నోటిఫికేషన్ టైమ్‌ అయిపోయినా.. డిక్లరేషన్ ఎట్లిచ్చిన్రు?

హైదరాబాద్, వెలుగు: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ గడువు ముగిసినా… దాని ప్రకారమే డిక్లరేషన్, అవార్డు (భూసేకరణకు ముందు జరిగే ప్రక్రియ) ఎలా ఇచ్చారో తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన  ఎక్కాలదేవి సహా 23 మంది ఫైల్ చేసిన రిట్ లను జడ్జి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి గురువారం విచారించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామంలో భూసేకరణకు సంబంధించి పూర్తి వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. 2018 జనవరి 22న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ గడువు ముగిసిందని… అయినా దాని ప్రకారమే డిక్లరేషన్, అవార్డు జారీ చేయడం చెల్లదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. భూముల్లోని నిర్మాణాలు, చెట్లకు విలువ కట్టకుండా పిటిషనర్లకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. అయితే ఇప్పటికిప్పుడే ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామస్తులను ఖాళీ చేయించడం లేదని, దానికి ఇంకా చాలా సమయం పడుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌ కుమార్‌ చెప్పారు. దీంతో తాము అత్యవసరంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

గ్రామసభ లేకుండా భూసేకరణ నోటిఫికేషనా?

గ్రామసభ నిర్వహించకుండా భూసేకరణ నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారంటూ రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేసేందుకు కాలువల నిర్మాణాల కోసం ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని అమలు చేసింది. ఐతే ఈ చట్టానికి వ్యతిరేకంగా అధికారులు భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారంటూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు,  తొగుట మండలాలకు చెందిన పార్వతి చంద్రవ్వ సహా 26 మంది హైకోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ ను గురువారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా గ్రామసభ నిర్వహించిన తర్వాత అవార్డు, నోటిఫికేషన్‌ వంటివి చేయాల్సి ఉంటుందని కానీ గ్రామ సభ లేకుండానే భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారంటూ పిటిషనర్ల తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రతివాదులైన రెవెన్యూ, నీటి పారుదల శాఖ,ఇతర శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను 18 కి వాయిదా వేసింది.

For More News..

గరీబ్ కల్యాణ్ యోజనతో 42 కోట్ల మందికి లాభం

Latest Updates