భర్తను చావగొట్టి.. దొంగలు చేశారంటూ హైడ్రామా

హైదరాబాద్ : భర్తను రోకలితో కొట్టి, దొంగలు కొట్టారంటూ..రచ్చ చేసింది ఓ వృద్ధురాలు. ఈ సంఘటన సైదాబాద్ లో బుధవారం జరగగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. సైదాబాద్‌ పర్హాకాలనీలో ట్రాన్స్‌కో రిటైర్డ్‌ ఏఈ షరాప్‌ వామనమూర్తి(75). భార్య అనురాధ(65) నివాసముంటున్నారు. వామనమూర్తికి అప్పులు అధికం కావడంతో పర్హాకాలనీలోని ఉంటున్న ఇంటిని 2017లో రూ.60 లక్షలకు అమ్మాడు. ఇల్లు ఖాళీ చేయకపోవడంతో కొనుగోలు చేసిన వారు ఏడాదిన్నర కాలంగా ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.

ఈ క్రమంలో ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడ ఉండాలన్న బాధ, డబ్బుల విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. దీంతో కోపంతో ఆమె రోకలిబండతో భర్త తలపై రెండు సార్లు బలంగా మోదింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇంటి వెనుక బాత్‌రూంలోకి వెళ్లి తలపై నీళ్లు పోసుకుని అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పనిమనిషితో.. ఈ విషయం బయటకు చెప్పొద్దని ఒట్టు పెట్టుకుంది.

తర్వాత పనిమనిషి బయటకు వెళ్లింది. కొద్దిసేపటికి అనురాధ తనకు తాను కత్తితో గాయపర్చుకుని బయటకు పరుగెత్తి పొరుగింటి వారిని పిలిచి.. తమపై దోపిడీ దొంగలు దాడి చేసినట్లు నమ్మబలికింది. చేతులకు గాయాలైన అనురాధను, ఇంటి వెనుక బాత్‌ రూమ్‌లో కుప్పకూలిన వామనమూర్తిని స్థానికులు చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద హస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకుని హస్పిటల్ కి వచ్చిన పోలీసులకు ఈ వృద్ధ దంపతులు భిన్న కథనాలు వల్లించారు. అనుమానం వచ్చిన పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా లోతుగా విశ్లేషించగా వృద్ధ దంపతుల డ్రామా వెలుగులోకి వచ్చింది.

పని మనిషిని గట్టిగా అడగడంతో పూర్తి వివరాలు పోలీసులకు చెప్పింది. భర్త చనిపోతాడేమోనన్న భయంతోనే వృద్ధురాలు అబద్దం చెప్పందని పోలీసులు తెలిపారు. దోపిడీ దొంగల బీభత్సంగా సృష్టించిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అనురాధపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. వృద్ధురాలి భర్త వామనమూర్తి ఆరోగ్యం కుదుటపడ్డాక ఈ ఘటనపై పోలీసులు అతడి వాంగ్మూలం తీసుకోనున్నారు. చిన్న చిన్న విషయాల్లో భార్యాభర్తలు తరచుగా గొడవపడేవారని స్థానికులు చెబుతున్నారు.

Latest Updates