ఢిల్లీ మ‌ర్కజ్ కు వెళ్లిన హైద‌రాబాదీకి క‌రోనా.. కుటుంబంలో 46 మంది…

కరోనా వైరస్ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఢిల్లీ మ‌ర్కజ్ లో త‌బ్లిగీ జ‌మాత్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి తిరిగి వ‌చ్చిన వారి క‌రోనా కేసులు ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో ప్ర‌జ‌ల్లో హైటెన్ష‌న్ నెల‌కొంది. హైద‌రాబాద్ సిటీ నుంచి మ‌ర్క‌జ్ కు వెళ్లిన వారిని గుర్తించేందుకు పోలీసులు, హెల్త్ టీమ్స్ ఇంటింటికీ తిరుగుతున్నాయి. ఈ స‌ర్వేలో భాగంగా కింగ్ కోఠి స‌ర‌దా గేట్ ఏరియాలో బ‌య‌ట‌ప‌డిన ఓ కేసు మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన ఓ వ్య‌క్తిని గుర్తించి గాంధీ ఆస్ప‌త్రిలో టెస్టులు చేయ‌గా.. పాజిటివ్ వ‌చ్చింది. అయితే షాకింగ్ విష‌య‌మేమంటే అత‌డిది పెద్ద ఉమ్మడి కుటుంబం. 46 మంది కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఉంటున్నాడ‌త‌ను. వారంరిలో ఎంత‌మందికి వైర‌స్ సోకింది. వారు ఎవ‌రెవ‌రిని క‌లిశార‌న్న దానిపై అధికారులు దృష్టి పెడుతున్నారు.

మార్చి 18న సిటీకి రాక‌…

కింగ్ కోఠి పరదా గెట్ ప్రాంతం నుంచి ఢిల్లీ మ‌ర్క‌జ్ కు వెళ్లి వ‌చ్చిన వారి వివ‌రాలు సేక‌రించేందుకు రంగంలోకి దిగారునారాయ‌ణ గూడ పోలీసులు. ఈ ఏరియా నుంచి ఆరుగురు వ్య‌క్తులు మార్చి 12న విమానంలో ఢిల్లీకి వెళ్లి.. 18న తిరిగి సిటీకి వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ఈ ఆరుగురిని గాంధీ హాస్పిటల్ కు తరలించి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక వ్య‌క్తికి క‌రోనా ఉన్న‌ట్లు ఈ రోజు మ‌ధ్యాహ్నం నిర్ధార‌ణ అయింది. మిగిలిన ఐదుగురి రిజల్ట్స్ రావాల్సి ఉంది.

ఇంట్లోనే వైద్య ప‌రీక్ష‌లు..

పాజిటివ్ వచ్చిన వ్య‌క్తిది పెద్ద ఉమ్మడి కుటుంబం. 46 మంది కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అతడికి కరోనా పాజిటివ్ రావడంతో.. ఈ 46 మంది కుటుంబ సభ్యులకు గాంధీ వైద్యురాలు దీప్తి ప్రియాంక ఆధ్వర్యంలో ఇంట్లోనే వైద్య ప‌రీక్ష‌లు చేస్తున్నారు. వారి శాంపిల్స్ కూడా సేక‌రించి గాంధీ ఆస్ప‌త్రిలో టెస్లు చేస్తామ‌ని వైద్యులు చెబుతున్నారు. వారంద‌రికీ క్వారంటైన్ స్టాంప్ వేసి ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించామ‌ని చెప్పారు జీహెచ్ఎంసీ హెల్త్ ఆఫీస‌ర్ హేమ‌ల‌త తెలిపారు. ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ వ‌స్తే ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తామ‌ని, ఒక వేళ ఎవ‌రికీ పాజిటివ్ రాకున్నా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతామ‌ని చెప్పారు. కాగా, మిగిలిన ఐదుగురి ఇళ్లల్లో కూడా ఒక్కొక్కరి ఇంట్లో 20 మందికి పైగా నివసిస్తున్నార‌ని తెలుస్తోంది.

Latest Updates