సచిన్ పేరు పలకలేక ట్రంప్ పాట్లు: ట్రోల్ చేస్తూ ఐసీసీ సెటైరికల్ వీడియో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన ట్విట్టర్ అకౌంట్‌లో సెటైర్ వేసింది. సచిన్ టెండూల్కర్ పేరు పలకలేక తప్పుగా సూచిన్ అనడంపై ఫన్నీగా  ట్రోల్‌లో చేస్తూ ఓ వీడియోను ట్వీట్ చేసింది. అగ్రరాజ్యాధినేత ట్రంప్.. క్రికెట్ కింగ్ సచిన్ పేరును సూచిన్ అని పిలవడంతో తన అఫీషియల్ రికార్డుల్లోనూ మారుస్తున్నట్లు వీడియో రూపొందించింది. సచిన్ టెండూల్కర్‌ అని ఉన్న పేరును మార్చి.. సూచిన్ టెండూల్కర్ అని సేవ్ చేస్తున్నట్లుగా ట్రంప్‌పై కామెడీ చేసింది ఐసీసీ.

రెండ్రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్ అక్కడి నుంచి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ తర్వాత మోతెరా స్టేడియానికి చేరుకుని.. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘నమస్తే.. హలో ఇండియా’ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ట్రంప్.. ఇండియన్ క్రికెట్ దిగ్గజాలు సచిన్, కోహ్లీల గురించి, బాలీవుడ్ సినిమాలు షోలే, డీడీఎల్జే గురించి ప్రస్తావించారు. వీటి గురించి ఆయన మాట్లాడగానే ప్రధాని మోడీ మొదలు పబ్లిక్ అంటూ హుషారుగా స్పందించారు.

‘ప్రపంచంలోనే గ్రేట్ క్రికెటర్లయిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్లను ఎంతో ప్రోత్సాహించే దేశమిది’ అని అన్నారు ట్రంప్. అయితే సచిన్ పేరును ఆయన సూచిన్ అని పలికారు. దీనిపై ఐసీసీ ట్రోల్ చేస్తూ సూచిన్ టెండూల్కర్‌గా రికార్డుల్లో పేరు మారుస్తున్నట్లు ట్విట్టర్లో వీడియో పెట్టింది. దీనిపై నెటిజన్లు ఇంకా ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఐసీసీనే ఇలా ట్రంప్‌పై జోక్ చేయడం సూపర్ అంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు.

Latest Updates