రైతన్నా తిన్నవానే!

  • ఏం తిన్నవ్​.. ఎంత తిన్నవ్​.. సరిపోయిందా?
  •  అన్నదాత తిండి, ఆరోగ్యంపై స్టడీ

ఆదిలాబాద్​, వెలుగు: మనం కడుపు నిండా తింటున్నాం. హాయిగా బతుకుతున్నాం. తెలిసినోళ్లు ఎవరైనా ఎదురైతే తిన్నరా అని అడుగుతున్నాం. మరి, మన కడుపు నింపుతున్న ఆ రైతన్న కడుపు నిండుతున్నదా అని ఎప్పుడైనా ఆలోచించారా! అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్​), బ్రిటన్​లోని రీడింగ్​ ఈస్ట్​ ఇంగ్లిష్​ యూనివర్సిటీ, కేంద్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖలు కలిసి అదే ఆలోచన చేశాయి. వాళ్లు తింటున్నారా, ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఆ తిండికి తగ్గ శక్తి ఉంటుందా, పోషకాహారం తీసుకుంటున్నారా అన్న అంశాలపై పరిశోధనలు చేయబోతున్నారు. మన రాష్ట్రం, ఒడిశాల్లో మూడు చొప్పున ఊళ్లలో పైలట్​ ప్రాజెక్టు కింద సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా ఆదిలాబాద్​ జిల్లాలోని ఉట్నూర్​ మండలంలో ఉన్న మూడు ఊళ్లను ఎంచుకున్నారు. మత్తడిగూడ, చందూరి, కామాయిపేట్​లలోని రైతుల ఆహార స్థితిగతులను తెలుసుకోనున్నారు. రైతులకు ఆక్టీగ్రాఫ్​, గుండె కొట్టుకునే రేటు వంటి పరీక్షలు చేస్తారు. ఆయా గ్రామాల్లోని 90 శాతం మంది జనం తీవ్రమైన పోషకాహార, హిమోగ్లోబిన్​ లోపంతో బాధపడుతున్నారని తేలడంతోనే ఈ మూడు ఊళ్లను ఎంపిక చేశారు.

మూడు రోజులు.. మూడు పరీక్షలు

రైతులకు మూడు రోజుల పాటు మూడు పరీక్షలను చేయనున్నారు. రైతు ఎంత కష్టపడుతున్నాడు? ఎంతసేపు పొలంలో పనిచేస్తున్నాడు? ఎంత తింటున్నాడు.. ఏం తింటున్నాడు? అన్నవాటిని తెలుసుకుంటారు. రైతు గుండె పనితీరును తెలుసుకునేందుకు ఛాతి దగ్గర హార్ట్​రేట్​ మానిటర్​ను పెడతారు. అది రైతు గుండె కొట్టుకునే వేగం, హార్ట్​ రేటును రికార్డు చేస్తుంది. నడుముకు యాక్టిగ్రాఫ్​ సెన్సర్​ను కడతారు. దానితో రైతు చేస్తున్న పని, తీసుకుంటున్న విశ్రాంతిని పరిశీలిస్తారు. ఈ రెండు పరికరాలు ప్రతి మూడు క్షణాలకోసారి రికార్డింగులను సేవ్​ చేస్తుంటాయి. తినే తిండి గురించి తెలుసుకునేలా వారికి కొన్ని స్పెషల్​ పాత్రలు ఇస్తారు. ఆ పాత్ర ద్వారా వాళ్లు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, ఎంత శక్తి వస్తోంది, ఆ శక్తి రైతుకు సరిపోతుందా, లేదా అదనంగా ఇవ్వాలా అన్న దానిని నిర్ధారిస్తారు. మూడు రోజుల పాటు ఆయా పరికరాలు రికార్డు చేసిన వివరాలతో నివేదిక తయారు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తారు. దాని ఆధారంగా రైతు ఆరోగ్యం, తినే ఆహారంపై అనుసరించాల్సిన విధానాలను తయారు చేస్తారు. బీమా పథకాలనూ దాని ఆధారంగానే ఇస్తారు.

మూణ్నాళ్ల ముచ్చట కావొద్దు

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందంటూ ఇన్నాళ్లూ అందరూ మాటలు మాత్రమే చెప్పారు. ఇప్పుడు రైతులపై పరిశోధనలు చేసి, వారి అవసరాలను తీరుస్తామని చెప్పడం బాగుంది. అయితే, ఇది మూణ్నాళ్ల ముచ్చట కాకుండా ఎప్పుడూ కొనసాగేలా చూడాలి. – సిడాం లచ్చు, రైతు, మత్తడిగూడ

అన్నిరకాల పరీక్షలు చేస్తాం

రైతుల భవిష్యత్​కు సంబంధించిన విషయమిది. అందుకోసమే ప్రతి పరీక్షను కట్టుదిట్టంగా చేస్తాం. పారదర్శకంగా నివేదిక ఇస్తాం. దీనితో రైతుకు మున్ముందు లాభం కలిగే అవకాశాలున్నాయి. దీని కోసం గ్రామానికో ఎన్యుమరేటర్​లను నియమించారు కూడా.–  పీ బాబు, సీనియర్​​ ఫీల్డ్​ ఇన్వెస్టిగేటర్​​

Latest Updates