కోట్ల కొద్దీ పైసలు .. గ్రేటర్లో రోడ్లన్నీగుంతలు

హైదరాబాద్, వెలుగు‘హైదరాబాద్​సిటీలో గతుకులతో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మెరుగులు దిద్దుతం. ఖర్చుకు రాజీ పడకుండా రోడ్లను అద్దాల్లా మార్చుతం. ఇక గ్లోబల్ సిటీలో రోడ్ల రూపురేఖలు మార్చడమే లక్ష్యం’అంటూ పెద్ద పెద్ద హామీలిచ్చిన నేతలను.. ఇప్పుడు సిటీలో గుంతల రోడ్లు వెక్కిరిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్​లో రోడ్ల కోసం 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో రూ.2,703 కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్రం ఏర్పాటైన ఈ ఆరేండ్లలో దానికంటే ఎక్కువగా రూ.2,723 కోట్లు ఖర్చు చేసినట్టు సర్కారు లెక్కలు చెప్తున్నాయి. మరి ఇంత ఎక్కువ సొమ్ము ఖర్చుపెట్టినా రోడ్లు మాత్రం ఎప్పటిలాగానే గుంతలతో కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ లో శరవేగంగా రోడ్లు నిర్మించామని నేతలు, అధికారులు చెప్తుండగా.. వానాకాలం సగం నాటికే చాలా వరకు దెబ్బతిన్నాయి.

ఏజెన్సీలకు అప్పజెప్పినా..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9,103 కిలో మీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో 709 కిలోమీటర్లు మెయిన్​రోడ్లు కాగా, వీటి నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఈ ఏడాది నుంచి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఐదేళ్ల కాలపరిమితితో మొదటి ఏడాది 50 శాతం, తర్వాత రెండేళ్లలో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మించడంతోపాటు గుంతల పూడ్చివేత, ఇతర పనులను ఆయా ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. రోడ్ల మెయింటెనెన్స్ కోసం జీహెచ్ఎంసీ ఏటా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నా ఎలా ఉన్నవి అలానే ఉంటున్నాయి.

లాక్​డౌన్​లో రోడ్లు వేశామని…

ఏటా వానకాలం వచ్చిందంటే వరద నీటికి కొట్టుకుపోయే రోడ్లు, గుంతల పడిన మార్గాల్లోనే సిటీ జనాల జర్నీ సాగుతుంది. కానీ కరోనాతో ఇంటికే పరిమితం కావడంతో… రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. వేసిన రోడ్లపైనే కోటింగ్​ పనులు చేపట్టి… బాగా దెబ్బతిన్న చోట్ల లోపలి నుంచి పూర్తిస్థాయిలో రిపేర్లు చేయకుండానే వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే లాక్ డౌన్ పనులపై జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో… ఇష్టమొచ్చినట్టుగా రోడ్లు వేసి బిల్లులు పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆరేండ్లలో రూ.2,723 కోట్ల ఖర్చు

ఉమ్మడ రాష్ట్రంలో సిటీ రోడ్ల నిర్మాణం, నిర్వహణకు పదేళ్ల కాలంలో రూ. 2,703 కోట్లు ఖర్చు చేస్తే… తెలంగాణ వచ్చి ఆరేళ్ల కాలంలో అంతకు మించిపోయేలా ఖర్చు చేసి, నగరవాసులకు అవే గతుకులను రోడ్లపై సాఫీ జర్నీ చేయమంటోంది. ఏటా రూ. 300 కోట్లకు తగ్గకుండా రూ. 2,723 కోట్లు ఖర్చు చేసినా… గుంతల్లేని రోడ్లు మాత్రం కనిపించలేదు. ఇక 2019–20 నాటికి రూ. 404 కోట్లు ఖర్చు చేసిన బల్దియా… గడిచిన ఏడాది కాలంలో రెండు లక్షల గుంతలను పూడ్చినట్లుగా తెలుస్తోంది. సిటీలో ఎక్కువ భాగం సీసీ రోడ్లే ఉండగా, వీటి నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. చిన్న వానలకే రోడ్లపై గుంతలు పడుతున్నాయి. 15రోజుల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే రిపేర్లు చేయాలని 294మంది కంప్లైట్ చేయగా, ఫిర్యాదు రానివి అంతకు 10 రెట్లు ఉంటాయని అంచనా.

రూల్స్, క్వాలిటీ పట్టదు

వేల కిలోమీటర్ల మేర ఉన్న రోడ్లు అధ్వాన్నంగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏటా వానాకాలం నాటికి రోడ్లు పాడైపోవడానికి నిర్మాణంలో లోపాలే కారణాలని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌‌సీ) రూల్స్‌ ప్రకారం.. అర్బన్ ఏరియాల్లో సిమెంట్ రోడ్లు 20 ఏళ్లు, బీటీ రోడ్లు 10-–15 ఏళ్లు మన్నికగా ఉండేలా మెటీరియల్ వినియోగించాలి. ఆ లోపు రిపేర్లు, మెయింటెనెన్స్ అంతా కాంట్రాక్టరే చూసుకోవాలి. అయితే బల్దియా ఆధ్వర్యంలో చేపట్టే పనుల్లో ఇలాంటివేవీ కనిపించవు. మళ్లీ జీహెచ్ఎంసీ నిధులనే కాంట్రాక్టర్లకు కేటాయించి పనులు అప్పగించిన దాఖలాలు ఉన్నాయి. ఇక అర్బన్ ఏరియాల్లో రోడ్లు వేసేటపుడు వారం రోజుల పాటు నమోదయ్యే ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకుని .. దానికి తగినట్టుగా రోడ్లు వేయాలి. నాణ్యతతో రోడ్లను నిర్మించకపోవడంతో పాడైపోతున్నాయి. చంద్రబాబు హయాంలో సిటీలో రోడ్లు వేసిన వారం రోజుల్లో క్వాలిటీ చెకింగ్ చేసే యంత్రాంగం పనిచేసేది. టీఆర్ఎస్​ సర్కారు వచ్చాక తర్వాత ఆ వ్యవస్థ లేదు.

Latest Updates