డ్రైవింగ్​ లైసెన్స్ జారీలో భారీ మార్పులు

  • లైసెన్స్​ జారీ రూల్స్‌‌లో మార్పులు చేసిన రవాణా శాఖ
  • 40 ఏళ్లు దాటితే రెన్యువల్ కు మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి
  • ఏడాదిలోపు లైసెన్స్ రెన్యువల్‌ చేయకుంటే మళ్లీ ఎల్ఎల్ఆర్
  • ఎన్నేండ్లు లేట్ అయితే అన్నేండ్లూ రూ.వెయ్యి ఫైన్

హైదరాబాద్​, వెలుగు: ఇప్పటిదాకా డ్రైవింగ్​ లైసెన్స్​ కావాలంటే కనీసం ఎనిమిదో తరగతి చదివుండాలన్న రూల్​ ఉండేది. కానీ, ఇకనుంచి దానికి ఎలాంటి చదువూ అక్కర్లేదు. కనీస విద్యార్హత రూల్​ను రవాణా శాఖ తీసేసింది. కేంద్ర మోటార్​ వెహికల్​ యాక్ట్​కు తగ్గట్టు మార్పులు చేసింది. నిరుడు ఫిబ్రవరి 18వ తేదీన అప్పటి ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ సునీల్​ శర్మ పేరుతో తాజాగా రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త రూల్​ను తప్పకుండా అమలు చేయాలని పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్​లోనే జిల్లా అధికారులకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. కొత్త రూల్స్​తో ఎల్లోప్లేట్​(ట్రాన్స్​పోర్ట్​ వెహికల్స్​) అయినా, మామూలు బండ్లు అయినా ఎలాంటి చదువు అవసరం లేకుండానే  డ్రైవింగ్​ లైసెన్స్​ పొందేందుకు వీలు దొరికినట్టయింది.

రెన్యువల్​లోనూ మార్పులు

డ్రైవింగ్​ లైసెన్స్‌​ రెన్యువల్​కు సంబంధించి కూడా అధికారులు కొన్ని మార్పులు చేశారు. ఇప్పటికే లైసెన్స్​ ఉన్నోళ్లు 40 ఏండ్లు దాటితే రెన్యువల్​ కోసం తప్పనిసరిగా మెడికల్​ సర్టిఫికెట్​ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 50 ఏండ్లు దాటినోళ్లే మెడికల్​ సర్టిఫికెట్​ ఇస్తున్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాల పాలవుతుండడం, ప్రమాదాలు జరుగుతుండడంతో.. 40 ఏండ్లు దాటితే మెడికల్​ సర్టిఫికెట్​ కంపల్సరీ అన్న రూల్​ను తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇటు గడువు ముగిశాక టైంకు లైసెన్స్​ను రెన్యువల్  చేసుకోకుంటే ఇబ్బందులు తప్పవు. గడువు ముగిశాక నెల దాకా గ్రేస్​ పీరియడ్​ ఉంటుంది. ఆ లోపు చేసుకోకుంటే రూ.వెయ్యి పెనాల్టీ చెల్లించి రెన్యువల్​ చేసుకోవచ్చు. ఏడాది దాటినా రెన్యువల్​ చేసుకోకపోతే లైసెన్స్​ను రద్దు చేస్తారు. మళ్లీ లెర్నింగ్​ లైసెన్స్​ (ఎల్​ఎల్​ఆర్​) తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డ్రైవింగ్​ టెస్టుకు వెళ్లి లైసెన్స్​ తీసుకోవాలి. రెన్యువల్​ ఎన్నేండ్లు లేట్​ అయితే.. అన్నేండ్లు వెయ్యి చొప్పున పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇటు సీనియారిటీ కూడా పోతుంది. లైసెన్స్​ గడువు తీరాక ఐదేళ్ల దాకా రెన్యువల్​ చేసుకోకుంటేనే ఎల్​ఎల్​ఆర్​ అనే నిబంధన ఉండేది. ఇప్పుడు దానిని ఏడాదికి తగ్గించడం వల్ల వాహనదారులకు నష్టమని నిపుణులు చెబుతున్నారు.

Latest Updates