నేడే హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ రిజల్ట్

  • కౌంటింగ్ కు ఏర్పాట్లన్నీ పూర్తి
  • 14 టేబుళ్లు.. 22 రౌండ్లు..300 మంది సిబ్బంది
  • భారీగా బందోబస్తు ఏర్పాటు
  • హర్యానా, మహారాష్ట్ర ఫలితాలు కూడా ఈరోజే
  • తేలనున్న అభ్యర్థుల భవిత

సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంత రేపిన హుజూర్​నగర్​ ఉప ఎన్నిక రిజల్ట్​ గురువారం తేలిపోనుంది. ఓట్ల కౌంటింగ్​ కోసం అధికారులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభవుతుంది. నియోజకవర్గంలోని 302 పోలింగ్ బూత్ లకు సంబంధించి.. 14 టేబుళ్లపై 22 రౌండ్లలో కౌంటింగ్​ చేపట్టనున్నారు. ఈ మేరకు 14 మంది సూపర్ వైజర్లు, 14 మంది అసిస్టెంట్ సూపర్ వైజర్లు, 14 మంది మైక్రో అబ్జర్వర్లతోపాటు 300 మంది సిబ్బంది నియమించారు.

మధ్యాహ్నం సరికి పూర్తి ఫలితాలు

కౌంటింగ్ ​ప్రక్రియలో మొదటగా సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత పోలింగ్​ బూత్ నంబర్ల వారీగా కౌంటింగ్ మొదలవుతోంది. నేరేడుచర్ల మండలం దాచారం పోలింగ్ స్టేషన్ తో మొదలై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్ నగర్, గరిడేపల్లి మండలాల ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో పూర్తవుతుంది. ఉదయం తొమ్మిది గంటల సమయానికి తొలి రౌండ్ ఫలితం వస్తుందని, మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు.

భారీగా భద్రత

కౌంటింగ్ నేపథ్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, 200 మంది పోలీసులను మోహరించారు. కౌంటింగ్​ కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామని జిల్లా కలెక్టర్​ అమయ్​కుమార్​ చెప్పారు. ఉదయం 7.30 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్​ను ఓపెన్​ చేస్తామని తెలిపారు.

Latest Updates