హైడల్​ పవర్​ ఉత్పత్తి ఢమాల్​

మరోవైపు కరెంట్ డిమాండ్ పెరిగింది
కొనుగోళ్లు, థర్మల్ స్టేషన్లలో ప్రొడక్షన్ పెంపు
జెన్ కో నుంచి ట్రాన్స్ కోకు కరెంట్ సరఫరా

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో జల విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదం తర్వాత ప్రొడక్షన్ భారీగా తగ్గింది. దీనికి తోడు రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం నాలుగైదు రోజులుగా పెరిగింది. మొన్నటి వరకు వానలతో కరెంట్ వాడకం తగ్గినా, ఇటీవల మళ్లీ పెరుగుతూ వస్తోంది. పోయిన నెల 20న 6,821 మెగావాట్ల డిమాండ్‌ ఉండగా.. సోమవారం 10,138 మెగావాట్లు, మంగళవారం 10,500 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. దీంతో విద్యుత్‌ సంస్థలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి. ఓవైపు ట్రాన్స్‌కో కరెంట్ కొనుగోళ్లను పెంచగా.. మరోవైపు జెన్ కో కూడా ట్రాన్స్ కోకు కరెంట్ సరఫరా చేస్తోంది. శనివారం 17.45 ఎంయూలు, ఆదివారం 4.77 ఎంయూలు, సోమవారం 7.89 ఎంయూలు ట్రాన్స్‌కోకు సరఫరా చేసింది.

79 ఎంయూలు కొనుగోలు…

రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ పెరగడంతో థర్మల్‌ పవర్ ప్లాంట్లలో జెన్‌కో ఉత్పత్తిని పెంచింది. పోయిన నెల 20న 24.85 ఎంయూలు ఉన్న జనరేషన్‌, ఆదివారం నాటికి 47.05 ఎంయూలకు పెరిగింది. సోమవారం 61.73 ఎంయూల ఉత్పత్తి జరిగింది. సోమవారం రాష్ట్రంలో 197.47 ఎంయూల విద్యుత్ వినియోగం జరగ్గా.. ఇందులో థర్మల్‌ స్టేషన్ల నుంచి 61.73 ఎంయూలు, హైడల్ స్టేషన్ల నుంచి 7.89  ఎంయూల సరఫరా జరిగింది. సింగరేణి 27.13  ఎంయూలు సరఫరా చేసింది. మిగిలిన మొత్తంలో 70.99 ఎంయూలు సెంట్రల్‌ జనరేషన్‌ స్టేషన్ల నుంచి, 28 ఎంయూలు ఎన్ సీఈల నుంచి కొనుగోలు చేశారు.

జూరాలపైనే ఆధారం

జల విద్యుత్‌ కోసం ఇప్పడు లోయర్‌ జూరాల, ప్రియదర్శిణి జూరాల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోయర్‌ జూరాల నుంచి మూడ్రోజులుగా 4.32, 3.15, 4.49 ఎంయూల పవర్‌ జనరేట్‌ అవుతోంది. ఇక రెండు మూడ్రోజులుగా నాగార్జున సాగర్‌ లో హైడల్ పవర్ జనరేషన్‌ తగ్గింది. శనివారం 10.73 ఎంయూలు ఉత్పత్తి కాగా,   ఆదివారం అసలే ప్రొడక్షన్ జరగలేదు. సోమవారం కేవలం 1.56 ఎంయూలు మాత్రమే ఉత్పత్తి అయింది. సాగర్‌ లో ఉత్పత్తి తగ్గడంతో కేవలం జూరాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.

For More News..

తెలంగాణలో కొత్తగా 2,832 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో లక్ష టన్నుల యూరియా కొరత

హైదరాబాద్‌‌‌‌లో సాదాసీదాగా నిమజ్జనం

Latest Updates