
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే అమ్మాయిలా మారారు. తన పేరును సైషాగా మార్చుకొన్నారు. ఇన్నాళ్లు పురుషుడిగా ఉన్న తను ఎలా అమ్మాయిగా మారాడో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తనలోని హార్మోన్ల లోపం వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని సైషా పేర్కొన్నారు. స్కూల్, కాలేజీ రోజుల్లో తోటి విద్యార్థులు తనను మానసికంగా హింసించేవారని, తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయేదాన్నని చెప్పారు. ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి, గందరగోళానికి లోనయ్యానని ఆమె అన్నారు. తాను మిగతా వారి కంటే భిన్నమని తెలుసని, కానీ సామాజిక పరిస్థితులు, పద్ధతుల వల్ల ఆ సమయంలో బయటకు చెప్పుకోలేక పోయానని అన్నారు.
20 ఏండ్ల వయస్సులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో చేరాక నిజాన్ని జీర్ణించుకోవడం మొదలు పెట్టానని తెలిపారు. ‘నేను పురుషుల పట్ల ఆకర్షితురాలినయ్యేదాన్ని. అప్పుడు నేను ‘గే’ అనుకొన్నాను. కానీ నేను మహిళను అని ఆరేండ్ల క్రితమే నాకు స్పష్టత వచ్చింది’ అని చెప్పారు. సైషా అంటే అర్థవంతమైన జీవితం అని పేర్కొన్నారు. స్వప్నిల్ షిండే.. కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా జోనాస్, అనుష్క శర్మ, మాధురి దీక్షిత్, సన్నీ లియోన్, తారా సుతారియా, తాప్సీ పన్నూ వంటి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ లకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేశారు.