కరోనా దెబ్బకు ఖాళీగా హైదరాబాద్ రోడ్లు

కరోనా కట్టుబాట్లతో ఎక్కడోళ్లు అక్కడ్నే..

ఆదివారమే అయినా జనాలు ఇండ్ల నుంచి కదల్లే

హైదరాబాద్​సహా ఇతర నగరాలు, పట్టణాల్లోనూ

యధావిధిగా నడిచిన కొన్ని సినిమా హాళ్లు

ముందస్తు బుకింగ్స్​​కారణమన్న మేనేజ్​మెంట్లు

ఎక్కువ మంది ఇంటి సరుకులు కొనుక్కునే పనిలో బిజీ

పెరిగిన మాస్కుల వినియోగం.. హైదరాబాద్​లో తగ్గిన రద్దీ

కరోనా నివారణ చర్యలతో మొదలైన ప్రభావం

హైదరాబాద్, వెలుగు: కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు చాలా వరకు తొలిరోజు నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్​తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో కరోనా నివారణ చర్యల ప్రభావం కనిపించింది. సాధారణంగా ఆదివారం రోజున సరదాగా బయటికి వచ్చే జనం సంఖ్య తగ్గిపోయింది. చాలా మంది ఇండ్లలోనే ఉండిపోయారు. బయటికి వచ్చివారిలోనూ ఎక్కువ మంది సరుకులు కొనుక్కోవడానికి, ఇతర అవసరమైన పనులపైనే ఉన్నారు. వీలైనంత త్వరగా ఇండ్లకు వెళ్లిపోవడం కనిపించింది. చాలా చోట్ల చిన్న పిల్లలను బయటికి తీసుకురాలేదు. గత వారంతో పోల్చితే ఈ ఆదివారం హైదరాబాద్​లో ట్రాఫిక్​ బాగా తగ్గింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ ప్రాంతం, కొన్ని రూట్లలో తప్ప ఎక్కడా పెద్దగా రద్దీ కనిపించలేదు. ఎక్కువ మంది ఉన్న ప్రదేశాలకు వెళ్లొద్దనే ఉద్దేశంతో ఆదివారం పూట సామాన్లు కొనే పనిలో నిమగ్నమైనట్టు తార్నాకకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్​తెలిపారు.

స్కూళ్లు, కాలేజీలు బంద్

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. చాలా చోట్ల సినిమా హాళ్లు నడిచాయి. ముందస్తు బుకింగ్​ల కారణంగా నడిపామని, సోమవారం నుంచి పూర్తిగా మూసేస్తామని వాటి మేనేజ్​మెంట్లు తెలిపాయి. ‘‘కరోనా నివారణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయి. ఎక్కువ మంది గుమిగూడకుండా ఉంటే వైరస్ వ్యాప్తి అరికట్టొచ్చు. సెలవు రోజున ఎక్కడికీ వెళ్లలేకపోవడం ఇబ్బందిగానే ఉంది. అయితే ఏదైనా మన మంచికే కదా’’ అని గచ్చిబౌలిలోని సాఫ్ట్ వేర్​ ఇంజనీర్​పి.కిరణ్​కమార్​ అన్నారు. తొలిరోజు ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల అమలుపై పూర్తి స్పష్టత రాలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు.

పెరిగిన మాస్కుల వినియోగం

వారం పదిరోజులుగా కరోనా ప్రభావంపై రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతోంది. మొదటి కరోనా కేసు నమోదయ్యాక ఒకట్రెండు రోజులు హైదరాబాద్​లో చాలా మంది మాస్కులు ధరించడం కనిపించింది. మాస్కులకు డిమాండ్​ పెరగడంతో ధరలను అమాంతం పెంచారు. తర్వాత వైరస్​ ప్రభావం పెద్దగా లేదనే ప్రచారంతో మాస్కులను ధరించడం తగ్గింది. మళ్లీ రెండు రోజులుగా మా స్కులు ధరించే పరిస్థితి వచ్చింది. ఆదివారం ఇండ్ల నుంచి తక్కువ మందే బయటికి వచ్చినా.. వారిలో చాలా వరకు మాస్కులు ధరించడం కనిపించింది.

అంటు వ్యాధుల నివారణ చట్టం కింద..

కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తల కోసం సీఎం కేసీఆర్​ ప్రకటించిన అంశాలను అమలు చేసేలా ప్రభుత్వ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. విద్యా సంస్థలకు సెలవు, సినిమా హాళ్ల బంద్​ తదితర నిర్ణయాలను అమలు చేస్తూ చీఫ్​సెక్రెటరీ సోమేశ్​కుమార్​ఆదేశాలు జారీ చేశారు. ‘‘అన్ని రకాల విద్య సంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ఇవ్వాలి. ఇంటర్, టెన్త్, ఇతర అడ్మిషన్​ టెస్టులు యధావిధిగా జరుగుతాయి. ఆ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం హాస్టళ్లు, రెసిడెన్షియల్​స్కూళ్లు పనిచేస్తాయి. ఈ నెల 21 వరకు సినిమా హాళ్లు, పార్కులు, స్విమ్మింగ్​ పూల్స్, జిమ్ లు, జూ పార్కులు, మ్యూజియంలు మూసి వేయాలి. ఇప్పటికే ముహూర్తం ఖరారైన పెళ్లిళ్లు మినహా ఇతర కార్యక్రమాలేవీ పెట్టుకోకూడదు. ఈ నెల 31 వరకు జరిగే పెండ్లిళ్లకు కూడా 200 కంటే ఎక్కువ మంది రాకుండా చూసుకుంటే మంచిది. 31వ తేదీ తర్వాత నిర్వహించే ఏ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఫంక్షన్​ హాళ్లు కొత్త బుకింగ్​లు తీసుకోవద్దు. ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేష్లన్లలో, మెట్రో స్టేషన్లలో గతంలో కంటే ఎక్కువ పరిశుభ్రత ఉండేలా ఆయా శాఖలతో పని చేయించాలి. పబ్లిక్​ మీటింగ్ లు, సమ్మర్​ క్యాంపులు వంటి ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడే ప్రొగ్రామ్​లకు ఈ నెల 21 వరకు పర్మిషన్​ ఇవ్వొద్దు. అన్ని రకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మెంబర్​షిప్​క్లబ్​లు, బార్లు, పబ్​లు కూడా ఇదే తేదీ వరకు మూసివేయాలి’’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. విపత్తుల నిర్వహణ, అంటు వ్యాధుల నివారణ చట్టాల ప్రకారం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు హెల్త్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ శాఖల ప్రిన్సిపల్​సెక్రటరీలకు, డీజీపీకి, అన్ని జిల్లాల కలెక్టర్లకు, పోలీసు కమిషనర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

బార్లు, పర్మిట్​ రూములు బంద్

రాష్ట్రవ్యాప్తంగా క్లబ్బులు, పబ్బులు, బార్లు, టూరిజం బార్లు, ఏ4 లిక్కర్​ షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్​రూం లను ఈ నెల 21 వరకు మూసివేయాలని ఆదేశిస్తూ సీఎస్​ మరో ఉత్తర్వు జారీ చేశారు. రాష్ట్ర ఎక్సైజ్​చట్టం‌‌లోని 72వ నిబంధన ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

For More News..

మహిళలకు బ్యాడ్‌న్యూస్.. అభయ హస్తం రద్దు

త్వరలో మిషన్ హైదరాబాద్

మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

గుడ్‌న్యూస్.. కరోనా టెస్టులు ఫ్రీ

కట్నం కోసం కరోనా వేధింపులు

Latest Updates