హెచ్‌‌యూఎల్ లాభం 14%  జంప్

న్యూఢిల్లీ :  ఎఫ్‌‌ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యునిలివర్ లిమిటెడ్‌‌(హెచ్‌‌యూఎల్) లాభాలు 14.4 శాతం పెరిగాయి.  ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌‌తో ముగిసిన క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.1,795 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌‌‌‌లో కంపెనీ లాభాలు రూ.1,569 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో హెచ్‌‌యూఎల్ తెలిపింది. నికర అమ్మకాలు ఈ క్వార్టర్‌‌‌‌లో 6.04 శాతం పెరిగి రూ.10,197 కోట్లకు చేరినట్టు హెచ్‌‌యూఎల్ చెప్పింది. తమ కన్స్యూమర్ ఫ్రాంచైజ్‌‌లను విస్తరించడం, పోర్ట్‌‌ఫోలియోల్లో ఇంప్రూవ్‌‌మెంట్, మార్జిన్లలో స్థిరమైన వృద్ధి.. కంపెనీకి సహకరించినట్టు హెచ్‌‌యూఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా చెప్పారు. గత  కొన్ని క్వార్టర్‌‌‌‌లుగా కంపెనీ పట్టణ వృద్ధి తగ్గుతూ వచ్చిన క్రమంలో గ్రామీణ వృద్ధి పెరిగింది.

ప్రస్తుతం కంపెనీ పట్టణ వృద్ధికి, గ్రామీణ వృద్ధి సరిసమానమైనట్టు హెచ్‌‌యూఎల్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ శ్రీనివాస్ పతక్ చెప్పారు. ప్రభుత్వం 2019 బడ్జెట్‌‌లో ప్రకటించిన ‘గాంవ్, గరీబ్, కిసాన్‌‌’ అనే పథకం.. గ్రామీణ ప్రాంతాల్లో మరింత కొనుగోలుస్థాయిని పెంచనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్వార్టర్‌‌‌‌లో హెచ్‌‌యూఎల్ మొత్తం ఖర్చులు 3.84 శాతం పెరిగి రూ.7,896 కోట్లుగా ఉన్నాయి. హోమ్ కేర్ సెగ్మెంట్‌‌ నుంచి కంపెనీకి వచ్చిన రెవెన్యూలు 10.10 శాతం పెరిగి రూ.3,464 కోట్లుగా రికార్డైనట్టు కంపెనీ వెల్లడించింది. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్‌‌ 4.18 శాతం వృద్ధి సాధించి రూ.4,626 కోట్ల అమ్మకాలను అందించింది. ఫుడ్స్ అండ్ రిఫ్రెష్‌‌మెంట్ సెగ్మెంట్ 9.36 శాతం పెరిగి రూ.1,950 కోట్ల అమ్మకాలను రికార్డు చేశాయి.

Latest Updates