లక్షణాలున్న అందరికీ టెస్టులు చెయ్యాలి

 • టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని రాష్ట్రాలకు సూచన
 • యాంటీజెన్​ టెస్టులకూ ఓకే
 • స్టాండర్డ్​ క్యూ కొవిడ్​19 ఏజీ టెస్ట్​ కిట్లకు ఆమోదం
 • ఈ టెస్ట్​తో అరగంటలోపే రిజల్ట్​
 • నెగెటివ్​ వస్తే.. ఆర్టీపీసీఆర్​ టెస్ట్​
 • కంటెయిన్​మెంట్​ జోన్లు, ఆస్పత్రుల్లో వాడాలని సిఫార్సు
 • అనుమతి ఉన్న అన్ని ఆస్పత్రులు, ల్యాబుల్లో వాడేందుకు ఓకే

న్యూఢిల్లీ: కరోనా టెస్టులపై ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) మరోసారి క్లారిటీ ఇచ్చింది. దేశంలో లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. కరోనాను కట్టడి చేయాలన్నా, ప్రజల ప్రాణాలను కాపాడాలన్నా టెస్టులు చేయడం, కాంటాక్ట్​లను గుర్తించడమే మార్గమని చెప్పింది. టెస్టింగ్​ను మరింత పటిష్టం చేయాలని, పెద్ద సంఖ్యలో టెస్టులు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. దానికి తగ్గట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు టెస్టుల సంఖ్యను పెంచేలా టెస్ట్​ కిట్లు, మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. బుధవారం కరోనా టెస్టులపై ఐసీఎంఆర్​ తాజా గైడ్​లైన్స్​ విడుదల చేసింది. కొత్త రకం టెస్టులను అందుబాటులోకి తెచ్చింది. యాంటీజెన్​ బేస్డ్​ టెస్ట్​లకూ ఐసీఎంఆర్​ ఓకే చెప్పింది. ఆ టెస్టు కిట్లకు ఆమోదం తెలిపింది. ఈ టెస్ట్​ కిట్లతో కేవలం పావుగంట నుంచి అరగంటలోపే రిజల్ట్​ వస్తుంది.

దేశంలో ఇప్పటిదాకా ఆర్​టీపీసీఆర్​ కిట్లు, టీబీ టెస్టుల కోసం వాడే ట్రూనాట్​, సీబీనాట్​ పరికరాలతోనే టెస్టులు చేస్తున్నారు. తాజాగా యాంటీజెన్​ కిట్లతో చేసే ర్యాపిడ్​ పాయింట్​ ఆఫ్​ కేర్​ (పీవోసీ) టెస్టులకూ ఐసీఎంఆర్​ ఆమోదం తెలిపింది. గురుగ్రామ్​లోని ఎస్​డీ బయోసెన్సర్​ అనే సంస్థ తయారు చేసిన స్టాండర్డ్​క్యూ కొవిడ్​19 ఏజీ కిట్​కు ఓకే చెప్పింది. ఢిల్లీలోని ఎయిమ్స్​, ఐసీఎంఆర్​ సైంటిస్టులు టెస్టు కిట్లను పరీక్షించారని తెలిపింది. ఫలితాలను తెలుసుకునేందుకు ఎలాంటి ప్రత్యేక మెషీన్లు అవసరం లేదని, మామూలు కంటితోనే పసిగట్టొచ్చని పేర్కొంది. ఈ కిట్లతో పాజిటివ్​గా తేలితే కరోనా కేసుగా లెక్కించొచ్చని, ఒకవేళ నెగెటివ్​ వస్తే మళ్లీ ఆర్టీపీసీఆర్​ (రియల్​టైం) టెస్ట్​ చేయాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఆ టెస్ట్​ కిట్లను వాడొచ్చని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా యాంటీజెన్​ కిట్లతో కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పింది.

ఎవరెవరు చేయొచ్చు..

 • ప్రభుత్వాలు గుర్తించిన అన్ని కంటెయిన్​మెంట్​ జోన్లలో పీవోసీ యాంటీజెన్​ టెస్ట్​ కిట్లను వాడొచ్చు.
 • అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్​ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాడొచ్చు.
 • నేషనల్​ అక్రెడిటేషన్​ బోర్డ్​ ఫర్​ హాస్పిటల్స్​ అండ్​ హెల్త్​కేర్​ (ఎన్​ఏబీహెచ్​) ఆమోదం తెలిపిన అన్ని ప్రైవేట్​ ఆస్పత్రులకూ అనుమతి.
 • నేషనల్​ అక్రెడిటేషన్​ బోర్డ్​ ఫర్​ లేబొరేటరీస్​ (ఎన్​ఏబీఎల్​), ఐసీఎంఆర్​ ఓకే చెప్పిన కొవిడ్​ 19 టెస్టింగ్​ ల్యాబుల్లోనూ వీటితో టెస్టులు చేయొచ్చు.
 • పీవోసీ యాంటీజెన్​ టెస్టులు చేయాలనుకునే రాష్ట్రాలు, అన్ని ఆస్పత్రులు, ల్యాబులు ఐసీఎంఆర్​కు దరఖాస్తు చేసుకోవాలి.
 • ఎప్పటికప్పుడు టెస్టింగ్​ అవసరాలను ఐసీఎంఆర్​కు తెలియజేయాలి.
 • పీవోసీ యాంటీజెన్​ టెస్టుల్లో లక్షణాలున్న వ్యక్తికి నెగెటివ్​ వస్తే రియల్​టైం ఆర్​టీపీసీఆర్​ టెస్ట్​ను కచ్చితంగా చెయ్యాలి. అందుకు యాంటీజెన్​ టెస్ట్​ చేసే
 • ల్యాబులు ఆర్టీపీసీఆర్​ టెస్టులు చేసే దగ్గర్లోని ల్యాబుతో టై అప్​ అవ్వాలి.
 • శాంపిల్​ను నోటి నుంచి లేదా ముక్కు నుంచి మాత్రమే తీసుకోవాలి

నిఘా కోసమే ఐజీజీ యాంటీబాడీ టెస్ట్​

కరోనాను గుర్తించేందుకు ఐజీజీ యాంటీబాడీ టెస్టును చేయొద్దని, దానిని కేవలం నిఘా కోసమే వాడాలని ఐసీఎంఆర్​ సూచించింది. వైరస్​ ఎంతమందికి సోకిందో తెలుసుకునే సీరో సర్వేల్లో దీనిని వాడొచ్చని చెప్పింది. లక్షణాల్లేని వాళ్లందరికీ చేయొచ్చని తెలిపింది. వైరస్​ ముప్పు ఎక్కువగా ఉండే హెల్త్​కేర్​ వర్కర్లు, ఫ్రంట్​లైన్​ వర్కర్లు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్లకు, కంటెయిన్​మెంట్​ జోన్లలోని జనాలకు వీటితో టెస్టులు చేయొచ్చని పేర్కొంది. అందుకు ఎలీసా, సీఎల్​ఐఏ కిట్లను వాడాలని సూచించింది.

కంటెయిన్​మెంట్​ జోన్లలో టెస్టులు ఇలా…

ఫ్లూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ చెయ్యాలి. పాజిటివ్​ వచ్చిన వ్యక్తులను నేరుగా కలిసిన వాళ్లకూ లక్షణాలు లేకున్నా చెయ్యాలి. లంగ్స్​ డిసీజ్​, గుండె జబ్బులు, లివర్​, కిడ్నీ, షుగర్​, నరాలు, రక్త సంబంధిత జబ్బులున్న హై రిస్క్​ కాంటాక్ట్​లకు టెస్ట్​ తప్పనిసరి. లక్షణాలు లేని వాళ్లందరికీ పాజిటివ్​ వచ్చిన వ్యక్తిని కాంటాక్ట్​ అయిన 5 నుంచి 10 రోజులలోపు టెస్ట్​ చేయాలి.

హెల్త్​కేర్​ ఫెసిలిటీస్​లో..

1. ఇన్​ఫ్లుయెంజా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన అందరికీ టెస్టులు చేయాలి.

2. ఆస్పత్రుల్లో చేరిన లక్షణాలు లేని పేషెంట్లకు, కరోనా భయంతో ఆస్పత్రుల్లో చేరాలనేకునేవారికీ చేయాలి.

3నరాలు, గొంతు, ముక్కు, చెవి సర్జరీ, పళ్ల సర్జీలు చేసుకున్న వాళ్లకు టెస్టులు చెయ్యాలి. కోతలు లేని ఆపరేషన్లైన బ్రాంకోస్కోపీ, అప్పర్​ జీఐ ఎండోస్కోపీ, డయాలిసిస్​ పేషెంట్లకు టెస్టులు తప్పనిసరిగా చెయ్యాలి.

 • కీమోథెరపీ చేయించుకుంటున్న వాళ్లకు
 • హెచ్​ఐవీ పేషెంట్లు సహా ఇమ్యూనిటీ పవర్​ లేని వాళ్లకు
 • కేన్సర్​ ఉందని తేలిన పేషెంట్లకు
 • అవయవ మార్పిడి చేసుకున్న పేషెంట్లకు
 • ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, లివర్​ జబ్బులు, షుగర్​, నరాలు, రక్త సంబంధిత సమస్యలున్న హైరిస్క్​ గ్రూప్​లోని 65 ఏళ్లకుపైబడిన వృద్ధులకు టెస్టులు తప్పనిసరిగా చెయ్యాలి.

Latest Updates