అమెరికాకు ఇరాన్ వార్నింగ్: ట్రంప్‌‌ను వదిలిపెట్టం ..ఖమేనీ మృతికి మూల్యం చెల్లించుకోవాల్సిందే

అమెరికాకు ఇరాన్ వార్నింగ్: ట్రంప్‌‌ను వదిలిపెట్టం ..ఖమేనీ మృతికి మూల్యం చెల్లించుకోవాల్సిందే
  • ఇరాన్‌‌ సెక్యూరిటీ  కౌన్సిల్​ సెక్రటరీ అలీ లారిజానీ వార్నింగ్‌‌
  • మా వెయ్యి మంది పౌరులను పొట్టనపెట్టుకున్నడు
  • మేం అనేక మందిని మేం హతమార్చినం.. బందీలుగా చేసుకున్నం
  • అమెరికా, ఇజ్రాయెల్‌‌పై ప్రతీకార దాడులు కొనసాగిస్తున్నామని కామెంట్

టెహ్రాన్‌‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఇరాన్ సెక్యూరిటీ  కౌన్సిల్​ సెక్రటరీ అలీ లారిజానీ హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు.

‘‘ట్రంప్‌‌ను మేం వదిలిపెట్టం. అతను చేసిన దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మా నాయకుడిని హత్య చేయడమే కాకుండా వెయ్యి మందికి పైగా అమాయక ప్రజలను బలితీసుకున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు”అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అలీ లారిజానీ ‘ఎక్స్‌‌’లో పోస్ట్‌‌ పెట్టారు.

అమెరికా తమపై దాడులు చేయడానికి పొరుగు దేశాల గడ్డను ఉపయోగిస్తే, ఆ దేశాలపై కూడా ఇరాన్ ఎదురుదాడి చేస్తుందని హెచ్చరించారు. అజర్‌‌బైజాన్‌‌లాంటి దేశాల నుంచి ఎలాంటి శత్రు కార్యకలాపాలు జరిగినా సహించబోమని తెలిపారు.

అమెరికా సైనికులను బంధించినం

ప్రస్తుతం జరుగుతున్న పోరులో కొంతమంది అమెరికా సైనికులను హతమార్చామని, అనేకమందిని ఇరాన్ దళాలు బందీలుగా పట్టుకున్నాయని లారిజానీ వెల్లడించారు. వారిని జైళ్లలో ఉంచినట్లు తెలిపారు. ఇరాన్‌‌ దాడుల్లో ఆరుగురు   సైనికులే ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్‌‌ అబద్ధాలు ఆడుతున్నారని పేర్కొన్నారు.  

నిజానికి చాలా మందే చనిపోయారని, కొన్ని రోజుల తర్వాత  మృతుల సంఖ్య పెంచేస్తారని అన్నారు. ఇరాన్ పరిస్థితిని వెనెజువెలాతో పోల్చుకుని అమెరికా తప్పుగా అంచనా వేసిందని, ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

వెనెజువెలాలో మాదిరిగా ఇరాన్‌‌లో కూడా త్వరగా యుద్ధం ముగించేయాలనుకున్నారని.. కానీ , అది విఫలమైందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌‌పై ప్రతీకార దాడులను కొనసాగిస్తున్నామని లారిజానీ స్పష్టం చేశారు.