త‌ల్లీకొడుకు క‌లిసి.. పెళ్లి పేరుతో యువ‌కుడికి వ‌ల‌.. రూ.65 ల‌క్ష‌లు నొక్కేసి..

ఇండియ‌న్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌నుకునే NRI యువ‌కులే టార్గెట్ ఆమె టార్గెట్.. 44 ఏళ్ల వ‌య‌సు ఉన్న ఆమె న‌కిలీ పేరుతో.. ప‌డుచు పిల్ల‌నంటూ వ‌ల వేస్తుంది. తానో రిచ్ ఫ్యామిలీలో ఒక్క‌గానొక్క అమ్మాయిన‌ని మాయ‌మాట‌లు చెబుతుంది. తండ్రి చ‌నిపోయాడ‌ని.. త‌న పేరున ఉన్న ఆస్తి కోసం త‌ల్లి వేధిస్తోందంటూ ఓ దీన‌గాథ చెప్పి అవ‌త‌లి కుర్రాడిని ఎమోష‌న‌ల్ గా బుట్ట‌లో వేసుకుంటుంది. ఆస్తుల్ని నిలుపుకొని నిన్ను పెళ్లి చేసుకుంటే అంతా నీదే అంటూ ఆశ చూపుతుంది. కోర్టులో లీగ‌ల్ గా పోరాడి కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను కాపాడుకోవ‌డానికి డ‌బ్బు పంప‌మ‌ని అడుగుతుంది. డ‌బ్బు ట్రాన్స్ ఫ‌ర్ అయిందా.. అంతే సంగ‌తులు.. ఇక రెస్పాన్స్ ఉండ‌దు. ఈ మొత్తం మోసానికి మ్యాట్రిమోనీ వెబ్ సైట్లే వేదిక‌. ఆ కిలాడీ లేడీకి ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఈ ఘ‌రానా మోసానికి ఆమె కొడుకు (22 ఏళ్లు) ఆన్ లైన్ లో వ్య‌వ‌హార‌మంతా న‌డిపిన ఘ‌ట‌న హైద‌రాబాద్ లో జ‌రిగింది. అమెరికాలో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ద‌గ్గ‌ర రూ.65 ల‌క్ష‌లు కొట్టేసిన త‌ల్లీకొడుకుల్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

గ‌తంలోనూ ఫ్యామిలీ అంతా ఇదే ప‌ని

హైద‌రాబాద్ కు చెందిన మాళ‌విక(44), ఆమె భ‌ర్త శ్రీనివాస్, కొడుకు ప్ర‌ణ‌వ్ (22) క‌ల‌సి ఎన్నారైలు టార్గెట్ గా పెట్టుకుని మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. మాళ‌విక అనే మ‌హిళ త‌న పేరును కీర్తి మాధ‌వ‌నేని అని మార్చుకుని కొడుకు సాయంతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అమెరికాలో సాఫ్ట్ వేర్ గా ప‌నిచేస్తున్న వ‌రుణ్ అనే యువ‌కుడి నుంచి రూ.65 ల‌క్ష‌లు నొక్కేసింద‌ని చెప్పారు. ఆమె తన‌ను బాగా డ‌బ్బున్న ఫ్యామిలీకి చెందిన‌ డాక్ట‌ర్ గా ప‌రిచ‌యం చేసుకుంద‌ని, తండ్రి మ‌ర‌ణించ‌డ‌తంతో త‌న పేరున ఉన్న ఆస్తుల కోసం త‌ల్లి వేధిస్తోంద‌ని, వాటిని నిలిబెట్టుకోవ‌డం కోసం లీగ‌ల్ ఫైట్ కోసం డ‌బ్బు పంపాల‌ని కోరింద‌ని అన్నారు. ఆమె మాట‌ల్ని న‌మ్మిన వ‌రుణ్ రూ.65 ల‌క్ష‌లు చెప్పిన బ్యాంక్ అకౌంట్ల‌కు ట్రాన్స్ ఫ‌ర్ చేశాడ‌ని, అయితే ఆ త‌ర్వాత ఆమెను పెళ్లి గురించి అడిగితే స్పంద‌న లేక‌పోవ‌డంతో వ‌రుణ్ సైబ‌ర్ సెల్స్ కు ఫిర్యాదు చేశాడ‌ని చెప్పారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసును ఛేదించి మాళ‌విక‌ను, ఆమె కొడుకు ప్ర‌ణ‌వ్ ను బుధ‌వారం అరెస్టు చేశామ‌ని, ఆమె భ‌ర్త మాత్రం ప‌రారీలో ఉన్నాడ‌ని చెప్పారు. ఇవాళ కోర్టులో ప్ర‌వేశ పెట్ట‌గా, రిమాండ్ విధించిన‌ట్లు తెలిపారు. అయితే గ‌తంలోనూ ఈ ఫ్యామిలీపై న‌ల్ల‌కుంట స్టేష‌న్ లో ఇలాంటి కేసు ఉన్న‌ట్లు పోలీసులు చెప్పారు. 2014లో అమెరికాలో ఉంటున్న ఓ ఎన్నారైని ఇలానే గీతాంజ‌లి అనే పేరుతో మోసం చేసింద‌ని, అప్పుడు ఆమె అత్త కూడా స‌హ‌క‌రించింద‌ని తెలిపారు.

Latest Updates