ఎన్​కౌంటర్​పై ​ఎంక్వైరీ

సైబరాబాద్​ పోలీసులపై ఎన్​హెచ్చార్సీ టీం ప్రశ్నలు!

కస్టడీలో ఉన్నవాళ్లను అంత రాత్రి తీసుకపోవుడేంది?

వాళ్లు వెపన్స్​ గుంజుకునేదాకా మీరేం చేస్తున్నరు?

రెండున్నర గంటలపాటు మహబూబ్​నగర్​ హాస్పిటల్​లో విచారణ

నిందితుల మృతదేహాలు, ఎన్​కౌంటర్  స్థలం, టోల్​ప్లాజా పరిసరాల పరిశీలన

పోస్టుమార్టం వీడియో, రిపోర్టు సేకరణ.. ఎన్​కౌంటర్​ స్థలంలో వీడియో చిత్రీకరణ

‘దిశ’ నిందితుల ఎన్​కౌంటర్​పై జాతీయ మానవ హక్కుల కమిషన్​ (ఎన్​హెచ్చార్సీ) టీం విచారణ చేపట్టింది. సైబరాబాద్​ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సుమారు రెండుగంటపాటు వారిని మహబూబ్​నగర్​ ప్రభుత్వాస్పత్రిలోనే విచారించింది. ఎన్​కౌంటర్​ ఎందుకు చేయాల్సి వచ్చింది? కస్టడీలో ఉన్న నిందితులను అంత రాత్రి ఎందుకు సీన్​ రీ కన్​స్ట్రక్షన్​కు తీసుకెళ్లారు? వాళ్లు వెపన్స్​ గుంజుకునేదాకా అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు? వంటి పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన డాక్టర్లను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. కస్టడీలో ఉన్న  నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై శుక్రవారం సాయంత్రం ఎన్‌‌హెచ్చార్సీ  సుమోటోగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిజనిర్ధారణ కోసం ఏడుగురు సభ్యులతో టీంను ఏర్పాటు చేసింది. ఇందులో ఓ ఎస్పీ స్థాయి అధికారి, ఓ ఫోరెన్సిక్​ నిపుణుడు కూడా ఉన్నారు. ఈ కేసులో ఎన్​హెచ్చార్సీ ఆదేశాలు అందేలోపు పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి నలుగురు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దీంతోపాటు నిందితులపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కింది కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్  రిపోర్టును కోర్టుకు అందించారు.

హాస్పిటల్​లోనే విచారణ

శనివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఎన్​హెచ్చార్సీ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో   మహబూబ్ నగర్  జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వారిని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ  దగ్గరుండి ప్రత్యేక పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారు. ఆ వాహనాలను నేరుగా నిందితుల మృతదేహాలు ఉన్న మార్చురీకి తీసుకెళ్లారు. మార్చురీలో భద్రపర్చిన నిందితులు మహ్మద్​ ఆరిఫ్, నవీన్​, శివ, చెన్నకేశవుల మృతదేహాలను సభ్యులు పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలోని సూపరిటెండెంట్​ చాంబర్​లో విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ఎన్​కౌంటర్​లో పాల్గొన్న సైబరాబాద్ ​పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కస్టడీకి తీసుకున్న నిందితులను అంత రాత్రి సీన్​ రీకన్​స్ట్రక్షన్​కు తీసుకెళ్లడం ఏంటని, ఎన్​కౌంటర్ టైంలో అక్కడ ఎంతమంది పోలీసులు ఎస్కార్ట్ గా ఉన్నారు? నిందితులు వెపన్స్ లాక్కునేంత వరకు పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు? నిందితులను ఎంత దూరం నుంచి కాల్చారు..? ఎన్ని రౌండ్లు ఫైర్​ చేశారు? లాంటి ప్రశ్నలతో రెండున్నర గంటలు విచారణ సాగినట్లు తెలిసింది.

నిందితుల శరీరాల్లో 11 బుల్లెట్లు!

నిందితుల శరీరాల్లోకి 11 బుల్లెట్లు ఉన్నట్టుగా పోస్టుమార్టంలో గుర్తించారని తెలిసింది. అవన్నీ ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులవేనని ఫోరెన్సిక్​ నిపుణులు నిర్ధారించారు. నలుగురి  శరీరాలపై ఎక్కడకెక్కడ గాయాలున్నాయి? ఎంత డీప్​లో ఉన్నాయి? అనే విషయాలను కమిషన్​ సభ్యులు డాక్టర్లను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం వీడియో సీడీని, పోస్టుమార్టం రిపోర్టును, షార్ట్‌‌​ ఒపీనియన్​ రిపోర్టును  కమిషన్  సభ్యులు కలెక్ట్ చేసుకున్నారు.

రెండోసారి మార్చురీలో డెడ్​బాడీల పరిశీలన

దాదాపు రెండున్నర గంటల పాటు పోలీసులను ప్రశ్నించిన ఎన్​హెచ్చార్సీ సభ్యులు అన్ని వివరాలను  రికార్డు చేసుకుని అటు తర్వాత రెండోసారి  మార్చురీలోని నిందితుల మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలకు ఎక్కడెక్కడ గాయాలున్నాయి? ఎంత దూరం నుంచి కాలిస్తే ఇలా గాయలవుతాయి? అనే అంశాలను తమ వెంట వచ్చిన ఎక్స్ పర్ట్ లతో వాళ్లు చెక్​ చేయించారు. దాదాపు గంటపాటు మృతదేహాల పరిశీలిన సాగింది. అనంతరం సాయంత్రం 4.50 గంటలకు బృందం సభ్యులు చటాన్​పల్లికి బయలు దేరారు. హక్కుల కమిషన్ ​సభ్యులు నిందితుల గ్రామాలకు వచ్చి, వారి బంధువులతో మాట్లాడుతారని మొదట ప్రచారం జరిగినప్పటికీ వాళ్లు అక్కడికి వెళ్లలేదు.

ఎన్​కౌంటర్​ స్థలంలో వీడియో చిత్రీకరణ​

నిందితులు దిశను దహనం చేసిన చటాన్‌‌పల్లి అండర్ బ్రిడ్జి వద్దకు సాయంత్రం 6 గంటలకు ఎన్​హెచ్చార్సీ టీం చేరుకొని పరిశీలించింది. అటు తర్వాత 300 మీటర్ల దూరంలోని ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి కాలినడకన చేరుకుంది. వివరాలను శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి కమిషన్ సభ్యులకు వివరించారు. నలుగురు నిందితుల డెడ్ బాడీలు పడి ఉన్న ప్రాంతాన్ని ఎన్​హెచ్చార్సీ టీం వీడియో, ఫొటోలు తీసింది. నిందితులు దిశను ట్రాప్ చేసిన తొండుపల్లి టోల్ ప్లాజా పరిసరాలను రాత్రి 7గంటలకు టీం పరిశీలించింది.

హాస్పిటల్​ వద్ద భారీ భద్రత

ఎన్​హెచ్చార్సీ టీం వస్తుందని తెలియడంతో శనివారం ఉదయం నుంచే మహబూబ్​నగర్​ ప్రభుత్వాస్పత్రి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ఆవరణ మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కమిషన్​ సభ్యులు వచ్చి వెళ్లి పోయే వరకు ఇతరులెవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. పేషంట్లను క్షుణ్నంగా తనిఖీలు చేసి నిర్ధారించుకున్నాకే లోపలికి పంపారు. ఇదిలా ఉంటే.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిందితుల మృతదేహాలను సోమవారం వరకు మహబూబ్​నగర్​ ప్రభుత్వాస్పత్రి మార్చురీలోనే ఉంచనున్నారు. మృతదేహాలను ఇక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలిస్తారని ప్రచారం జరిగినా దాన్ని పోలీసులు ఖండించారు. ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం నిందితుల మృతదేహాలను గుర్తించేందుకు వారి కుటుంబసభ్యులను మహబూబ్​నగర్​ హాస్పిటల్​కు తీసుకెళ్లిన పోలీసులు శనివారం రాత్రి 8గంటలకు సొంతూళ్లకు చేర్చారు. సోమవారం రాత్రి వరకు మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు
చెప్పినట్లు మృతుల కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు.

నిందితులపై హత్యాయత్నం కేసు

‘దిశ’ నిందితులపై  షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదైంది. దిశ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న షాద్ నగర్ ఏసీపీ వి.సురేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం సాయంత్రమే ఐపీసీ సెక్షన్ 307, సీఆర్​పీసీ 176  కింద ఈ కేసు నమోదు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున నిందితులను సీన్ ఆఫ్ అఫెన్స్ కి చటాన్ పల్లి అండర్ పాస్ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లామని, వాళ్లు పోలీసులపై వెపన్స్, రాళ్లతో దాడి జరిపారని ఫిర్యాదులో ఏసీపీ పేర్కొన్నారు. ఎస్కార్ట్ పోలీసులతో పాటు స్పాట్ లో ఉన్న ఇన్వెస్టిగేషన్ అధికారులపై నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. వారి దాడిలో నందిగామ ఎస్‌‌‌‌‌‌‌‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ అరవింద్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై నిందితులు దాడి జరిపి పారిపోతుండడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఏసీపీ సురేంద్ర వివరించారు. షాద్ నగర్ కోర్టుకు ఎన్ కౌంటర్ కు
సంబందించిన కేసు ఎఫ్ఐఆర్ అందించారు. రాచకొండ అదనపు డీసీపీ, ఎస్​వోటీ సురేందర్ రెడ్డిని ఇన్వెస్టిగేషన్ అధికారిగా నియమించారు. ఈ వివరాలను ఎన్​హెచ్చార్సీ టీంకు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.

Latest Updates