హైద‌రాబాద్: భ‌ర్త వేధింపుల‌తో మ‌హిళ‌ ఆత్మ‌హ‌త్య.. దారుణంగా హింసించిన భ‌ర్త‌.. సీసీకెమెరా వీడియో

ప్రేమించి పెళ్లి చేసుకున్న‌వాడే ఆమె పాలిట శాపంగా మారాడు. మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని.. క‌ట్టుకున్న భార్య‌ను వేధింపుల‌కు గురి చేశాడు. బ‌య‌ట జ‌ల్సాలు చేసి వ‌చ్చి.. ఇంట్లో భార్య‌ను హింసించ‌సాగాడు. దీంతో ప్రేమించినవాడు ఇలా త‌యార‌వ‌డంతో త‌ట్టుకోలేక‌పోయిన ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. హైద‌రాబాద్‌లోని శంషాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని రాళ్లగూడ ఏరియాలో ఉన్న ఓ విల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితురాలిని ఆమె భ‌ర్త ఎంత దారుణంగా హింసించే వాడ‌న్న‌దానికి సంబంధించిన సీసీకెమెరా వీడియో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

శంషాబాద్ లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ పైలట్‌ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త ప్రవర్తనతో విసిగిపోయాన‌ని, జీవితాంతం ప్రేమించాల‌నుకున్న వాడు వేరే మ‌హిళ‌తో సంబంధం పెట్టుకుని దాన్ని త‌ప్పుగా కూడా భావించ‌క‌పోవ‌డం తట్టుకోలేక‌పోతున్నానంటూ ఫేస్‌బుక్‌లో సెల్ఫీ వీడియో పెట్టి గురువారం అర్ధ‌రాత్రి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వరరావు, అదే జిల్లా అద్దంకికి చెందిన లావణ్య లహరి (31) ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వర్‌రావు ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా ప‌ని చేస్తున్నాడు.. లావణ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా వ‌ర్క్ చేస్తోంది. ఈ దంపతులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సీఎస్‌కే విల్లాలో ఉంటున్నారు. అయితే కొన్నాళ్లుగా వెంకటేశ్వరరావు మ‌రో యువ‌తితో సంబంధం పెట్టుకుని లావణ్య‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. గురువారం రాత్రి కూడా దారుణంగా హింసించంతో ఆవేద‌న‌తో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రులో లావ‌ణ్య ఆరు నెల‌ల గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు భ‌ర్త ఆమెను పొట్ట‌పై కొట్ట‌డంతో గ‌ర్భ‌స్రావం అయింద‌ని ఆమె తండ్రి చెబుతున్నాడు. అత‌డి వేధింపులను త‌ట్టుకోలేక లావ‌ణ్య గురువారం అర్ధ‌రాత్రి ఆత్మ‌హ‌త్య చేసుకుందని, ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసుల తెలిపారు. ఆమె భ‌ర్త‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామ‌న్నారు.

చెత్త వెధ‌వ‌ల కోసం బ‌లిదానం వ‌ద్దు

లావ‌ణ్యను ఆమె భ‌ర్త దారుణంగా హింసిస్తున్న ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీకెమెరా వీడియోను ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ ట్వీట్ చేశారు. అమ్మాయిలూ చెత్త వెధ‌వ‌ల కోసం బ‌లిదానాలు వ‌ద్దు. బ‌తికి సాధించండి అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఈ వీడియోలో లావ‌ణ్య‌ను భ‌ర్త వెంక‌టేశ్వ‌ర‌రావు దారుణంగా కొడుతున్న విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. ఆమెను హింసిస్తుంటే పెంపుడు కుక్క అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం నెటిజ‌న్ల‌ను క‌లిచివేస్తోంది.

Latest Updates