ప్రమాదం తప్పింది : రన్నింగ్ లో ఊడిన RTC బస్సు చక్రం

హైదరాబాద్ : రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయి. గమనించకుండానే డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. భయంతో ప్రయాణికులు కేకేలు వేశారు. అటుగా వెళుతున్న వారు అప్రమత్తం చేయడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. దీంతో పెద్ద  ప్రమాదం తప్పింది. హైదరాబాద్ మూసాపేట బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ప్రయాణికులకు నరకం చూపించింది.

సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు  లింగంపల్లి నుంచి 49 మంది ప్రయాణికులతో విజయవాడ వెళుతోంది. మూసాపేట వద్దకు రాగానే బస్సు వెనక చక్రాలకు ఉన్న బోల్టులు ఒక్కొక్కటిగా ఊడిపోయాయి. బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. దీంతో ప్రయాణికులు ఏం జరిగిందో తెలియక భయంతో వణికిపోయారు. బస్సును ఆపాలంటూ పెద్ద, పెద్దగా అరిచారు.

అయినా కొద్ది దూరం అలాగే వెళ్లారు డ్రైవర్. అటుగా వెళుతున్న ప్రజలు.. మనించి డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో… మూసాపేట బ్రిడ్జిపై బస్సును ఆపాడు. బస్సు దిగిన ప్రయాణికులు రోడ్డుపైనే ఉండిపోయారు. చాలాసేపటి తర్వాత మరో బస్సును తీసుకొచ్చి ప్రయాణికులను విజయవాడ తీసుకెళ్లారు. ఫిట్ నెస్ లేని బస్సును నడపడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. టైర్లు ఊడిపోయిన విషయం గమనించిన వెంటనే బస్సును ఆపి వేశామని  డ్రైవర్ చెప్పారు.

 

Latest Updates