ఉద్ధవ్ కు పరీక్షలు అయిపోలే!

తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాననుకోలేదని స్వయంగా ఉద్ధవ్​ థాక్రేనే అన్నారు. రాష్ట్ర రాజకీయం నెల రోజుల్లోనే ఇన్ని మలుపులు తిరుగుతుందని బహుశా అక్కడి ప్రజలు కూడా ఊహించి ఉండరు. వచ్చే ఐదేళ్ల​లో ఇలాంటి నాటకీయ పరిణామాలు లెక్కలేనన్ని చోటుచేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఫ్లోర్​ టెస్ట్​ పాసైన శివసేనాని.. మహాసేనాని పాత్రలో మరెన్నో పరీక్షలు సక్సెస్​ కావాల్సి ఉంది. సంకీర్ణ సర్కారును నడపటంలో ఆయనకు సవాలక్ష సవాళ్లు ఎదురుకానున్నాయి

మహారాష్ట్రలో నెల రోజులకుపైగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన పాలిటిక్స్​ అసెంబ్లీలో బల పరీక్ష తర్వాత కాస్త కుదురుకున్నట్లు కనిపిస్తున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​లతో కూడిన అలయెన్స్​ గవర్నమెంట్​ ఐదేళ్లలో అమలుచేసే కామన్​ మినిమం ప్రోగ్రామ్(సీఎంపీ)​ని ఉద్ధవ్​ థాక్రే ప్రమాణానికి ముందే ప్రకటించాయి. ఇక ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలి. ఈ క్రమంలో ముందుగా పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి. మంత్రి పదవుల పంపకంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి అదీ పెద్ద కష్టం కాకపోవచ్చు.

డైరెక్ట్​ సీఎం

మంత్రిగా కాదు కదా. కనీసం ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగానైనా ఒక్కసారి కూడా అసెంబ్లీలో  లేదా కౌన్సిల్ లో అడుగు పెట్టని శివసేన పార్టీ చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే డైరెక్ట్​గా చీఫ్​ మినిస్టరే అయ్యారు. ఆయనకు కూటమి రాజకీయాల గురించి బాగానే అవగాహన ఉన్నా  పాలనపరంగా అనుభవం మాత్రం అస్సల్లేదు. పైగా స్టేట్​ అడ్మినిస్ట్రేషన్​లోని ఎక్కువ మంది ఆఫీసర్లకు బీజేపీతో లేదా ఎన్​సీపీతో సంబంధాలు ఉన్నాయి. అందువల్ల గవర్నమెంట్​ని నడపటంలో గైడెన్స్​ కోసం బ్యూరోక్రసీలో తనకంటూ సొంత టీమ్​ని ఏర్పాటుచేసుకోవాలి.

ఇన్నాళ్లూ ఒక్క శివసేన పార్టీకే సుప్రీం లీడర్​గా ఉన్న ఉద్ధవ్​ థాక్రే ఇకపై సీఎంగా ‘మహారాష్ట్ర వికాస్​ అగాధీ’ కొయిలేషన్​లోని మిగతా రెండు పార్టీలకు కూడా పెద్ద మనిషిలా వ్యవహరిస్తూ వాటిని ఏకతాటిపై ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో పొలిటికల్​ పార్టీ పనితీరు ఒక్కోలా ఉంటుంది. వాటికంటూ కొన్ని ప్రయారిటీలు ఉంటాయి. ఆ అంశాలన్నింటినీ మనసులో పెట్టుకొని కేబినెట్​ కొలీగ్స్​ని కో ఆర్డినేట్​ చేసుకోవాలి. మెత్త టి  మనిషిగా ముద్ర పడ్డ ఉద్ధవ్​ థాక్రేకి ఆ స్వభావమే ఒకింత ప్లస్​, మరింత మైనస్ కానుంది.

అప్పులు.. తిప్పలు

ముఖ్యమంత్రిగా ఉద్ధవ్​ థాక్రే ముందుగా అమలుచేయాల్సిన హామీ రైతులకు రుణమాఫీ. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో దీనికోసం దాదాపు రూ.24 వేల కోట్లను బ్యాంకులకు విడుదల చేసింది. కానీ ఈ ప్రామిస్​ మీద పూర్తి స్థాయిలో నిలబడాలంటే ఇంకా సుమారు రూ.30 వేల కోట్లు కావాలని అంచనా వేశారు. ఖజానా పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తున్న నేపథ్యంలో ఇన్ని నిధులు సేకరించటం అంత తేలిక్కాదు. ఇప్పటికే మహారాష్ట్ర అప్పులు రూ.4.15 లక్షల కోట్లకు చేరాయి. అందువల్ల మళ్లీ లోన్లు తీసుకోవాలంటే సాహసం చేయకతప్పదు.

గడచిన ఐదేళ్లలో రెవెన్యూ, ట్యాక్స్​ వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక పరిస్థితి కటకటగా తయారైంది. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టుల కోసం చాలా వరకు విదేశాల నుంచే అప్పులు తెచ్చారు. మరోసారి రుణాల బాటపడితే వాటికి కట్టాల్సిన వడ్డీలు తడిసి మోపడవుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ముంబైలో పలు ఇన్​ఫ్రా ప్రాజెక్టుల పనులు (ముఖ్యంగా ఆరు మెట్రో కారిడార్లు) నడుస్తున్నాయి. వాటిని కొనసాగించకపోతే అర్బన్​ ఏరియాల్లో పట్టున్న శివసేన పార్టీ ఫ్యూచర్​లో ఆ మేరకు నష్టపోతుంది.

జాబుల విషయంలో గిమ్మక్కులు కుదరవ్!

రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం కూటమిలోని మూడు పార్టీలకూ కీలకమైన సవాలే. పారిశ్రామిక రంగంలోని 80 శాతం ఉద్యోగాలను లోకల్​ పీపుల్​కి రిజర్వ్​ చేస్తామని, దీనికోసం చట్టం చేస్తామని సీఎంపీలో ప్రస్తావించారు. ఈ విషయంలో గిమ్మిక్కులు చేస్తామంటే కుదరదు. చెప్పిన మాటకు కట్టుబడి కొలువులు ఇస్తే సరేసరి. లేకపోతే యూత్​ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. ఈ హామీని నెరవేర్చకపోతే పార్టీల ఫ్యూచర్​ని పణంగా పెట్టినట్లేనని పొలిటికల్​ ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ ఐడియాలజీలు వేరైనా ఒక ప్లాట్​ఫాం మీదికి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రెండు పార్టీల కూటమి సర్కారును ఏర్పాటుచేస్తేనే రెండేళ్లు కూడా నిండక ముందే కుప్పకూలుతున్న రోజులివి. అలాంటిది ఏకంగా మూడు రాజకీయ పక్షాలు కామన్​ మినిమం ప్రోగ్రామ్​ (సీఎంపీ) ఆధారంగా ముందడుగు వేశాయి. పార్టీల ఆలోచనలు వేరైనా ప్రభుత్వంలో భాగంగా చేయాల్సిన పని ఒకటేననే ఉద్దేశంతో సీఎంపీని ‘వర్కింగ్​ సొల్యూషన్’గా చెబుతున్నాయి. ఇది ఎంతవరకు వర్కౌట్​ అవుతుందో చూడాలి.

స్టేట్​ కేబినెట్​లో కో ఆర్డినేషన్​ కోసం రెండు కమిటీలు వేయాలని సంకీర్ణంలోని మూడు పార్టీలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. సీఎంపీలో సెక్యులర్ అనే అంశం​పై హామీ ఇవ్వటానికి ఈ పార్టీలు మొదట కాస్త ముందూవెనకా ఆడినా చివరికి ఒక మాట మీదికి వచ్చాయి. రానున్న ఐదేళ్లలో ఇలా తెరపైకి వచ్చే ఛాన్స్​ ఉన్న కొత్త సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించటంలో కో ఆర్డినేషన్​ కమిటీలు సక్సెస్​ అయితే ఉద్ధవ్​ థాక్రే ప్రభుత్వం ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తుంది. లేకపోతే రాజకీయం మళ్లీ మొదటికి వస్తుంది.

Latest Updates