పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతున్న హైదరాబాద్

పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతున్నారు  హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు. లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. EVMలను ఫస్ట్ లెవల్ చెకింగ్ చేస్తున్నారు. గత ఎన్నికల అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామంటున్నారు అధికారులు.

లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లను స్పీడప్ చేశారు హైదరాబాద్ జిల్లా అధికారులు.  జిల్లా పరిధిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ విజయవంతంగా నిర్వహించేందుకు సీపీ అంజనీకుమార్, పోలీసు ఉన్నతాధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ సమావేశమయ్యారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నారు అధికారులు.  అందుకోసం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు.

హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్.. సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమీషనర్లు, ఆర్డీఓలు… సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించారు.  సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముషీరాబాద్, అంబర్ పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మలక్ పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్ పురా, బహదూర్ పుర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందిని రెడీ చేస్తున్న అధికారులు వివిధ కమిటీలను నియమిస్తున్నారు.

ఇక  2019 ఫిబ్రవరి 10నాటికి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 19లక్షల 14వేల 954మంది ఓటర్లు ఉండగా.. 706 భవనాల్లో ఒక వెయ్యి 809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 19లక్షల 32వేల 926మంది ఓటర్లు ఉండగా 770 ప్రాంతాల్లో వెయ్యి 935 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలోని 15అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక వెయ్యి 404సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా చర్యలు చేపడతామన్నారు సీపీ అంజనీ కుమార్. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఏసీపీ స్థాయి అధికారి నోడల్ అధికారిగా ఉంటారు. అంతే కాకుండా క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వారందర్ని బైండోవర్ చేస్తామన్నారు. ఎలక్షన్ రిలేటెడ్ కేసులను పూర్తిస్థాయిలో పరిశీలిస్తాన్నారు. ఇక ఇప్పటికే ఓటర్ జాబితా ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. దీంతో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Latest Updates