బిర్యానీయే కాదు.. ఇవీ సూపరుంటయ్​!

hyderabad-famous-tasty-and-spicy-foods

హైదరాబాద్​ పేరు చెప్పి.. ఇక్కడ దొరికే ఫేమస్​ ఫుడ్​ ఐటమ్​ పేరు చెప్పమని అడిగితే.. అందరూ టక్కున చెప్పేది హైదరాబాదీ దమ్​కా బిర్యానీయే.  అంతలా ప్రేమిస్తారు.. మనోళ్లు దమ్​ బిర్యానీని. చుట్టాలొస్తే బిర్యానీ, దోస్తులు కలిస్తే బిర్యానీ, రోజూ తినే వంట బోర్​ కొడితే బిర్యానీ.. బిర్యానీని మించిన రుచిని ఎందులోనూ వెతుక్కోవడానికి ఇష్టపడం. అయితే.. హైదరాబాద్​లో బిర్యానీతో పాటు.. కొన్ని రకాల ఫుడ్​ ఐటమ్స్​ ఫేమస్​. బిర్యానీతో సమానంగా హైదరాబాదీలను, హైదరాబాద్​కి వచ్చిన గెస్ట్​లను నోరూరించి.. గౌరవించే ఆ ఫుడ్​ ఐటమ్స్​ ఇవే..

పాయా నాన్​

ఇది హైదరాబాదీలు ఇష్టంగా తినే బ్రేక్​ఫాస్ట్​ ఐటమ్​. రుచికి రుచి.. బలానికి బలం దీని స్పెషాలిటీ. మటన్​ పాయాకు మసాలా రుచి తగిలించి నాన్​ కి రోటీతో కలిపి లాగిస్తుంటే.. మసాలా ఘాటు నషాలానికంటుతుంటే.. రుచి పుర్రెకు తగులుతది. గోధుమ పిండి, మైదాపిండితో చేసే నాన్​ కి రోటీ కండపుష్టికి ఉపయోగపడితే.. మటన్ బొక్కలతో మరిగించిన పాయా ఎముక పుష్టికి సహాయపడుతుంది. ఇక మసాలా దినుసులు.. దగ్గు, కఫం, జలుబు, తలనొప్పి, ఒత్తిడి, మగత వంటి వాటిని మటుమాయం చేస్తుంది. నాంపల్లి రైల్వే స్టేషన్​లోని అజిజియా హోటల్​, చాదర్​ఘాట్​లోని నయాగరా హోటల్లలో దొరికే పాయా, నాన్​ ఓసారి టేస్ట్​ చూడండి. వాహ్​.. అనకుండా ఉండలేరు.

హైదరాబాదీ చాట్​

వేడి వేడి సూపులో.. ఉడకబెట్టిన శెనగ బఠాణీలు వేసి అంచుకు ఉల్లిగడ్డ వేసుకొని గుటుక్కున మింగే పానీపూరి టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్​లో పానీపూరీలో చాలావరకు ఉడికించిన శెనగలే వాడతారు. కానీ.. కొన్నిప్రాంతాల్లో ఉడికించిన ఆలూపేస్ట్​ని పానీపూరిలో పెట్టి ఇస్తారు. ఆర్డర్​ ఇచ్చిన పానీపూరీ తిన్న తర్వాత లాస్ట్​లో ఒక కాంప్లిమెంటరీ పానీపూరి తినకపోతే.. మన ఆత్మ శాంతించదు. కదా.. అందులోనే అసలు పానీపూరీ రుచి దాగుందేమో అనిపిస్తుంది. హైదరాబాద్​లో దొరికే పానీపూరీలో మసాలా పూరీ, పానీ పూరీ, రగడా పూరీ ఇలా చాలా రకాలుంటాయి. జూబ్లీహిల్స్​లోని మహారాజా చాట్​, బర్కత్​పురాలోని మయూర్​ పాన్​షాప్​, గచ్చిబౌలిలోని సర్దార్జీ దాబా, కోఠీలోని గోకుల్​ చాట్ వంటి చాట్​సెంటర్లలో దొరికే పానీపూరీ రుచి వేరే ప్రాంతాల్లో దొరకదు. పక్కా హైదరాబాదీ ఫ్లేవర్​లో ఇక్కడ దొరికే పానీపూరీ రుచి ఆస్వాదించాల్సిందే తప్పితే.. మాటల్లో చెప్పడం కాస్త కష్టమే.

దోశె, ఇడ్లీ

‘ఇవి కూడా హైదారాబాద్​లో స్పెషలేంటి? ఎక్కడైనా దొరుకుతాయి కదా’ అని ఆశ్చర్యపోకండి. స్పెషాలిటీ లేనిదే.. దాని గురించి ప్రస్తావన రాదు కదా.  చెన్నై, విజయవాడ, గుంటూరులో దొరికే ఇడ్లీ, దోశె రుచి వేరు. హైదరాబాద్​లో దొరికే దోశె, ఇడ్లీ రుచి వేరు. నాంపల్లిలో రామ్​కి దోశె, గోవింద్​కి బండి, బేగంబజార్​లో ప్రగతి టిఫిన్స్​లాంటి కొన్నిచోట్ల దొరికే దోశె, ఇడ్లీ రుచి ఇంకెక్కడ దొరకదు అని గట్టిగా చెప్పొచ్చు. ఇక్కడ దొరికే దోశె, ఇడ్లీలో నెయ్యి, మసాలా, బటర్​, చీజ్​లతో పాటు.. కస్టమర్ల మీద ప్రేమ, పనిలో ఉన్న అనుభవం కూడా కలుపుతారు. అందుకే.. ఇక్కడ దొరికే దోశె, ఇడ్లీ ఫేమస్​ అయ్యాయి. బిర్యానీతో సమానంగా రుచిని అందించే జాబితాలో చోటు సంపాదించాయి.

బర్గర్​

ఈ పేరు చెప్పగానే.. అందరికీ మెక్​ డొనాల్డ్​ బర్గర్లు  గుర్తుకొస్తాయి. కానీ.. హైదరాబాద్​లో దొరికే బర్గర్లు అలాంటివి కాదు. ఆ బర్గర్లకు, ఈ బర్గర్లకు తేడా ఉంటుంది. చేత్తో తయారుచేసిన హైదరాబాదీ బర్గర్లు ఇవి. టొమాటో కెచప్​, మయో, బాగా వేయించిన ఆలూ చిప్స్​ కలిపి ఈ బర్గర్లు తయారుచేస్తారు. హైదరాబాదీ బేకరీల్లో దొరికే బర్గర్లకు, మెక్​ డొనాల్డ్​ వాళ్లు అమ్మే బర్గర్లకు నత్తకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది రుచిలో. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, టొమాటో, చీజ్​ కలిపి హైదరాబాద్​ బేకరీల్లో దొరికే వెజ్​, నాన్​వెజ్​ బర్గర్లు ఇక్కడి ప్రత్యేకం. ఈ బర్గర్లు టేస్ట్​ చేయాలంటే హిమాయత్​నగర్లోని కింగ్​ అండ్​ కార్డినల్​ బేకరీ, ఎంజీ రోడ్డులోని యూనివర్సల్​ బేకరీ, బంజారాహిల్స్​లోని మౌంటెన్ బేకరీ, అబిడ్స్​లోని జాన్స్​ బేకరీకి వెళ్లండి. ఇంకా సిటీలోని చాలా బేకరీల్లో హైదరాబాదీ బర్గర్లు దొరుకుతాయి. ధర తక్కువ.. రుచి ఎక్కువ.

ఇరానీ చాయ్​, సమోసా

పొద్దున్నే నాస్తా చేయగానే..  ఒక కప్పు ఇరానీ చాయ్​ తాగితే.. ఆ రోజుకు కావాల్సిన ఎనర్జీ అంతా.. బాడీలో ఒదిగిపోతుంది.  ఇరానీ చాయ్​ పుట్టింది ఇరాన్​లో అయినా.. మన దగ్గర ఉన్నంత డిమాండ్​ అక్కడ ఉండదేమో. హైదరాబాద్​లో ఎక్కడ చూసినా ఈ చాయ్​ ఘుమఘుమలే. రెండు సమోసాలు తిని.. ఒక్క కప్పు ఇరానీ చాయ్​ తాగితే.. ఆ మజా మాటల్లో చెప్పలేం. సమోసా ప్లేస్​లో ఉస్మానియా బిస్కెట్లు తింటే.. అదో రకమైన రుచి. దేని రుచి దానిదే. రెడ్​హిల్స్​లోని సుభాన్​ బేకరీ, సికింద్రాబాద్​లోని  ప్యారడైజ్​ బిర్యానీ సెంటర్​లో దొరికే చాయ్​, బ్లూసీ కేఫ్​, లక్డీకాపూల్​లోని కేఫ్​​ నీలోఫర్​, హిమాయత్​నగర్​లోని కేఫ్​ సిటీ, బంజారాహిల్స్​ రోడ్​నెంబర్​ వన్​లో సర్వీ చాయ్​ నోరూరించే ఇరానీ ఛాయ్​ అడ్డాలు.

షవర్మా..

ఈ అరేబియన్​, లెబనీస్​ ఫుడ్​కి హైదరాబాద్​లో వేలల్లో అభిమానులున్నారు. జ్యూసీగా నోరూరిస్తూ.. మధ్యమధ్యలో పచ్చికారం, ఉల్లిగడ్డ ముక్కలు, చికెన్​ ముక్కలు తగులుతూ తింటుంటే.. నోరంతా కమ్మటి రుచుల వేడుక చేసుకుంటుంది కదా అనిపిస్తుంది షవర్మా తింటుంటే. సన్నటి సెగ మీద ఎర్రగా కాలుతూ.. మసాలా, నెయ్యి, బటర్​ల రుచులతో అలంకరించుకొని హైదరాబాద్​ రెస్టారెంట్లలో దొరికే షవర్మా మిగతా ప్రాంతాలతో పోలిస్తే స్పెషల్​. నాంపల్లిలోని ఫీల్ ఇన్​ సౌదీ రెస్టారెంట్​, పీజీ రోడ్​లోని షవర్మా హౌజ్​, టోలిచౌకిలోని లిమ్రా అరేబియన్​ షవర్మా, కూకట్​పల్లిలోని రోల్​ ఆన్​, బంజారాహిల్స్​లోని స్పైస్​ సిక్స్​, ఖార్ఖానాలోని గ్రిల్​9, శ్రీనగర్​ కాలనీలోని సమ్మీస్​ షవర్మాస్​లలో మీరు కోరుకునే స్పెషల్​ హైదరాబాదీ రుచుల షవర్మా దొరుకుతాయి. కావాలంటే ఓసారి టేస్ట్ చేసి చూడండి.

ఇవే కాదు.. నగరంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఫుడ్​ ఐటమ్స్​ దొరుకుతాయి. కాకపోతే.. అన్నింటినీ ఇక్కడ లిస్ట్​ ఇవ్వడం కుదరదు కాబట్టి. నగరంలో బాగా ఫేమస్​ అయిన కొన్నింటిని మాత్రమే ఇక్కడ చెప్పా.

Latest Updates