మాస్కుల పేరుతో డాక్టర్ కు కుచ్చుటోపీ, రూ.56,000 మాయం

హైదరాబాద్: మాస్కుల పేరుతో ఓ డాక్టర్ కు 56 వేల రూపాయలు కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు. న‌గ‌రానికి చెందిన ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ ఎక్స్ పోర్ట్ ఇండియా డాట్ కం అనే వెబ్ సైట్‌లో క‌రోనా వైర‌స్ నుండి ర‌క్ష‌ణ కోసం N95 మాస్కులు కావాలని ఆర్డర్ పెట్టాడు. ఇది గమనించిన కొందరు వ్యక్తులు… తాము సంబంధిత మాస్క్ లు స‌ప్ల‌య్ చేస్తామ‌ని, ఆ డాక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. అనుకున్న ధరకే సప్లై చేస్తామ‌ని, ముందుగా సగం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో డాక్ట‌ర్ వారి మాట‌లు న‌మ్మాడు. ముందుగా ఆన్లైన్ ద్వారా 56, 000 రూపాయలను వారి అకౌంట్‌కు బ‌దిలీ చేశాడు. వారి చెప్పిన తేదికి మాస్కులు రాకపోవ‌డంతో డాక్ట‌ర్ వారికి ఫోన్ చేశాడు. మొబైల్ స్విచాఫ్ అని రావడంతో తాను మోసపోయానని గ్ర‌హించి .హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates