హక్కులకు దిక్కేది?

ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి పోలీసులు, అధికార వ్యవస్థ ఉంది. మరి, సమస్యలు తీర్చే వాళ్లే చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే చెప్పుకునే దిక్కు.. హక్కుల కమిషన్లు. కొండంత అండగానిలిచే ఆ హక్కుల సంఘాలు అలంకార ప్రాయంగా మారిపోయాయి. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ , మహిళా కమిషన్ , బాలల హక్కులకమిషన్ , సమాచార హక్కు కమిషన్ ఏ కమిషన్ గడప తొక్కినా చైర్మన్లు , సభ్యులు లేక తెల్ల మొహంవేస్తున్నాయి. బాధితులకు అందాల్సిన న్యాయం అన్యాయమైపోతోంది. ఇలాంటి చట్టబద్ధ సంస్థలు ఇప్పుడు నిర్వీర్యం అయిపోయాయని పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అన్ని కమిషన్లదీ అదే పరిస్థితి
మానవ హక్కుల సంఘానికి చైర్మన్ లేక నాలుగేళ్లయిపోయింది. ఇన్నేళ్లవుతున్నా ప్రభుత్వం చైర్మన్ను నియమించకుండా చోద్యం చూస్తోందంటూ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాలల హక్కుల కమిషన్ లో 2015 వరకు ఇద్దరు, 2017 వరకు ఒకరు సభ్యులుగా పనిచేశారు. 2017లో వరంగల్ కు చెందిన లాయర్​ గుడిమళ్ల రవికుమార్​ను ప్రభుత్వం నియమించినా.. ఆయన అర్హతపై కొందరు కోర్టుకెళ్లడంతో అదీ ఆగిపోయింది. దీంతో రెండేళ్లుగా కమిషన్ ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన దాఖలాల్లేవు. మహిళా కమిషన్ కూడా ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం కిరణ్ కుమార్​ రెడ్డి హయాం లో కమిషన్ ను పునరుద్ధరించి త్రిపురాన వెంకటరత్నాన్ని చైర్మన్ గా నియమించారు. మరో ఐదుగురు సభ్యులనూ నియమించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2018 వరకు తెలుగు రాష్ట్రాలకు ఆమె చైర్మన్ గా ఉండి బాధ్యతలు చూసుకున్నారు. ప్రస్తుతం కమిషన్ ఖాళీ అయింది. చైర్మన్ నుంచి సభ్యుల దాకా ఎవరూ లేరు. దీంతో NRI పెళ్లి సంబంధాలతో నష్టపోయిన బాధితులకు న్యాయసాయం అందట్లేదు.

వేలాది అప్పీళ్లు.. ఇద్దరే కమిషనర్లు
సమాచార కమిషన్ లో చీఫ్​ ఇన్ఫర్మేషన్ కమిషనర్​ (సీఐసీ) డాక్టర్​ రాజా సదారాం సోమతోపాటు రాష్ట్రస మాచార కమిషనర్​ (ఎస్​ఐసీ) బుద్ధా మురళిఉన్నారు. ప్రస్తుతం సీఐసీ వద్ద 21 శాఖలు, ఎస్​ఐసీవద్ద 14 శాఖలు ఉన్నాయి. నిజానికి చీఫ్​ కమిషనర్​తో పాటు పది మంది కమిషనర్లను నియమించాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఒక్కరినే నియమించి చేతులు దులుపుకుంది. దీంతో వేలాది అప్పీళ్లను ఆ ఇద్దరు కమిషనర్లే విచారించాల్సి వస్తోంది. చాలాఫైళ్లు పెండింగ్ లో పడుతున్నాయి. ప్రభుత్వ అధికారుల అవినీతి, అక్రమాలపై విచారణ చేసేందుకు లోకాయుక్తను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, రెండున్నరేళ్లుగా లోకాయుక్తను ఏర్పాటు చేయని సర్కార్​.. దానిని దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొన్న అవినీతి, అక్రమాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

Latest Updates