రెడ్ జోన్ జిల్లాల్లో టెన్త్ ఎగ్జామ్స్ ఎలా?

హైదరాబాద్, వెలుగుఓవైపు రాష్ర్టంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా, మరోవైపు టెన్త్ ఎగ్జామ్స్​నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు గ్రీన్​సిగ్నల్ ఇచ్చిన వెంటనే పరీక్షల రీషెడ్యూల్ ప్రకటించేందుకు రెడీగా ఉంది. అయితే టెన్త్ స్టూడెంట్లలో సగం వరకు రెడ్ జోన్ జిల్లాల పరిధిలోనే ఉండడంతో పేరెంట్స్, టీచర్లలో ఆందోళన నెలకొంది. ఆ జిల్లాల్లో ఎగ్జామ్స్ ఎట్ల నిర్వహించాలని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కరోనా నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మార్చి 23 నుంచి జరగాల్సిన టెన్త్ ఎగ్జామ్స్ ను వాయిదా వేసింది. 33 జిల్లాల పరిధిలో 5,34,903 మంది స్టూడెంట్స్ ఉండగా… 2,530 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూడు పరీక్షలు పూర్తవ్వగా, మరో 8 ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంది. ఇటీవల కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో మేలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దీంతో ఎగ్జామ్స్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

నివేదిక రెడీ…

ఎగ్జామ్స్ నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీంతో హైకోర్టులో పిటిషన్​ వేసేందుకు విద్యాశాఖ అధికారులు రిపోర్టు సిద్ధం చేశారు. కరోనా నేపథ్యంలో స్టూడెంట్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించి, పరీక్షలు నిర్వహిస్తామనే విషయాలను అందులో పొందుపర్చారు. ప్రస్తుతమున్న ఎగ్జామ్ సెంటర్లను డబుల్ చేస్తామని, ఒక్కో రూములో 10 నుంచి 12 మందినే కూర్చోబెడుతామని, స్టూడెంట్లకు మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని పేర్కొంటున్నారు. ఈ నివేదికను సోమవారం అడ్వొకేట్ జనరల్ కు అందించినట్టు సమాచారం. దాన్ని మరో రెండు, మూడు రోజుల్లో హైకోర్టులో వేయనున్నట్టు తెలుస్తోంది.

రెడ్ జోన్​లోనే సగం మంది 

రాష్ర్టంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలు రెడ్​జోన్​లో ఉన్నాయి. వీటిలో చాలా ఏరియాల్లో కంటెయిన్ మెంట్ జోన్లు ఉన్నాయి. దీంతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ 6 జిల్లాల్లో 969 సెంటర్లలో 2,21,352 మంది స్టూడెంట్లు పరీక్షలు రాయాల్సి ఉంది. అంటే మొత్తం 5.34 లక్షల స్టూడెంట్లలో సగం వరకు ఈ జిల్లాల్లోనే ఉన్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో కేసులు తగ్గడంతో ఓ మూడు జిల్లాలను ఆరెంజ్​జోన్​లోకి మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. అలా జరిగినా ఇంకా లక్షన్నరకు పైగానే స్టూడెంట్స్ రెడ్​జోన్​లోనే ఉండే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎగ్జామ్స్ కు ఎలా పంపించాలని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు టీచర్లు కూడా రెడ్​జోన్​లో డ్యూటీ చేసేందుకు జంకుతున్నారు. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరుతున్నారు.

రెడ్ జోన్ జిల్లాల్లో స్టూడెంట్లు,సెంటర్ల వివరాలివీ… 

జిల్లా                      సెంటర్లు      స్టూడెంట్లు

హైదరాబాద్               362        85,502

రంగారెడ్డి                   208       48,600

మేడ్చల్                   193        43,149

వరంగల్ అర్బన్         73          15,757

వికారాబాద్                67        14,948

సూర్యాపేట                66         13, 396

మొత్తం                    969        2,21,352

Latest Updates