దొంగను పట్టించిన వాట్సాప్ స్టేటస్‌

హైదరాబాద్: నేటి రోజుల్లో ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ల అభిరుచులు, ఇష్టాఇష్టాలు ఏంటనే  విషయాలు సోషల్ మీడియా ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. పొద్దున లేచినప్పటి నుంచి జరిగే విషయాలను చాలా మంది వాట్సాప్, ఫేస్‌‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ వాట్సాప్ స్టేటస్ ఒక దొంగను పట్టించింది. 15 నెలల కిందట చోరీ అయిన ఆభరణాల కేసులో దొంగ వాట్సాప్ స్టేటస్‌‌‌తో దొరికాడు. వివరాలు.. గతేడాది జూలై 12న హైదరాబాద్, సాయిపురి కాలనీలోని అంగిడి రవికిరణ్ ఇంట్లో చోరీ జరిగింది. తన ఇంట్లో బంగారు ఆభరణాలను పోయాయంటూ రవి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా నిందితులు, ఆభరణాలు దొరకలేదు. కానీ రవి కిరణ్ ఇంట్లో చోరీ అయిన నగలను అతడి బంధువుల్లో ఓ మహిళ ధరించి తాజాగా వాట్సాప్‌‌ స్టేటస్‌‌ పెట్టింది. వాట్సాప్‌‌లో ఈ ఫొటోలను చూసిన రవి కిరణ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రవి కిరణ్ బంధువుల అబ్బాయి పొన్నుగోటి జితేందర్ నగలను దొంగిలించాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు జితేందర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates