బాల్ ట్యాంపరింగ్​ను లీగల్ చేసేందుకు ఐసీసీ పరిశీలన

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌‌లో బంతి మెరుపు కోసం ఆటగాళ్లు దానిపై  సలైవా (ఉమ్మి) పూస్తుంటారు. అలాగే, బాల్‌‌ను తమ జెర్సీలకు రుద్దుతూ షైనింగ్ తెస్తుంటారు. వీటికి అనుమతి ఉంది కానీ.. మరేరకంగా అయినా పాలిష్​ చేయడాన్ని  బాల్ ట్యాంపరింగ్​గా పరిగణిస్తారు. అయితే,  కరోనా వైరస్‌‌ వ్యాప్తికి ఉమ్మి కూడా కారణం కావడంతో బంతిపై సలైవా పూసేందుకు బౌలర్లు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో  క్రికెట్​ మళ్లీ మొదలయ్యాక.. బాల్ ట్యాంపరింగ్‌‌ను చట్ట బద్ధం చేయాలని ఐసీసీ యోచిస్తున్నట్టు సమాచారం. సలైవాపై నిషేధం పడే ఆస్కారం ఉండడంతో  అనుమతించిన కృత్రిమ పదార్థాల ద్వారా బాల్‌‌ను పాలిష్​ చేసేందుకు గ్రీన్ సిగ్నల్​ ఇవ్వాలన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఐసీసీ రూల్స్‌‌ను మార్చాల్సి ఉంటుంది.  బంతిపై సలైవా రుద్దడం సురక్షితం కాదని ఐసీసీ మెడికల్​ కమిటీ వ్యక్తం చేసిన అనుమానాలను  క్రికెట్​ తిరిగి మొదలయ్యే ముందే నివృత్తి చేసే అవకాశం ఉంది.  బాల్‌‌ను షైనింగ్‌‌ చేయడం టెస్టు క్రికెట్​లో ఒక భాగం. అలా చేసిన బాల్‌‌తో బౌలర్లు ఈజీగా స్వింగ్, రివర్స్ స్వింగ్ రాబడతారు. కానీ, ఈ సౌలభ్యం లేకపోతే టెస్టు క్రికెట్‌‌లో బౌలర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆస్ట్రేలియా పేసర్ జోష్​ హాజిల్‌‌వుడ్ అన్నాడు. అప్పుడు బ్యాట్స్‌‌మెన్‌‌దే పూర్తి ఆధిపత్యం అవుతుందని చెప్పాడు.  ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్​ప్రసాద్ మాత్రం బాల్‌‌పై సలైవా వాడకూడదన్న ఐడియాకు మద్దతు తెలిపాడు. కావాలంటే కొంతకాలం వరకు చెమటను రుద్దేందుకు అనుమతించాలన్నాడు.  అయితే, ఇప్పటిదాకా ఉన్న అలవాటును ఒక్కసారిగా మానడం బౌలర్లకు కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు.

Latest Updates