సరి కొత్త సాఫ్ట్ వేర్ టూల్..మనిషి మాయమైపోవచ్చు.!

మాయలు, మంత్రాలున్నయా? ఒకరితో మాట్లాడుతుండగానే మనిషి మాయమైపోవచ్చా?.. ఏ కాలంలో ఉన్నరు.. ఇంకా ఈ మాయలు, మంత్రాలు అంటరేంటి అని గుస్స కావొద్దు. కానీ, ఓ మనిషి ఇట్లనే మాయమైండు. మాట్లాడుతనే కనిపించకుండ పోయిండు. ఇదేం ఓ బాబా మంత్రమో, మెజీషియన్​ అబ్రకదబ్ర ట్రిక్కో కాదు. నిజంగానే మాయమైండు. దాని కథేందో ఓ సారి తెలుసుకుంటే పోలే.. పదండి మరి.

ల్యాప్​టాప్​లోనో, ఫోన్​లోనో వీడియో కాల్​ మాట్లాడడం ఇప్పుడు కామన్​ అయిపోయింది. అదే అదనుగా చేసుకుంటున్న హ్యాకర్లు ఆ వెబ్​క్యామ్​, సెల్ఫీ క్యామ్​ను హ్యాక్​ చేసేసి, మనం ఏమేం చేస్తున్నామో చూసేస్తున్నారు. ఎక్కడో ఉండి మన కెమెరాలను ఆడిస్తున్నారు. మన ప్రైవేట్​ ఫొటోలు, వీడియోలు దోచేస్తున్నారు. వాటిని చేతిలో పెట్టుకుని బ్లాక్​మెయిలింగ్​కు దిగుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా దానికి ఎక్కువగా బాధితులవుతున్నది అమ్మాయిలే. మరి, హ్యాకర్ల కంట పడకుండా జాగ్రత్త పడే మార్గం లేదా అంటే ఎన్నో ఉన్నాయి. అన్నీ ఉన్నా ఇలా ‘మాయమైపోవడం’ కొత్త టెక్నిక్​. జాసన్​ మేయస్​ అనే గూగుల్​ వెబ్​ డిజైనర్​ ఈ సరికొత్త టెక్నిక్​కు రూపునిచ్చాడు. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అవతలి వాళ్లకు కనిపించకుండా మాయమైపోయేలా ఓ సరికొత్త అల్గారిథంను తయారు చేశాడు. జావా స్క్రిప్ట్​, యూజర్​ గూగుల్​ న్యూరల్​ నెట్​వర్క్​ను రీడ్​ చేసే టెన్సర్​ఫ్లో అనే మెషీన్​ లెర్నింగ్​లతో ‘మాయమైపోయే’ కొత్త టెక్నిక్​కు జీవం పోశాడు. ఈ అల్గారిథం అవతలి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు రియల్​టైంలో మాయమైపోయేలా చేస్తుంది. మనిషి మాయమైపోయినా వెనక బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఉండే వస్తువులు మాత్రం కనిపిస్తాయి.  తద్వారా మన ప్రైవసీకి సేఫ్టీని ఇస్తుంది. ఆ టెక్నిక్​పై యూట్యూబ్​లో డెమో ఇచ్చాడు జాసన్​ .

ఇంకా పర్​ఫెక్ట్​ కాదు గానీ..

ప్రస్తుతానికి ఈ టెక్నిక్​ కొత్తదే అయినా పూర్తి స్థాయిలో ఇంకా దానిని డెవలప్​ చేయలేదు. అంతేగాకుండా పూర్తి పర్​ఫెక్ట్​గా కూడా లేదు. ఎందుకంటే, సాఫ్ట్​వేర్​తో మనిషి మాయమైనా ఆ మనిషికి సంబంధించిన కొన్ని కొన్ని ఆనవాళ్లు వీడియోలో కనిపిస్తున్నాయి. పిక్సెల్స్​ స్కాటర్​ అయిపోయి చేతులు, కాళ్లు, వేళ్ల వంటివి అక్కడక్కడా మరకల్లా కనిపిస్తుంటాయి. అవి చిన్న లోపాలేనని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో దానిని డెవలప్​ చేసినప్పుడు  ఆ లోపాలన్నీ పోతాయని అంటున్నారు. ప్రస్తుతం సెల్​ఫోన్లలో వీడియో కాలింగ్​ ఎక్కువైపోయింది కాబట్టి, మొబైల్స్​కు ఈ ఫీచర్​ బాగా పనికొస్తుందని, ప్రైవసీ ‘సేఫ్​’గా ఉంటుందని చెబుతున్నారు. హ్యాకర్లు ఫోన్​ను గ్రిప్​లోకి తీసుకున్నా, కెమెరాను ఎక్కడి నుంచో ఆడించినా, మాయమైపోయే సాఫ్ట్​వేర్​ ఉన్న డివైస్​లలో ఎవరు ఏం చేస్తున్నారన్నది తెలుసుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో వెబ్​క్యామ్​లు హ్యాక్​ చేసి, అమ్మాయిలను వేధిస్తున్న సందర్భాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వాటికి ఈ టెక్నిక్​తో చెక్​ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ టూల్​ టెస్టింగ్​ దశలోనే ఉంది. దానికి మరిన్ని హంగులు అద్దే ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే మీరూ దీన్ని ఓ సారి ట్రై చేయొచ్చని చెబుతున్నారు. ‘గిట్​హబ్​(GitHub)’ రిపాసిటరీ నుంచి దాన్ని చెక్​ చేసి మాయమైపోయే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Latest Updates