మొబైల్ యాప్ లో వరల్డ్ కప్ బెట్టింగ్

hyderabad-police-arrest-cricket-betting-bach

వరల్డ్ కప్ ను టార్గెట్ చేసిన క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టైంది. అబ్రాడ్ కేంద్రంగా నిర్వహిస్తు్న్న 10 మంది సభ్యులు గల ఇంటర్నేషనల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ముఠాలోని ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ చైతన్య కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సింధికాలనీకు చెందిన భర్కత్ లలానీ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు జూదం,బెట్టింగ్స్ ను నిర్వహించేవాడు. ఫ్రెండ్స్,బంధువులతో బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బు సంపాదించే వాడు. సిటీలో బెట్టింగ్ పై పోలీస్ నిఘా పెరగడంతో ఈ ఏడాది ఐపీఎల్ క్రికెట్ కు ముందు విదేశాలకు పారిపోయాడు. యూఎస్, దుబాయ్ లాంటి దేశాల్లో ఉండి హైదరాబాద్ లోని ఫ్రెండ్స్ ద్వారా బెట్టింగ్ రాకెట్ నడిపాడు. ఇందుకోసం సింధికాలనీకి చెందిన దనిష్ సలీమ్,సొహైల్,సహిల్, సికింద్రాబాద్ పీజీ రోడ్ కి చెందిన జయినిల్ రూపాని(30), కొంపల్లికి చెందిన నజీమ్ గిలాని(30)తో కలిసి బెట్టింగ్ ముఠా ఏర్పాటు చేశాడు.

‘మ్యాచ్ బాక్స్ 9.కామ్’ పేరుతో మొబైల్ యాప్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భర్కత్ ఆదేశాలతో దనిష్ సలీమ్,సొహైల్,సహిల్ గోవా కేంద్రంగా బెట్టింగ్ ఏర్పాట్లు చేశారు. పంటర్లు,బెట్టింగ్ రాయుళ్ళ నుంచి అడ్వాన్స్ గా డబ్బులుసేకరించేవారు. ఆ తర్వాత  ‘మ్యాచ్ బాక్స్ 9.కామ్’ మొబైల్ యాప్ లింక్ ను అందించే వారు. అందుకోసం సికింద్రాబాద్ పీజీ రోడ్ కు చెందిన మోహిత్ జైన్(29), బేగంపేట్ కు చెందిన నిఖార్ మహేశ్వరి(30) సింధికాలనీకి చెందిన రాహుల్ జైన్(28) వైభవ్ సాల్వి(30)లను ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఇలా ఏర్పాటు చేసిన నెట్ వర్క్ ద్వారా బెట్టింగ్ డబ్బులో 3 శాతం కమీషన్ ను భర్కత్ గ్యాంగ్ వీరికి అందించేది.

మొబైల్ యాప్స్ అడ్డాగా సాగుతున్న ఈ ముఠా సమాచారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందింది. ఇన్ స్పెక్టర్ కె.మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై కె.ఎన్ ప్రసాద్ వర్మ, ఎన్.శ్రీశైలం, నరేందర్ టీమ్ రాంగోపాల్ పేట్ లో దాడులు చేసింది. ఈ దాడుల్లో జయినిల్ రూపాని,నజీమ్ గిలాని,మోహిత్ జైన్, నిఖార్ మహేశ్వరి, రాహుల్ జైన్, వైభవ్ సాల్విను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు భర్కత్ లలానీ,దనిష్ సలీమ్,సొహైల్, సహిల్ కోసం గాలిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ చైతన్యకుమార్ తెలిపారు. అరెస్టయిన ఈ ఆరుగురు నిందితుల దగ్గరి నుంచి రూ.8లక్షలు డబ్బు, సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.

Latest Updates