూడదు.

వెంటనే స్పందించాలి..

గుండె జస్ట్ గుప్పెడంతే ఉంటుంది. కాని శరీరం మొత్తానికి ఇది ఆయువు పట్టు. లైఫ్​ స్టయిల్ వల్ల ఈ జనరేషన్ లో గుండెను కాపాడుకోవాల్సిన అవసరం మరింత ఎక్కువగా ఉంది. ఉరుకులు, పరుగులు, సరిగా తినకపోవడం, బాడీకి ఎక్సర్​సైజ్ లేకపోవడం, నిద్రలేమి, మైండ్ నిండా టెన్షన్స్..ఇలా వీటన్నింటివల్లా హార్ట్ చాలా వీక్ అయిపోతుంది. దీనివల్లే ఎక్కువగా చిన్న ఏజ్ లోనే హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఈ కరోనా టైంలో చాలామంది హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ గుండెకు సంబంధించిన వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. అసలు హార్ట్ ఎటాక్స్ ఎందుకు వస్తున్నాయో ముందే తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస ఇబ్బందులు.. హార్ట్ లో పెయిన్.. గుండెపై బరువు పెట్టినట్లు ఉండటం..మత్తుగా ఉంటూ చెమటలు పడుతున్నట్లు ఉండటం, అలిసిపోతున్నట్లు, ఒళ్లంతా నొప్పులు.. ఇలాంటి సింప్టమ్స్ లో ఏది కనిపించినా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ హార్ట్ ఎటాక్స్ సింప్టమ్స్. సో ఈ లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్స్ ని  సంప్రదించాలి. ఇలా వెంటనే స్పందిస్తేనే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

        – డా.హర్షవర్ధన్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్,కేర్ హాస్పిటల్, హైటెక్ సిటీ

Latest Updates