ఆకలితో ఆదిమ తెగల గోస

అ౦తరించి పోయే స్థితిలో కొలాం, తోటిలు

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మడావి భారతి. ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం చిలాటిగూడ గ్రామనికి చెందిన ఈమె గత నెలలో బిడ్డకు జన్మనిచ్చింది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు అడవిలో ఆహారం దొరికినరోజు తిని, దొరకని రోజు పస్తులుండడంతో ఇలాంటి బలహీనమైన బిడ్డ పుట్టాడు. కనీసం కిలో బరువు కూడా లేని ఆ శిశువు ఆరోగ్యం, ఎదుగుదలపై వైద్యులు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు పుట్టే పిల్లలల్లో ఇలా పౌష్టికాహార లోపాలతో బలహీనంగా జన్మించే వారు 30 శాతం నుంచి 40 శాతం వరకు ఉంటారు. దీన్ని నివారించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.

ఆదిలాబాద్, వెలుగు :ఆదిమ గిరిజన తెగల్లో కొన్ని భవిష్యత్తులో కనబడకుండా పోయే పరిస్థితి వచ్చిందా? కొండలు, అడవుల్లో జీవించే వీరికి సరైన ఆహారం అందక పౌష్టికాహార లోపం, వైద్యం అందకపోవడంతో పుట్టిన పిల్లల్లో ఎక్కువ మంది చిన్నవయసులోనే చనిపోతున్నారు. 1975లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అంతరిచిపోతున్న తెలగల లిస్ట్‌‌లో కొలాం, తోటిలున్నారు. అప్పుడు కొలాం జనాభా 33 వేలు, తోటిల జనాభా 2వేలు. దాదాపు 44 ఏండ్ల తరువాత కొలాం తెగ జనాభ పెరిగింది కేవలం ఐదు వేలే. తోటిల సంఖ్య దాదాపుగా అంతే ఉంది. మిగతా జనాభా పెరుగుదలతో పోలిస్తే ఒక శాతం కూడా పెరగలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వీరి సంఖ్య క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ముప్పులో మిగతా తెగలు కూడా

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నివసిస్తున్న ఆదిమవాసీల అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది. ముఖ్యంగా కొలాం, తోటి, మన్నేవార్ తెగల ఉనికిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అడవుల్లో జీవించడానికి అలవాటు పడ్డ వీరు మైదాన ప్రాంతాలకు రావడానికి ఇష్టపడరు. దేశవ్యాప్తంగా ఇలా డెబ్బై అయిదు తెగల వారు మైదాన ప్రాంతాల్లోకి జీవించేందుకు ముందుకు రావడం లేదు. వీరి చుట్టు అడవులు నశించి, మైదానాలు ఏర్పడుతుండడంతో వారికి సరైన ఆహారం లభించడం లేదు. అడవి లేక సరైన ఆహారం దొరక్క పోషకాహార లోపంతో ఈ తెగల్లో మరణాలశాతం పెరుగుతోంది.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో గోండులు2.63 లక్షలు, పర్థాన్​లు 26 వేలు, నాయక్​పోడ్‌‌లు ఐదు వేలు, ఎరుకలు రెండు వేలు, కోయలు మూడు వేల మంది జీవిస్తున్నారు. ఈ తెగలన్నీ కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడెక్కడ పౌష్టికాహార లోపం ఉందో గుర్తించి అక్కడ సరైన ఆహారం అందిస్తే పరిస్థితి మెరుగయ్యే అవకావాలున్నాయి. అయితే అధికారులు ఆ దిశగా సరైన చర్యలు చేపట్టడం లేదు. పౌష్టికాహార లోపం ఉన్నచోట్ల ప్రభుత్వం బెల్లం పల్లీల ఉండలు, కోడిగుడ్లు, తదితర ఆహారం అందించింది. అంగన్‌‌వాడీ కేంద్రాల్లోనూ ఇలాంటివి సరఫరా చేశారు. అయితే ఇదంతా కొన్నిరోజులు మాత్రమే కొనసాగింది.

పౌష్టికాహారం అందజేస్తున్నాం

ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలందరికీ పౌష్టికాహారం అందజేసే ప్లాన్ చేశాం. న్యూట్రీబాక్స్ పేరిట అన్ని రకాల పౌష్టికాహార పదార్థాలను బాలింతలకు, పిల్లలకు అందజేస్తున్నాం. అందుకోసం త్వరలో కొన్ని తయారీ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నాం. పౌష్టికాహార లోపంపై ప్రత్యేకంగా సర్వే చేసి బాధితులను గుర్తించే పని చేపట్టాం.

– కృష్ణాదిత్య, ఐటీడీఎ పీవో

Latest Updates