బర్త్ డే పార్టీలో కరోనా సోకి వ్యాపారి మృతి.. టెన్షన్‌లో 100 మంది వ్యాపారులు

హైదరాబాద్: హైదరాబాద్ సిటీకి చెందిన ఓ పెద్ద జ్యువెలరీ షాప్ ఓనర్ శనివారం చనిపోయారు. అయితే అంతకుముందు రోజే సదరు వ్యాపారి సిటీలో పెద్ద బర్త్‌ డే పార్టీకి అటెండ్ అయ్యాడని సమాచారం. ఈ పార్టీలో దాదాపు 100 మంది వరకు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ విందుకు అటెండ్ అయిన సిటీలోని మరో ప్రముఖ జ్యువెలరీ చైన్‌ యజమాని కూడా వైరస్ బారిన పడి ఈ రోజే మృతి చెందాడు. పార్టీ హోస్ట్ వల్లే సదరు వ్యాపారికి కరోనా  సోకిందని అధికారులు అనుమానిస్తున్నారు.

జ్యువెలరీ అసోసియేషన్‌ నుంచి సుమారు వంద మంది వ్యాపారులు ఈ పార్టీకి హాజరయ్యారని సమాచారం. ఇప్పుడు వీళ్లందరూ భయంతో కరోనా టెస్టింగ్‌ల కోసం ప్రైవేట్‌ లేబొరేటరీస్‌కు పరుగెడుతున్నారని తెలిసింది. పార్టీకి అటెండ్ అయిన వారి వివరాలను తెలుసుకునే పనిలో హెల్త్ అఫీషియల్స్ బిజీగా ఉన్నారు. పార్టీ జరిగిన రెండ్రోజుల తర్వాత విందును హోస్ట్ చేసిన వ్యాపారికి తొలుత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. కాగా, ప్రజలు రూల్స్‌ను పట్టించుకోకపోవడం వల్లే హైద్రాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ చెప్పారు.

Latest Updates