‘అధికారుల నిర్లక్ష్యం వ‌ల్లే నా కూతురు చ‌నిపోయింది’

హైద‌రాబాద్: అధికారుల నిర్లక్ష్యం తోనే త‌న కూతురు ప్రాణాలు పోగొట్టుకుందని, అధికారులు సత్వరమే స్పందించి వుంటే సుమేధ బతికి వుండేదని ఆ చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సుమేధ బండ చెరువులో శవమై తేలింది. నాలాలో పడిపోయిన ఆ చిన్నారి.. నీళ్ల‌లో కొట్టుకొని పోయి ప్రాణాలు కోల్పోయింది.దీనిపై చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. తోటి పిల్లలతో త‌మ‌ కూతురు ఆడుకోవడానికి బయట కు వెళ్ళిందని, అలా వెళ్లిన పాప శ‌వ‌మై తిరిగివ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వర్షాకాలం ప్రతీ సారి త‌మ‌ కాలనీలో నాళాలు పొంగి పొర్లుతాయని అన్నారు. 14 ఏళ్లుగా ఇక్కడే నివాసం వుంటున్నామని.. అప్పుడెలా వుందో, ఇప్పుడు అదే పరిస్ధితని ఆయ‌న చెప్పారు. త‌మ‌ పాప ను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నామ‌ని, నీళ్లలో పడి ఆ చిన్నారి ఎంత నరకం అనుభవించిందో అని త‌ల్ల‌డిల్లి పోయారు. అధికారుల్లో మార్పు రావాల్సిన అవసరం వుందని, త‌మ కుటుంబంలో జరిగిన విషాదం మరో కుటుంబంలో జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Latest Updates