స్త్రీలపై ఎలాంటి హింసను సహించను: మమతా

కోల్‌కతా: మహిళలపై జరిగే ఎలాంటి హింసను తాను సహించబోనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. గురువారం మాల్దా జిల్లాలో  గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిని కాల్చి చంపిన ఘటనపై మాట్లాడుతూ…  నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, వారిపై 3 నుంచి 10 రోజుల్లో చార్జిషీట్ వేయాలని పోలీసులకు ఆమె సూచించారు.

మాల్డా జిల్లాలోని ఓ మామిడి తోటలో యువతిని దారుణంగా హత్య చేసిన ఘటనలో పోస్టుమార్టం రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నామన్నారు. యువతి అత్యాచారం చేసి, కాల్చి చంపి ఉంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని ఆమె చెప్పారు.

హైదరాబాద్ లోని శంషాబాద్ లో జరిగిన దిశ కేసు మాదిరిగానే మాల్దా జిల్లాలో ఓ 20 ఏళ్ల యువతిపై రేప్ చేసి కాల్చి చంపినట్టు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంగ్లీష్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్వాలి గ్రామ పంచాయతీ తిపజని ప్రాంతంలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. మహిళపై అత్యాచారం చేసి దహనం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అలోక్ రాజోరియా, డీఎస్పీ ప్రశాంత్ దేవ్‌నాథ్ సహా ఇద్దరు జిల్లా అధికారులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు.

Latest Updates