పెద్దపులి కోసం డ్రోన్​లతో వేట.. ఎరగా ఆవు

ఆపరేషన్ టైగర్.. డ్రోన్​లతో వేట

పెద్దపులి కోసం ఫారెస్ట్ ఆఫీసర్ల ముమ్మర వేట

మహారాష్ట్ర నుంచి స్పెషల్ టీమ్స్

మత్తు మందు ప్రయోగించేందుకు రంగం సిద్ధం

ఆసిఫాబాద్, కాగజ్​నగర్, వెలుగు: రెండు నెలల కింద ఇద్దరు గిరిజనులను పొట్టన పెట్టుకున్న పులి జాడ ఇప్పటికీ దొరకలేదు. ఫారెస్ట్ ఆఫీసర్ల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి స్పెషల్ టీమ్​లను రప్పించి ఆపరేషన్ టైగర్ పేరుతో కుమ్రంభీం జిల్లా బెజ్జూర్ అటవీ ప్రాంతంలో మకాం వేశారు. పాపన్నపేట్ ప్రాంతంలో పశువులను ఎరగా ఉంచి.. అక్కడే ఓ మంచె  ఏర్పాటు చేసుకుని కాపు కాస్తున్నారు. ఇదిలా ఉంటే .. బుధవారం రాత్రిపూట బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామ శివారులో పులి కనిపించింది. ఇప్పటికే పశువుల్ని చంపేసిన పులి తాము వేసిన ఎరలో పడకపోగా.. జనావాసాల్లో అడపాదడపా కనిపిస్తుండటంతో ఆఫీసర్లలో టెన్షన్ మొదలైంది. మరోవైపు.. ఇన్ని రోజులు గడుస్తున్నా ఇద్దర్ని చంపిన పులి జాడ కనిపెట్టలేకపోతున్నారని ఆఫీసర్లపై జనం మండిపడుతున్నారు. తాము పొలాలకు వెళ్లాలంటేనే భయం భయంగా ఉందంటూ అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో పులి సంచరించే ప్రాంతాల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు నిఘా మరింత పెంచారు.

డ్రోన్ కెమెరాలతో గాలింపు

గతేడాది నవంబర్ 11న దహెగాం మండలం లోని దిగిడకు చెందిన సిడాం విఘ్నేశ్, 29 న పెంచికల్ పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మలపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఇద్దరిని చంపిన పులి ఒక్కటేనని నిర్ధారించిన ఆఫీసర్లు దాని జాడ కనిపెట్టేందుకు డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించారు. బెజ్జూర్ రేంజ్ లోని కంది భీమన్న అటవీ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నట్లు పసిగట్టారు. సోమవారం రోజున పులి ఓ పశువును చంపేసి మాంసం వదిలి వెళ్లింది. ఇదే ప్లేస్ లో మరో ఆవును బోనులో ఎరగా ఉంచిన ఆఫీసర్లు..  ఆ ప్రాంతానికి 20 మీటర్ల దూరంలో మంచె ఏర్పాటు చేశారు. మరోసారి అక్కడికి పులి వచ్చే చాన్స్ ఉండటంతో మంచెల మీదనుంచే ఎక్స్ పర్ట్స్ షూటర్స్ తో మత్తుమందు ప్రయోగించేలా ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్  ఫారెస్ట్  కన్జర్వేటర్ సీపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన ఈ ఆపరేషన్​లో 40 మంది ఫారెస్ట్ రెస్క్యూ టీం గస్తీ చేపట్టారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన టైగర్ ఎక్స్ పర్ట్స్ తో పాటు జన్నారం, ఖానాపూర్ ల నుంచి ఫారెస్ట్ టీమ్స్ ని రప్పించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పశువుల డాక్టర్ ని కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిసింది. బోన్​ల వద్ద ట్రాక్ కెమెరాలతో పరిశీలిస్తున్న యానిమల్ ట్రాకర్స్ పులి ఆనవాళ్లు గుర్తించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అటువైపు ఎవరూ వెళ్లొద్దని ఆర్డర్స్ పాస్ చేసి గురు, శుక్రవారాల్లో డ్రోన్ కెమెరాలతో పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ విషయాలను ఆఫీసర్లు బయటకు వెల్లడించడంలేదు.

ఎరగా ఆవును పెట్టడంపై మండిపాటు

ఫారెస్ట్ ఆఫీసర్లు పులిని పట్టుకునేందుకు ఎరగా ఆవును కట్టేయడంపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడుతున్నారు. ఆరాధించే గోవును పులికి ఎరగా ఎందుకు పెట్టారో చెప్పాలని నిలదీస్తున్నారు. గోరక్షణ సమితులు సోషల్ మీడియా లో దీనిపై ప్రశ్నిస్తున్నాయి. భజరంగ్ దళ్ నాయకులు కాగజ్ నగర్ డీఎస్పీ కి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. పులికి ఎరగా అడవి జంతువుల్ని తెచ్చి పెట్టాల్సింది పోయి
ఆవును ఎందుకు ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై మరోసారి  భజ్ రంగ్ దళ్ ఖమ్మం కన్వీనర్ శివ గౌడ్ బెజ్జూర్ పోలీస్ స్టేషన్​లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.

​తొందరలోనే టైగర్‌ను పట్టుకుంటం
ఇద్దరిని చంపిన పెద్దపులిని పట్టుకునేందుకు 5 రోజులుగా బెజ్జూర్ రేంజ్‌లోని కందిభీమన్న అడవిలో సిబ్బంది కాపు కాస్తున్నారు. మొత్తం 40 మంది సిబ్బందితో పకడ్బందీ వ్యూహం రూపొందించాం. ఈ ప్రాంతంలోనే ఆ పెద్దపులి ఉన్నట్లు గుర్తించినం.ఆ పులి బార్డర్ దాటి మహారాష్ట్రలోకి అడుగుపెట్టకుండా డప్పు చాటింపు వేయిస్తున్నాం. తొందరలోనే పులిని పట్టుకుంటాం. ఎరగా పెట్టిన పశువుపై పులి దాడి చేయడానికి వచ్చిన సమయంలో మంచె మీది నుంచి మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చేలా ఎక్స్ పర్ట్స్‌ని రెడీగా ఉంచాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్జర్ వేటర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది, మహారాష్ట్ర రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్, హైదరాబాద్ స్పెషల్ టైగర్ టీమ్స్, యానిమల్ ట్రాకర్స్ పులిజాడ కనిపెట్టే పనిలో ఉన్నాయి. సాధ్యమైనంత తొందరలోనే దాన్ని పట్టుకుంటాం.
– శాంతారాం , జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్

For More News..

సాగర్ బైపోల్‌తో నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ.. ఆంధ్రా కంపెనీకి కాంట్రాక్ట్

అఖిలప్రియ తమ్ముడిపై కేసు.. ఎఫ్ఐఆర్‌‌లో చేర్చిన పోలీసులు

వ్యాక్సిన్ తర్వాత 30 నిమిషాలు అక్కడే రెస్ట్‌‌.. రియాక్షన్స్‌‌ వస్తే వెంటనే ట్రీట్‌‌మెంట్

వరస్ట్​ సీఎంలలో కేసీఆర్‌కు 4వ ప్లేస్‌

Latest Updates