నష్టాల్లో మెట్రో రైల్‌.. ఐనా మనమే బెస్ట్

ఐదారేళ్లు ఇదే పరిస్థితి

హైదరాబాద్ మెట్రోనే మిగతా నగరాలకంటే బెటర్

ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న యాజమాన్యం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌ ప్రజారవాణా వ్యవస్థలో మెరుగైన మార్పులు తీసుకొచ్చిన మెట్రో రైల్‌ నష్టాల్లో నడుస్తోంది. సిటీలో ట్రాఫిక్‌ కష్టాలను తీర్చుతున్న రైలు బండి తన బతుకు బండిని కష్టంగా నెట్టుకొస్తోంది. జనానికి సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న మెట్రో ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ప్రభుత్వ ఆస్తులను లీజుకు తీసుకున్న ఎల్‌ అండ్‌ టీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ పెద్దఎత్తున లాభాలు గడిస్తోందనే విమర్శల నేపథ్యంలో మెట్రో నష్టాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మరో వైపు భారీగా ఉన్న టికెట్‌ ఛార్జీలు తగ్గించాలంటూ పలువురు ప్రయాణికులు కోరుతున్న తరుణంలో అవునా? మెట్రో నష్టాల్లో నడుస్తోందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

– ఆదాయం వస్తోందిలా..

హైదరాబాద్‌ మెట్రోకు వచ్చే ఆదాయంలో 50 శాతం ప్రయాణికుల టికెట్ల ద్వారా, 45 శాతం ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌, 5 శాతం ప్రకటనల ద్వారా వస్తున్నాయి. ఐదారేళ్లు నష్టాలు ఉంటాయని అధికారులు ముందుగానే ఊహించారు. మెట్రో ప్రాజెక్టు నష్టాల నుంచి గట్టెక్కడానికి మరో ఆరేళ్లు పట్టవచ్చు. ప్రస్తుతం మెట్రో రైల్‌కు రోజుకు రూ.కోటి ఆదాయం వస్తోంది. ప్రయాణికుల సంఖ్య పరంగా చూస్తే హైదరాబాద్‌ మెట్రో రైల్‌ చాలా నగరాల్లోని మెట్రోల కంటే బెటర్‌ అని మెట్రో అధికారులు చెబుతున్నారు. చెన్నై మెట్రో ప్రారంభమై ఐదేళ్లు గడచినప్పటికీ రోజులో ప్రయాణికుల సంఖ్య 60 వేలు కూడా దాటలేదు. బెంగళూరులో ఏడేళ్ల తర్వాత ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 4 లక్షలకు చేరింది. కానీ హైదరాబాద్‌ వచ్చే ఏడాది ఐదు లక్షలకు చేరనుంది.

ఐదేళ్లు పరిస్థితి ఇంతే

మెట్రోకు ప్రస్తుతం ఉన్న నష్టాలు మరో ఐదేళ్ల పాటు తప్పవు. ఇటీవల ట్విట్టర్‌ వేదికగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఈ విషయం స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్‌లో పలువురు నగర వాసులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మెట్రో రైల్‌ నష్టాల్లో ఉందని చెప్పారు. మెట్రో సంస్థ ప్రపంచ స్థాయి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా మారిపోయిందని, ఎల్‌అండ్‌టీ సంస్థ ఇష్టారీతిన కావాల్సిన రీతిలో మలచుకుంటోందని హైదరాబాద్‌ ఇంటెలెక్చువల్స్‌ ఫోరం ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టింది. ఈ పోస్టుకు స్పందించిన హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మెట్రో ఆర్థిక స్థితిగతులను వివరించారు. ఫోరం ప్రతినిధుల అభిప్రాయాన్ని ఖండిస్తూ సమాధానం చెప్పారు. ఎల్‌అండ్‌టీ కంపెనీకి నష్టాలు వస్తున్నాయనే విషయం గమనించాలని తెలిపారు. ఎల్‌ అండ్‌టీ పై ఏటా రూ.1300 కోట్లు వడ్డీ భారం పడుతోందని చెప్పారు. ఎల్‌అండ్‌టీ వాళ్లు ఇప్పటివరకు 12 లక్షల చదరపు అడుగులను నిర్మించారని తెలిపారు. ఇంకా లక్షా 85 వేల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు.

అన్ని మెట్రోలకు కష్టాలే

ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో మెట్రో రైళ్లు నష్టాల్లోనే నడుస్తున్నాయి. మెట్రో రైళ్లకు ప్రభుత్వాలు భారీగా రాయితీలు అందిస్తున్నాయి. హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుకు మొత్తం రూ.16,000 కోట్లు వెచ్చించారు.  మొత్తం వ్యయంలో రూ.1200 కోట్లు కేంద్రం ఇవ్వగా మిగిలిన 14,800 కోట్లు ఎల్‌అండ్‌టీ పెట్టుబడి పెట్టిందని పేర్కొన్నారు. ఇందులో రూ.3 వేల కోట్లు ఈక్విటీ కాగా రూ.12,000 కోట్లు అప్పుగా స్వీకరించినట్టు వివరించారు.  ప్రపంచంలో 200 మెట్రో ప్రాజెక్టులు ఉన్నాయి. చాలా వరకు మెట్రో ప్రాజెక్టులు లాభాల్లో లేవు. నగరాల్లో మెరుగైన జీవనం కోసం అక్కడి స్థానిక ప్రభుత్వాలు రాయితీ ఇస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనూ మెట్రో ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తుస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌,  టోక్యో, సింగపూర్‌, తైపీ మెట్రోలు లాభసాటి మెట్రోలుగా గుర్తింపు పొందాయి.

మనమే బెటర్‌

మరోవైపు అన్ని కారిడార్లలో సర్వీసులు పెంచి, ఛార్జీల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. మొదటి దశలో భాగంగా చేపట్టిన జేబీఎస్‌-–ఎంజీబీఎస్‌ రూట్ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు ఈజీగా చేరుతుంది. ఎల్‌అండ్‌టీ పరిధిలోని భూముల్లో షాపింగ్‌ మాల్స్‌, ఇతర అవసరాల కోసం వినియోగిండం ద్వారా ప్రపంచంలోని లాభసాటి మెట్రోల్లో ఒకటిగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Latest Updates