
- దేశంలోనే అతిపెద్ద డిజిటల్ఫెస్ట్కు హైదరాబాద్ రెడీ
- మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ‘ఇండియా జాయ్’ ఈసారి కూడా హైదరాబాద్‌లోనే జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నది. ప్రముఖ మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలూ భాగస్వాములుగా పాల్గొనే ‘ఇండియా జాయ్-2019’ ఎక్స్పో ఈనెల 20 నుంచి 23 వరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ మత్రి కేటీఆర్ తెలిపారు. ఇండియా జాయ్ ప్రతినిధులు సోమవారం మంత్రి కేటీఆర్‌ను ఆయన ఆఫీసులో కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీడియా, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాలకు హైదరాబాద్‌ను హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో భాగంగా సిటీలో ‘ఇమేజ్ టవర్’ను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇండియా జాయ్ ఫెస్ట్‌కు 50 దేశాల నుంచి ప్రముఖ కంపెనీలకు చెందిన వెయ్యిమందికిపైగా డెలిగేట్లు హాజరుకానున్నారని, 30 వేల మందికిపైగా సందర్శకులు పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనువైన అవకాశాలను ఆయా ప్రతినిధులకు వివరిస్తానని కేటీఆర్ చెప్పారు. . మీడియా, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి అవసరమైన మానవ వనరులన్నీ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలకు, చోటా భీమ్ లాంటి కార్టూన్ సిరీస్‌కు హైదరాబాద్‌లోనే రూపకల్పన జరిగిందని గుర్తుచేశారు. ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవాళ్లకు ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తామన్నారు.
హైదరాబాద్‌లో ఉన్న టాలెంట్‌ను ప్రదర్శించడానికి ఇండియాజాయ్ చక్కటి వేదిక అని, ఇందులో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్, దేశీ టూన్స్, విఎఫ్ఎక్స్ సదస్సు సహా 10 రకాల ఈవెంట్లు జరుగుతాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన ఇండియాజాయ్-2018లో 30 దేశాల నుంచి దాదాపు 500 మంది డెలిగేట్లు హాజరుకాగా, ఈసారి రెట్టింపు సంఖ్యలో వస్తుండటం గమనార్హం.