హైడల్ పవర్ జనరేషన్ సగానికి డౌన్

శ్రీశైలం ప్లాంట్ ప్రమాదంతో జల విద్యుత్ కు దెబ్బ

గతేడాది 4,509.2 ఎంయూల ఉత్పత్తి..

ఈ ఏడాది అందులో సగం కష్టమే

నిరుడు శ్రీశైలం నుంచే ఎక్కువ.. 1,993 ఎంయూల జనరేషన్

ప్రమాదం వల్ల అంచనాలు తలకిందులు.. లేకుంటే డబుల్ ఉత్పత్తి

నాగార్జునసాగర్ లో ఇప్పుడిప్పుడే ఉత్పత్తి ప్రారంభం

హైదరాబాద్‌, వెలుగు: శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ ప్రమాదంతో రాష్ట్రంలో జల విద్యుత్‌ ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఏటా నీటి ప్రవాహం ఉండే జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో హైడల్‌ పవర్‌ జనరేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఈ ఏడాది ప్రాజెక్టుల్లోకి అనుకున్నదాని కంటే ఎక్కువ నీరు రావడంతో హైడల్‌ పవర్‌ ఉత్పత్తి రెట్టింపు అవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ శ్రీశైలంలో జరిగిన ప్రమాదంతో అంచనాలు తలకిందులు అయ్యాయి . ఈ సీజన్ లో రోజువారీగా 47 మిలియన్‌ యూనిట్ల టార్గెట్‌కు రీచ్‌ కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 25, 26 మిలియన్‌ యూనిట్లకు మించడం లేదు. మంచి పీక్‌ స్టేజ్ లో జరిగిన ప్రమాదం విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని ఎక్స్ పర్టులు చెబుతున్నారు.

గతేడాది 4,509 ఎంయూలు

2019–20లో రాష్ట్రంలోని జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా 4,509.2 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. అందులో శ్రీశైలం నుం చే 1,993.1 ఎంయూలు, నాగార్జున సాగర్‌ నుంచి మరో 1,512 ఎంయూల హైడల్‌ పవర్‌ ఉత్పత్తి జరిగింది. 2019 జులైలో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు పూర్తి స్థాయిలో చేరక కేవలం 6.9 ఎంయూలు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఆగస్టులో మాత్రం 398 ఎంయూలు జనరేట్‌ చేశారు. సెప్టెంబర్ లో నీటి నిల్వలు పెరిగి 487 ఎంయూలు, అక్టోబర్ 500.7, నవంబర్ లో 232.2 ఎంయూల పవర్‌ జనరేషన్‌ జరిగింది. ఇక ఈ ఏడాదిలో మూడు నెలల్లో శ్రీశైలంలో ఇప్పటి దాకా 790.47 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి జరిగింది.

ఇప్పట్లో ఉత్పత్తి కష్టమే

ఈ ఏడాది జూన్ లో శ్రీశైలంలో 11 ఎంయూలు మాత్రమే ఉత్పత్తి జరిగింది. జులైలో 380.2 ఎంయూలకు చేరింది. ఆగస్టు నెలలో ప్రమాదం జరిగే నాటికే 399.27 ఎంయూలు ఉత్పత్తి చేశారు. ఇలా ఈ ఏడాది ఇప్పటిదాకా 790.47 ఎంయూల ఉత్పత్తి జరిగింది. ప్లాంట్‌ ప్రమాదంతో ఇప్పట్లో విద్యుత్‌ ఉత్పత్తి కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది సీజన్ లో ఉత్పత్తి చేసిన 1,993.1 మిలియన్‌ యూనిట్లలో సగం కూడా ఉత్పత్తి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌లో ప్రమాదం జరగకపోతే కరెంటు ఉత్పత్తి ఒక్క ఆగస్టు నెలలోనే 630 ఎంయూలు దాటేదని అంటున్నారు. ఈనెల 20 నాటికి 399.27 ఎంయూ ఉత్పత్తి జరగ్గా.. జనరేషన్‌ కొనసాగితే మరో 11 రోజుల్లో 231 ఎంయుల వరకు ఉత్పత్తి అయ్యేదని పేర్కొంటున్నారు.

45 శాతం పైగా శ్రీశైలం నుంచే

రాష్ట్రంలో 2,441.8 మెగావాట్ల జల విద్యుత్‌ సామర్థ్యం ఉంది. 900 మెగావాట్ల సామర్థ్యమున్న శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ నుం చే 45 నుంచి 50 శాతం వరకు హైడల్‌ పవర్‌ జనరేట్‌ అవుతుంది. తర్వాతి స్థానంలో 815.6 మెగావాట్ల కెపాసిటీ ఉన్న నాగార్జునసాగర్‌ ప్లాంట్‌ నిలుస్తుంది. జూరాల (234 మెగావాట్లు), లోయర్‌ జూరాల (240 మెగావాట్లు) ప్రాజెక్టుల నుంచి ఓ మోస్తరుగా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.

శ్రీశైలంలో వానాకాలంలో విద్యుత్‌ ఉత్పత్తి

(మిలియన్‌ యూనిట్లలో)

నెల                                2019                             2020

జూలై                                6.9                              380.2

ఆగస్టు                            398.1                            399.27

సెప్టెంబరు                         487.0                            –

అక్టోబరు                          500.7                            –

నవంబరు                         232.2                            –

Latest Updates