ఇల్లరికం పోదామన్నందుకు భార్య, కొడుకును చంపేసిండు

నిందితుడి ఆత్మహత్యా యత్నం

గచ్చిబౌలి, వెలుగు: ఇల్లరికం వెళదామన్నందుకు భార్య,  ఏడాదిన్నర కొడుకును హత్య చేసిన సంఘటన హైదరాబాద్​లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నాటక రాష్ట్రం యాద్గిరి జిల్లా రాంపురం గ్రామానికి చెందిన  అనంతప్ప అలియాస్​ చిన్నాకు  అదే జిల్లా వనగిరి గ్రామానికి నాగప్ప, లక్ష్మీల కుమార్తె మహదేవమ్మ(25)తో 2010లో  వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో  చిన్నా అత్తగారి ఇంట్లోనే కాపురం పెట్టాడు. వీరికి  కుమార్తెలు అనురాధ(6), అర్చన(2), కుమారుడు ఆకాశ్(18 నెలలు)  సంతానం.  అనంతప్ప  రెండేళ్ల క్రితం భార్య పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చాడు. గచ్చిబౌలి గోపన్​పల్లిలోని ఎన్టీఆర్​నగర్​లో అద్దెకు ఉంటున్నాడు. పెద్ద కూతురు కర్నాటకలో నానమ్మ దగ్గర ఉంటోంది.

అనంతప్ప కొన్నిరోజులపాటు  ట్రాక్టర్​డ్రైవర్​గా పనిచేసి అనంతరం ఇంటి ఓనర్​వద్దే ఆటో డ్రైవర్​గా చేస్తున్నాడు. మద్యానికి అలవాటుపడ్డ అనంతప్పను పది రోజుల క్రితం ఆటో యజమాని ఉద్యోగం నుంచి తొలగించడంతో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మహదేవమ్మ తిరిగి తమ ఊరికి వెళ్లి అక్కడే కాపురం చేద్దామని భర్త అనంతప్పకు చెబుతుండేది. భార్యభర్తల మధ్య ఇల్లరికంపై కొద్దిరోజులుగా గొడవ జరుగుతోంది. బుధవారం వేకువజామున 5 గంటల సమయంలో నిద్రపోతున్న భార్య మహదేవమ్మ, కుమారుడు ఆకాశ్​ల గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఉదయం7 గంటల సమయంలో  ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటి పైకప్పు రాడ్డుకు ఉరేసుకోవడానికి ప్రయత్నించగా తాడు తెగిపోయింది. దీంతో వాటర్​హీటర్​వైర్​కట్​ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కరెంట్​షాక్​తో గాయపడ్డ అనంతప్పకు ట్రీట్​మ్మెంట్​అందిస్తున్నారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కూతురిని వదిలేసిండు

ఇల్లరికానికి వెళితే తన భార్య, కుమారుడు తన వంశం కాబట్టి పరువు పోతుందని, అందుకే భార్య మహదేవమ్మ, కుమారుడు ఆకాశ్​లను హతమార్చినట్లు అనంతప్ప పోలీసులకు తెలియజేశాడు. కుమార్తె అర్చన(3)కు తన వంశంతో సంబంధం లేదని, అందుకే హత్య చేయలేదని పేర్కొన్నాడు.

Latest Updates