పౌరసత్వంపై హైకోర్టుకెళతా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ రద్దుచేసింది. పలుమార్లు పౌరసత్వం విషయంలో చేదు అనుభవం ఎదుర్కొన్న రమేశ్ కు ఇవాళ కేంద్ర హోంశాఖ నుంచి వ్యతిరేక నిర్ణయం వచ్చింది. మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని రమేశ్ పొందాడనీ.. ఆయన సిటిజన్ షిప్ చెల్లదని తేల్చింది హోంశాఖ. 2009 నుంచి కొలిక్కి రాకుండా మలుపులు తిరిగిన ఈ కేసులో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

2009 ఎన్నికల ముందు వరకు జర్మనీలో ప్రొఫెసర్ గా పనిచేసిన రమేశ్.. పౌరసత్వం పొందే విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖను తప్పుదోవపట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. వేములవాడ ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్- కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ దీనిపై న్యాయస్థానాలకు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు కేవలం 96 రోజులు మాత్రమే కంటిన్యూగా భారతదేశంలో ఉన్నాడని… కాబట్టి ఏడాది పాటు దేశంలో ఉండాలన్న నిబంధనను అతిక్రమించినందున రమేశ్ పౌరసత్వం చెల్లదని శ్రీనివాస్ వాదించారు.

చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రమేష్ బాబు భారత పౌరుడు కాదని మళ్ళీ తేల్చేసింది. కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయంతో తాను మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే రమేష్ చెప్పారు. ఒకవేళ హైకోర్టు ఆయన పిటిషన్ విచారణకు స్వీకరించకపోతే కేంద్ర హోంశాఖ నిర్ణయమే ఫైనల్ అవుతుంది.

Latest Updates