“ నేను దూబేను..కాన్పూర్‌‌ వాలాను” అంటూ పోలీసులపై కేకలు

ఉజ్జయిని: 60 కేసుల్లో నిందితుడైన వికాస్‌ దుబేను పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయం బయట అరెస్టు చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా.. వికాస్‌ దూబే పెద్ద పెద్దగా కేకలు వేశాడు. “ నేను వికాస్‌ దూబేను.. కాన్పూర్‌‌ వాలాను” అంటూ పోలీసుల ముందు అరిచాడు. వికాస్‌ను పోలీసులు కారులోకి ఎక్కిస్తుండగా అతడు కేకలు వేసిన వీడియోలు బయటికి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో దగ్గర ఒక షాప్‌లో పూజ సామ్రాగ్రి కొన్న దూబేను ఆ షాప్‌ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. వారం రోజుల పాటు 40 టీమ్‌లు దూబే కోసం గాలించాయి.

యూపీ పోలీసులకు అప్పగిస్తాం: శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

వికాస్‌ దూబే అరెస్టుపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ఉజ్జయిని మహంకాళీ అతడిని కాపాడుతుందని అనుకోవడం భ్రమ అని, అలా ఎప్పుడూ జరగదని అన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌, యూపీ పోలీసులను చౌహాన్‌ మెచ్చుకున్నారు. “ దుబేను అరెస్టు చేసిన ఎంపీ పోలీసులను అభినందిస్తున్నాను. యూపీ పోలీసులతో కాంటాక్ట్‌లో ఉన్నాం. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కూడా మాట్లాడాను. ఫార్మాలిటీస్‌ పూర్తైన తర్వాత దూబేను యూపీ పోలీసులకు హ్యాండోవర్‌‌ చేస్తాం” అని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. ఉజ్జయిని.. దూబేఅత్తగారి ఊరు అని, ఏటా మహంకాళి దర్శనానికి వెళ్తాడని దూబే తల్లి సరలా దేవి అన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోవాలని ఆమె అన్నారు.

Latest Updates