బెయిల్స్‌‌ మార్చే ప్రసక్తే లేదు : ఐసీసీ

icc-refuses-to-change-led-bails-mid-tournament

లండన్‌‌ : రోజురోజుకి  వివాదాస్పదంగా మారుతున్న  జింగ్‌‌ బెయిల్స్‌‌ అంశంలో  ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ కౌన్సిల్‌‌(ఐసీసీ) తన వైఖరిని స్పష్టం చేసింది. వరల్డ్‌‌కప్‌‌ టోర్నమెంట్‌‌ మధ్యలో బెయిల్స్‌‌ను మార్చే ప్రసక్తే లేదని తెలియజేసింది. బౌలర్‌‌ వేసిన బంతి వికెట్లకు తగిలినా పలుమార్లు జింగ్‌‌బెయిల్స్‌‌ కదలడం లేదు. దీంతో బ్యాట్స్‌‌మెన్‌‌ ఔట్‌‌ నుంచి తప్పించుకుంటున్నారు. ప్రస్తుత వరల్డ్‌‌కప్‌‌లోనే ఇప్పటివరకు ఇలా ఐదు సార్లు జరిగింది. టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌ బెయిల్స్‌‌ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని  ఐసీసీని కోరారు. దీనిపై ఐసీసీ స్పందిస్తూ.. ‘టోర్నీ మధ్యలో బెయిల్స్‌‌ను మార్చి ఈవెంట్‌‌ గౌరవాన్ని దెబ్బతీయలేం. టోర్నీలో పాల్గొంటున్న 10 దేశాలు ఆడే 48 మ్యాచ్‌‌ల్లో ఇవే బెయిల్స్‌‌ ఉంటాయి. 2015 వరల్డ్‌‌కప్‌‌ నుంచి నాలుగేళ్లుగా ప్రతీ ఐసీసీ ఈవెంట్‌‌తో పాటు పలు దేశవాళీ టోర్నీలో కూడా ఇవే బెయిల్స్‌‌ వాడాం. అంటే వెయ్యి కంటే ఎక్కువ మ్యాచ్‌‌ల్లో వీటిని పరీక్షించాం. గణాంకాల ప్రకారం బెయిల్స్‌‌ను నిందించడం కరెక్టు కాదు. ఇదంతా ఆటలో ఓ భాగం మాత్రమే, అయితే బ్యాట్స్‌‌మన్‌‌ను బౌల్డ్‌‌ చేయాలంటే అందుకు కొంత బలం అవసరం’ అని స్పష్టం చేసింది.

Latest Updates