ఆ హీరోను మిస్ చేసుకున్నా…

హీరోలంటే ఆకాశం నుండి ఊడిపడరు. వాళ్లు కూడా సాధారణ మనుషులే.. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లోనే హీరోల క్యారెక్టర్స్, మనం చూసే హ్యూమన్ ఎమోషన్స్ లోనే సినిమా కథలు ఉంటాయని నమ్మే దర్శకుడు చేరన్. ‘నా ఆటోగ్రాఫ్’ లాంటి మనసుకు హత్తుకునే చిత్రాలతో మెప్పించిన ఈ తమిళ దర్శకుడు.. విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాని మిస్ అయ్యానని, అందుకు సారీ చెప్పాలని ఉందంటూ బాధపడుతున్నాడు. ఇటీవల తమ ఫేవరేట్ హీరో బర్త్ డే సందర్భంగా తన పాత ఫొటోస్, వీడియోస్​ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు విజయ్ అభిమానులు. అందులోని ఓ వీడియోలో చేరన్ ‘ఆటోగ్రాఫ్’ సినిమా గురించి విజయ్ ప్రశంసిస్తూ మాట్లాడింది కూడా ఉంది. అది చూసి ఎమోషనల్ అయిన చేరన్ ఓసారి ప్లాష్ బ్యాక్లోకి వెళ్లాడు. ‘ఆటోగ్రాఫ్’ (తెలుగు ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’కి ఒరిజినల్ వెర్షన్) సినిమాని విజయ్​తో తీయాలని స్క్రిప్ట్ నేరేట్ చేశాడట చేరన్. తన ఫోన్​ పక్కన పెట్టేసి మరీ, మంచినీళ్లు తాగడం మినహా మరే పని చేయకుండా మూడు గంటల పాటు ఆ కథ విన్నాడట విజయ్. అయితే అనుకోని కారణాలతో విజయ్ నటించలేదు. దాంతో చేరన్ తానే హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించాడు. సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. అప్పట్లో ఆ సినిమాని థియేటర్లో చూసిన విజయ్.. ఎలాంటి భేషజాలు లేకుండా తనకి ఫోన్ చేసి మరీ మెచ్చుకున్న విషయాన్ని ఇంకా మరచిపోలేదన్నాడు చేరన్. ఆ తర్వాత తనతో ఓ సినిమా చేస్తానని విజయ్ చెప్పినప్పటికీ తాను చేయలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు చేరన్. ‘నేను అప్పటికే కమిటైన ‘తవమై తవమిరుందు’ సినిమా గురించి ఆలోచించానే తప్ప విజయ్ లాంటి స్టార్ సినిమా మిస్ అవుతున్నానని ఆలోచించలేదు. ఆ పొరపాటు నేను చేసి ఉండాల్సింది కాదు. అందుకు ఇప్పటికైనా విజయ్ ను కలసి  క్షమాపణ కోరాలనుకుంటున్నాను’ అంటూ చాలా ఫీలవుతూ చెప్పాడు చేరన్.