హైదరాబాద్‌ మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌కు భారీ రెస్పాన్స్‌

హైదరాబాద్‌ మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌కు భారీ రెస్పాన్స్‌

 హైదరాబాద్‌ మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌కు భారీ రెస్పాన్స్‌
  హైటెక్స్‌ రూట్లల్లో పొద్దున 6 నుంచే భారీగా ట్రాఫిక్‌
  రాత్రి 9 వరకు కొనసాగిన డ్రైవ్‌ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్‌‌ కేంద్రంగా నిర్వహించిన జంబో వ్యాక్సిన్ డ్రైవ్‌‌కు మంచి స్పందన వచ్చింది. ఒకేచోట 40 వేల మందికి టీకాలు వేసేందుకు దేశంలోనే తొలిసారి చేపట్టిన ఈ మెగా డ్రైవ్‌‌కు పొద్దున 6 గంటల నుంచే జనం భారీగా తరలివచ్చారు. సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌‌ డ్రైవ్‌‌కు ప్రభుత్వం ఆదివారం అనుమతిచ్చింది. ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాధారణ యువతీయువకులకు ఒకేసారి టీకా కార్యక్రమం చేపట్టారు. పోలీసులు, హెల్త్ సిబ్బంది కలిసి 3,500 మంది పని చేశారు. టీకా కోసం వచ్చేవారు ఎదురు చూడకుండా 300 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచే జనం తరలివచ్చారు. దీంతో కూకట్‌‌పల్లి, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి నుంచి హైటెక్స్​కు వెళ్లే రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. 

పొద్దున 8 నుంచి రాత్రి 9 గంటల వరకు డ్రైవ్ జరిగింది. మెడికవర్ హాస్పిటల్ అధికారిక వెబ్‌‌సైట్‌‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గర్భిణుల కోసం నర్సింగ్‌‌ స్టేషన్లు, ప్రతి హ్యాంగర్‌‌లో ఓ అత్యవసర వార్డుతో పాటు 5 పడకలతో ఎమర్జెన్సీ హాస్పిటల్‌‌ను ఏర్పాటు చేశారు. 
థర్డ్‌‌ వేవ్‌‌ను టీకాతో అడ్డుకోవచ్చు: హెల్త్‌‌ డైరెక్టర్‌‌
డ్రైవ్‌‌ను ప్రారంభించాక సైబరాబాద్ సీపీ సజ్జనార్, హెల్త్ డైరెక్టర్ డా. జి శ్రీనివాసరావు మాట్లాడారు. ‘కరోనా నియంత్రణలో టీకా చాలా ముఖ్యం. థర్డ్ వేవ్ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి జంబో టీకా డ్రైవ్ ఉపయోగపడుతుంది’ అన్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు టీకా ఒక్కటే మార్గమని ఎస్సీఎస్సీ జనరల్‌‌ సెక్రటరీ కృష్ణ చెప్పారు. కరోనా పోరులో ప్రభావవంతమైన ఆయుధం వ్యాక్సిన్ మాత్రమేనని మెడికవర్ గ్రూప్ హాస్పిటల్ ఇండియా చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ, హరికృష్ణ అన్నారు. డ్రైవ్ ప్రారంభ వేడుకలో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌‌వో స్వరాజ్య లక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్‌‌రెడ్డి, డాక్టర్ కృష్ణప్రసాద్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేశ్‌‌ పాల్గొన్నారు.