లిఫ్ట్ ఇచ్చిన మ‌హిళ‌ను వేధింపుల‌కు గురిచేసిన కానిస్టేబుల్

హైద‌రాబాద్‌: త‌న‌కు కారులో లిఫ్ట్ ఇచ్చిన మ‌హిళను వేధింపులకు గురిచేశాడు ఓ కానిస్టేబుల్. అత‌ని వేధింపులు భ‌రించ‌లేక ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ కానిస్టేబుల్ పై కేసు న‌మోదైంది. శ్రీనగర్‌ కాలనీలో కారులో వెళ్తున్న ఓ మహిళను కానిస్టేబుల్‌ వీరబాబు తనను సీఎం క్యాంపు ఆఫీస్‌ వరకు డ్రాప్‌ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. పోలీస్ డ్రెస్‌లో ఉన్న అత‌న్ని చూసి ఆ మ‌హిళ వెంట‌నే అందుకు అంగీక‌రింది. కారు ఎక్కిన త‌రువాత ఆమెతో మాటలు కలిపిన కానిస్టేబుల్ ఆమె ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు‌. ఫోన్ నెంబర్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి కానిస్టేబుల్‌ మహిళకు ఫోన్లు చేయడం, వాట్సాప్‌లో మెసేజ్ లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. తీవ్ర వేధింపులకు గురైన ఆ మహిళ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ వీరబాబుపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. 12వ బెటాలియన్ టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్ వీరబాబును విధుల నుంచి సస్పెండ్‌ చేశామ‌ని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, పోలీసు శాఖలో ఇలాంటి వారు ఉండటం సిగ్గుచేటన్నారు. ఇలాటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే 9490616555కి సమాచారం ఇవ్వాలని సూచించారు.

 

Latest Updates