కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం: రెండు నెలల్లోనే దెబ్బతింటున్న రోడ్లు

hyderabad-roads-damaged-with-single-rain

రోడ్ల నిర్మాణం కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం అయిపోయింది. డబ్బులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రోడ్డు పనులు తూతూమంత్రంగా పూర్తి చేసి మమ అనిపించుకుంటున్నారు. అయినా బల్దియా అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోడ్లు వేసిన 2, 3 నెలలకే దెబ్బతింటున్నాయి. కానీ దెబ్బతిన్న రోడ్లకు కాంట్రాక్టర్లు మరమ్మతులు చేయాల్సి ఉన్నా అధికారులు నిమ్మకుండిపోతున్నారు. మరమ్మతులు ఖర్చులు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయాల్సిన జీహెచ్‌‌ఎంసీ మెతక వైఖరి అవలంభిస్తోంది. రోడ్లు దెబ్బతిన్నడంతో వాటి మరమ్మతుల కోసం జీహెచ్​ఎంసీ కోట్లు ఖర్చు చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది.

దెబ్బతిన్న రోడ్లు

సిటీలో ఇటీవల కురిసిన వ‌‌ర్షాలతో ర‌‌హ‌‌దారుల‌‌పై 5 వేల గుంత‌‌లు ఏర్పడగా 987 ర‌‌హ‌‌దారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ గుంత‌‌ల‌‌ను పూడ్చడంతో పాటు దెబ్బతిన్న మార్గాల‌‌ను వెంట‌‌నే పున‌‌రుద్ధరించేందుకు జీహెచ్‌‌ఎంసీ రూ.44 కోట్లు మంజూరు చేసింది. వీటితో 221 పనులను చేపట్టారు. వీటిలో 170 పనులు పురోగతిలో ఉండగా మిగిలినవి టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. అయితే నాణ్యతాలోపం కారణంగా దెబ్బతిన్న రోడ్లకు సదరు కాంట్రాక్టరే రిపేర్లు చేయాల్సి ఉంది. కానీ బల్దియా మెతక వైఖరి కారణంగా కాంట్రాక్టర్లు మిన్నకుంటున్నారు. దీంతో మరమ్మతుల కోసం బల్దియాపై అదనంగా రూ.44 కోట్ల అదనపు భారం పడుతోంది. కాంట్రాక్టర్లపై జరిమానా విధించాల్సింది పోయి, సొంత డబ్బు వెచ్చించడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి.

తడిసి మోపడవుతున్న ఖర్చు

పీపీఎం ప్రాజెక్టుల్లో భాగంగా సిటీలో నిర్మించిన 600 కిలోమీట‌‌ర్ల రోడ్డు మార్గాల్లో పునరుద్ధర‌‌ణ ప‌‌నులను సంబంధిత కాంట్రాక్టర్లే నిర్వహించాలి. ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్లతో ప్రత్యేక స‌‌మావేశం నిర్వహించాలని జీహెచ్‌‌ఎంసీ భావించింది. కానీ బల్దియా కాంట్రాక్టర్లతో కఠినంగా వ్యవహరించకుండా తానే ఆ భారం మోస్తోంది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ.44 కోట్లు కేటాయించింది. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంలో బల్దియా నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ వ్యవహారంపై బల్దియా అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూన్నాళ్లకే దెబ్బతిన్న రోడ్ల విషయంలో సదరు కాంట్రాక్టర్లతో మాట్లాడాలని జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ దానకిశోర్‌‌ ఆదేశించినా అధికారులు ఆ వైపుగా చర్యలు తీసుకోవడం లేదు.

ఆలస్యమవుతుందని..
నిర్ణీత సమయంలో రోడ్డు చెడిపోతే కాంట్రాక్టరే మరమ్మతులు చేపట్టాలి. ఈ ప్రక్రియ అంతా ఆలస్యం అవుతుంది. అందుకే బల్దియా యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేపట్టిందని ఓ అధికారి తెలిపారు. ఈ మొత్తం నుంచి కూడా కట్‌‌ చేసుకోవచ్చని వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌‌ఎంసీ పనులు చేపట్టిందన్నారు. కాంట్రాక్టు మొత్తంలో 2 శాతం జీహెచ్‌‌ఎంసీ వద్ద డిపాజిట్‌‌గా ఉంటుంది కాబట్టి అందులోంచి కట్‌‌ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ కాంట్రాక్టర్లు చక్రం తిప్పితే జరిమానా నుంచి తప్పించుకునే అవకాశముందని తెలుస్తోంది.

Latest Updates