మరో టైటిల్‌‌ ముంగిట హంపి

సెయింట్‌‌ లూయిస్‌‌ (అమెరికా): వరల్డ్‌‌ ర్యాపిడ్‌‌ చాంపియన్‌‌, ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ కోనేరు హంపి మరో టైటిల్‌‌ ముంగిట నిలిచింది. కెయిన్స్‌‌ కప్‌‌ మహిళల చెస్‌‌ టోర్నమెంట్‌‌లో అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేస్తున్న తెలుగు ప్లేయర్‌‌ ఎనిమిదో రౌండ్‌‌లో విజయం సాధించి 5.5 పాయింట్లతో  సోల్‌‌ లీడ్‌‌లోకి  వచ్చింది. శనివారం రాత్రి జరిగిన ఈ గేమ్‌‌లో  రష్యా ప్లేయర్‌‌ వాలెంటినా గునినాతో సెమీ–స్లావ్‌‌ వేరియేషన్‌‌తో ఆడిన హంపి.. 35 ఎత్తుల్లోనే గెలిచింది. మరో తెలుగు గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ద్రోణవల్లి హారిక వరుసగా మూడో రౌండ్‌‌ను డ్రా చేసుకుంది. ఉక్రెయిన్‌‌ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ మరియా ముజుచుక్‌‌తో గేమ్‌‌లో 35 ఎత్తుల అనంతరం హారిక పాయింట్‌‌ పంచుకుంది.  ఇక, ఏడో రౌండ్‌‌ వరకు హంపితో కలిసి జాయింట్‌‌ టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచిన వరల్డ్‌‌ చాంపియన్‌‌ వెన్‌‌జున్‌‌ జు (చైనా)కు ఎనిమిదో గేమ్‌‌లో 16 ఏళ్ల అమెరికా ప్లేయర్‌‌ కేరిసా యిప్‌‌ షాకిచ్చింది. 61 ఎత్తుల్లో  కేరిసా చేతిలో ఓడిన వెన్‌‌జున్‌‌ 4.5 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌కు పడిపోయింది. నాలుగు పాయింట్లతో హారిక ఐదో ప్లేస్‌‌లో ఉంది. చివరి రౌండ్‌‌లో తెలుగు ప్లేయర్లు హంపి, హారిక తలపడనున్నారు. హారికపై నెగ్గితే ఇతర ప్లేయర్ల రిజల్ట్స్‌‌తో సంబంధం లేకుండా  హంపి 6.5 పాయింట్లతో టైటిల్‌‌ సాధిస్తుంది.

Latest Updates