గుహలో భారీగా బంగారం నిల్వలు.. కళ్ల ముందే హింట్ ఉన్నా తెరవలేకపోతున్నారు

కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లిన అలీబాబా,  బందిపోటు దొంగల చప్పుడు విని ఓ చెట్టెక్కి కూర్చుంటాడు. ఆ నలభై దొంగలు వచ్చి ‘ఖుల్జా సిమ్ సిమ్’ అనగానే ఎదురుగా ఉన్న గుహ దర్వాజ తెరుచుకుంటుంది. దోచుకున్నదంతా లోపల పెట్టేసి మళ్లీ ‘బంద్‌‌హోజా సిమ్ సిమ్’ అనగానే దర్వాజ దానికదే మూసుకుంటుంది. ఆ మాటల్ని గుర్తుపెట్టుకున్న అలీబాబా తెలివిగా ఆ దొంగల సొత్తును తీసుకుని ధనవంతుడు అయిపోతాడు. ఇది కథే అయినా… చరిత్రలోనూ ఇలాంటి ఈ తరహా గుహ  ఒకటి ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. కాకపోతే ఆ గుహ దర్వాజని తెరిచే హింట్‌‌ కళ్లెదురుగానే ఉన్నా.. అర్థం చేసుకునేందుకు రెండువేల సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

బీహార్‌‌‌‌ నలంద జిల్లాలోని రాజ్‌‌‌‌గిరి దగ్గర ఉండే సోన్‌‌‌‌ భండార్‌‌‌‌ గుహలు. పేరుకు తగ్గట్లే బంగారు నిల్వలు దాచుకుందనే ప్రచారం ఈ గుహలకు ఉంది. ఇవి సహజంగా ఏర్పడినవి కావు.  రెండు గుహలనూ మనుషులే తయారు చేశారు.  అయితే ఇంత పెద్ద గుహలు ఎందుకు కట్టించారనే విషయంపై హిస్టారియన్స్‌‌‌‌ ఓ క్లారిటీకి రాలేకపోయారు. దక్షిణ ఆసియాను పాలించిన మౌర్యుల కాలంలో ఈ గుహల నిర్మాణం జరిగి ఉంటుందనేది ఒక అంచనా. మహాభారత కాలపు మగధ రాజు జరాసంధుడు ఈ గుహని కట్టించాడని కొందరు, బింబిసారుడు కట్టించాడని మరికొందరు చెప్తుంటారు. అయితే భారీ ఎత్తున సామ్రాజ్యపు సంపదను దాచిపెట్టేందుకే ఈ గుహల్ని కట్టించారనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. అంతేకాదు ఈ గుహల్లో జైన స్థూపాలు కూడా ఉన్నాయి. మామూలుగా గుహల్లో ఉండే గుడులకు.. ఈ సోన్‌‌‌‌ భండార్‌‌‌‌ గుహలకు చాలా తేడా ఉంది. నాలుగు వైపుల స్ట్రెయిట్‌‌‌‌ సైడ్స్‌‌‌‌తో ఉండే ట్రేప్‌‌‌‌జోయిడ్‌‌‌‌ షేప్‌‌‌‌తో కట్టిన నిర్మాణం ఇది.

ఫలించని ప్రయత్నాలు

ఒక పెద్ద రాతి బండని తొలచి ఈ గుహల్ని తయారు చేశారు. ఒకదానిని ఆనుకుని మరొకటి ఉంటాయి. మెయిన్‌‌‌‌ గుహ(మొదటి గుహ)లోకి ఎంటర్‌‌‌‌ కాగానే రెండు మీటర్ల కంటే తక్కువ హైట్ ఉండే ఒక రూమ్‌‌‌‌ కనిపిస్తుంది.  లోపల విశాలంగా ఉండే ఈ గదిని సైనికుల కోసం కట్టించారు. బహుశా ఖజానాకి కాపలాగా ఉండేవాళ్ల కోసం ఇది కట్టించి ఉంటారని అనుకుంటున్నారు. ఈ గది వెనుక వైపు నుంచే ఖజానాకు దారి ఉందనే ప్రచారం ఉంది.  అయితే ఈ మార్గాన్ని ఒక పెద్ద బండరాతితో మూసివేశారు. తర్వాతి కాలంలో మన దేశాన్ని పాలించిన రాజులెందరో ఆ రాయిని కదిలించే ప్రయత్నం చేశారు.  2,500 సంవత్సరాలుగా ఇప్పటికీ ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.  కనీసం ఇంచు కూడా ఆ బండరాయి కదల్లేదు. అంతేకాదు బ్రిటిషర్లు ఫిరంగులతో పేల్చి, ఈ గుహ గది దర్వాజను తెరిచే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో గుహ గోడలు కొంత డ్యామేజ్‌‌‌‌ అయ్యాయి. ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి.

 

వారసుడికి దక్కకూడదనే.. 

బింబిసారుడికి వయసు పైబడ్డాక మగధ సింహాసనం కోసం కొడుకుల మధ్య కొట్లాట జరిగింది. చివరికి అజాతశత్రువుదే పైచేయి అయ్యింది.  తల్లిదండ్రులైన బింబిసారుడు–కోసల దేవిని సోన్ భండార్ గుహల్లోనే బంధించాడు. అయితే అజాతశత్రువు ఇలాంటి పని చేస్తాడని బింబిసారుడు ముందే ఊహించాడు. రాజ్యంలోని విలువైన సంపదనంతా అప్పటికే సోన్‌‌‌‌ భండార్‌‌‌‌ గుహల్లో భద్రంగా దాచిపెట్టాడు. అందులోకి వెళ్లే మార్గాన్ని అర్థంకాని భాషలో గోడలపై చెక్కించి పెట్టాడు. ఈ విషయం తెలిసి అజాతశత్రువు తన తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేశాడు. తిండి కూడా పెట్టకుండా నిజాన్ని రాబట్టాలని ప్రయత్నించాడు. కానీ, బింబిసారుడు నోరు విప్పలేదు.  కొన్నాళ్లకు బింబిసారుడు చనిపోయాడు.  బంగారం జాడ తెలియకపోవడంతో అజాతశత్రువు పిచ్చోడు అయ్యాడు.  బౌద్ధ సన్యాసులు అతడి పిచ్చిని నయం చేశారు. ఆ తర్వాత అజాతశత్రువు బౌద్ధమతంలోకి చేరిపోయి..  అహింసా మార్గంలో నడిచాడు. అయితే అజాతశత్రువు ఆ నిధి గురించి మరిచిపోయినా.. ఆ తర్వాత వచ్చిన పాలకులు మాత్రం గుహ రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు.

కొన్ని అనుమానాలు

గిరివృజ.. ఒకప్పుడు రాజ్‌‌‌‌గిరికి ఉన్న పేరు.  బుద్ధుడి కాలంనాటిదిగా చెప్పుకునే సప్తపర్ణి గుహలకు దగ్గర్లోనే గిరివృజ నగరం ఉందనే ప్రస్తావన త్రిపీఠకాల్లో ఉంది.  ఈ గుహల్ని 319–180(బీసీఈ) మధ్య మౌర్యుల కాలంలోనే చెక్కించి ఉంటారని  కొందరి వాదన. అయితే గోడలపై ఉన్న గుప్త లిపి, వైరదేవ అనే జైన ముని ప్రస్తావన ఆ అక్షరాల్లో ఉండడంతో ఇవి 3–4 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన గుహలని ఒక అంచనాకి వచ్చారు.  ఇవి మౌర్యుల కాలంనాటి భరాభర్‌‌‌‌ కొండ గుహల్ని పోలి(మౌర్యన్ పాలిష్‌‌‌‌) ఉన్నాయి. అయితే భరాభర్‌‌‌‌ గుహల గ్రానైట్‌‌‌‌ రాయి కంటే సోన్‌‌‌‌ భండార్‌‌‌‌ గుహల రాళ్లు గట్టిగా ఉన్నాయి.  ఈ రాళ్లను తూర్పు ప్రాంతాల నుంచి తెప్పించి ఉంటారని లీ హూ హౌక్‌‌‌‌ అనే ఆర్కిటెక్ట్​ చెప్పాడు. ఈ లెక్కన బింబిసారుడి కాలంలో గుహల్ని తొలిచారని, అందులో బంగారు నిక్షేపాలు ఉన్నాయనే ప్రచారం ఉట్టిదే అనేది కొందరి వాదన.  గోడలపై ఉన్న గుప్త లిపిని ట్రేస్‌‌‌‌ చేశామని.. ఇందులో ఎలాంటి బంగారు నిక్షేపాలు లేవని కొందరు రీసెర్చర్లు చెప్పినప్పటికీ.. ఖజానాని తొలిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

పగలు మాత్రమే..

కేరళ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ నిధి కన్నా.. సోన్‌‌‌‌ భండార్‌‌‌‌ గుహల్లో సంపద కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ గుహ బయట ఒక పార్క్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. పగటి పూట చాలా ప్రశాంతంగా కనిపించే ఈ ప్రదేశం.. రాత్రిపూట భయాన్ని కలిగిస్తుంది. చాలా సంవత్సరాలుగా క్షుద్ర పూజలకు కేరాఫ్‌‌‌‌గా మారాయి సోన్‌‌‌‌ భండార్‌‌‌‌ గుహలు. ఈ గుహల దగ్గర్లో నాలుగు నర బలుల ఉదంతాలు జరిగాయని స్థానికులు చెప్తున్నప్పటికీ..  పోలీసులు మాత్రం ఉత్త ప్రచారమేనని చెప్తారు. అయినాకూడా జనాలు మాత్రం ఆ భయంతో సాయంత్రం పూట అటువైపుగా వెళ్లరు. అంతేకాదు గుహల్లోపల ఉన్న  బంగారు నిల్వలను.. మానవాతీత శక్తులు కాపాడుతుంటాయని వాళ్లు కథలు కథలుగా చెప్పుకుంటారు.

పాస్‌‌వర్డ్‌‌.. అర్థంకాకే!

బంగారు నిక్షేపాలున్న ఈ గుహల వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుడు తన పాలనలోని విలువైన సంపదనంతా ఈ గుహల్లోనే దాచాడు. ఈ విషయం గురించి ఆ గుహల్లో ఉండే శాసనాలు చెప్తాయి.  దీంతో ఈ బంగారం కోసం చాలామంది సర్వశక్తులా ప్రయత్నించారు. దాదాపుగా వంద ఏళ్ల నుంచి ఎందరో రీసెర్చర్లు, సైంటిస్టులు దీనిపై స్టడీ చేస్తున్నారు.  ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్నా.. ఫలితం మాత్రం జీరో. అయితే ఈ గదిలో గోడ మీద అర్థంకాని భాషలో కొన్ని పదాలు రాశారు. బహుశా నిధిని చేరుకునేందుకు ఇది ఒక కోడ్‌‌ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. అయితే అంత మొత్తంలో నిధి బింబిసారుడు ఈ గుహల్లోకి ఎలా తీసుకొచ్చాడు?  అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. అంతేకాదు ఆ లిపిని బ్రేక్‌‌ చేయగలిగితే.. లెక్క లేనంత బంగారం బయటకు తీయొచ్చని అనుకుంటున్నారు.– శుభాశ్రీ.

ఇవి కూడా చదవండి..

వైరల్ వీడియో: దేన్ని ముట్టుకున్నా శానిటైజ్ చేసుకుంటున్న చిన్నారి

షాకింగ్ సర్వే: అమ్మాయిలు ఫోన్‌‌లు ఎంతసేపు వాడుతున్నారో తెలుసా?

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

Latest Updates