జియో పెద్ద లాలీపాప్ ఇచ్చింది: కాంగ్రెస్ నేత సెటైర్

ముందు ఫ్రీ అని.. ఇప్పుడు బాదుతోంది

మోడీ సర్కార్ కి కూడా ఇదే వర్తిస్తుంది

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఫ్రీ కాల్స్ పై యూటర్న్ తీసుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి సెటైర్లు వేశారు. జియో జనాలకు పెద్ద లాలీపాప్ ఇచ్చిందంటూ ఎద్దేవా చేశారాయన. మోడీ ప్రభుత్వం కూడా ఇలాగే చేయబోతోందంటూ జోష్యం చెప్పారు.

‘‘జియో తన కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. మొదట్లో పెద్ద లాలీపాప్ ఇచ్చిన జియో ఇప్పుడు చివరికి డబ్బులు లాగుతోంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. ముందు ఎంత పెద్ద ఆఫర్లు ఇస్తే చివరికి అంత ఎండ బెడతారు. ఇదే పరిస్థితి ప్రస్తుతం ఉన్న మోడీ సర్కారుకి కూడా వర్తిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశారు సింఘ్వి.

జియో వసూలుపై బుధవారం ఆ సంస్థ ప్రకటన వెల్లడించింది. ఐడియా, ఎయిర్ టెల్ వంటి నెట్ వర్క్ వాడుతున్న కస్టమర్లకు జియో నుంచి కాల్ చేయాలంటే నిమిషానికి ఆరు పైసలు చెల్లించాలి. ఐయూసీ నిబంధనలను బూచీగా చూపిస్తూ జియో నుంచి వేరే నెట్ వర్క్ కస్టమర్లకు చేసే కాల్స్ పై డబ్బు వసూలు గురువారం స్టార్ట్ చేసింది జియో. ట్రాయ్ నిబంధనలను మార్చి, ఐయూసీ చార్జీలు పెంచితే ఆ పెంచిన దాని ప్రకారమే జియో కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ.

Latest Updates